Friday, May 3, 2024

ఎంఎల్‌సి కవితకు సుప్రీంకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎంఎల్‌సి కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 26 వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. నళినీ చిందబరం తరహాలోనే తనకూ ఊరట ఇవ్వాలని ఎంఎల్‌సికవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆమె వేసిన పిటిషన్‌పై ఇడి న్యాయవాది స్పందనను సుప్రీం ధర్మాసనం కోరింది. అందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 26 వరకు సమన్లు జారీ చేయవద్దని ఇడికి జస్టిస్ కౌల్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. అందులో శుక్రవారం ఢిల్లీలోని ఇడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఉంది. ఈ విషయంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద తనకు ఇడి సమన్లు జారీ చేయడాన్ని ఆమె సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. ఇడి జారీ చేసిన సమన్లు మహిళలను వారు నివసించే చోటే విచారించాలన్న సిఆర్‌పిసిలోని సెక్షన్ 160 నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నందున వెంటనే వాటిని కొట్టేయాలని కవిత కోరారు. దీంతో సుప్రీంకోర్టు కాజ్‌లిస్ట్ ప్రకారం శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చి ఈ నెల 26 వరకు సమన్లు జారీ చేయవద్దని ఇడికి ఆదేశాలు జారీ చేసింది.

వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్, ఎంఎల్‌సి కవితలు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు చెల్లించి ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించుకొని అనుచిత లబ్ధి పొందారన్నది ఇడి ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలో ఆ సంస్థ గత మార్చి 16, 20, 21వ తేదీల్లో కవితను ఢిల్లీలో విచారించింది. ఈ కేసులో వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అఫ్రూవర్‌గా మారారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News