Sunday, April 28, 2024

రైతులను కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ సర్కార్

- Advertisement -
- Advertisement -

రైతు రాజ్యం తెస్తామన్నారు…ఇప్పుడు రైతులను కాంగ్రెస్ కన్నీరు పెట్టిస్తోంది’ అని కరీంనగర్ మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లో మాజీ సిఎం కెసిఆర్ కదనభేరి సభను విజయవంతం చేయాలని, ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్‌తో కలిసి సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటై ఉంటే ఇప్పటివరకు మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేసి రైతులకు సాగునీళ్లు ఇచ్చేవాళ్ళమని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ వస్తే రైతురాజ్యం వస్తుంది…రైతులను కడుపులో పెట్టుకుంటాం..రైతుభరోసా ద్వారా 15 వేలు ఇస్తాం.. రైతు రుణమాఫీ రూ.2 లక్షలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కన్నీరు పెట్టిస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ దగ్గర మూడు పిల్లర్లు కుంగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు కావస్తున్నా ఇప్పటివరకు మరమ్మతులు చేయలేదని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై కుట్రతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలిస్తే మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్ల దగ్గర కాఫర్ డ్యాం కట్టి సాగునీటి ప్రాజెక్టులోకి నీళ్లు ఎత్తిపోసేవాళ్ళమని అన్నారు. గోదావరి నదిలో ప్రతి రోజు 5000ల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయ ని.. ఇప్పటివరకు 95 రోజుల్లో 45 టిఎంసిల నీళ్లు వృధాగా పోయాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏది అవసరం అనేది ఆలోచన చేయాలని..కానీ ప్రభుత్వ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం లేదన్నారు. ఈ యాసంగి సీజన్‌లో ప్రాజెక్టుల్లో నీళ్లు లేక చెరువులు, కుంటల్లోకి నీళ్లు విడుదల చేయకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బావులు, బోర్లు ఎండడంతో రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు కళ్ళ ముందు ఎండిపోతుంటే రైతులు ఎండిన పంటలకు అగ్గి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్ళలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వరి పంట కోసేందుకు మిషన్లు దొరకలేదని… కాంగ్రెస్ పాలనలో సాగు నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇంజనీర్ల సలహాలు తీసుకుని మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేసి నీళ్లు పంపింగ్ చేయాలని కోరారు. కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతున్న సాగునీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని, ఇప్పటివరకు ఎందుకు కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతువ్యతిరేక ప్రభుత్వంగా మారిందన్నారు. ఈ సమావేశంలో మేయర్ సునీల్ రావు, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణ రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంక ర్, లోక బాపురెడ్డి, పొన్నం అనీల్ గౌడ్, తిరుపతి నాయక్, రూప్ సింగ్, జక్కుల నాగరాజు యాదవ్, నాగి శేఖర్ , షౌకత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News