Sunday, April 28, 2024

మహిళా పోలీసుల కోసం మొబైల్ రెస్ట్ రూమ్, టాయిలెట్ సదుపాయం

- Advertisement -
- Advertisement -

women police

 

హైదరాబాద్ ః మహిళా పోలీసుల సౌకర్యార్థం దేశంలోనే మొట్టమొదటి సారిగా మొబైల్ రెస్ట్ రూమ్, టాయిలెట్ వాహనాల సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నగరంలోని డిజిపి కార్యాలయంలో శుక్రవారం మహిళా పోలీసులకు సంబంధించిన 17 మొబైల్ రెస్ట్ రూం, టాయిలెట్ వాహనాలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా హోం మంత్రి మాట్లాడుతూ.. మహిళా పోలీసుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని, వారి సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

తొలివిడతలో భాగంగా 17 వాహనాలను కొనుగోలు చేయడం జరిగిందని, అనతికాలంలో ప్రతీ జిల్లాకు ఒకటి చొప్పున అందిస్తామన్నారు. ఒక్కొ వాహనానికి రూ. 29 లక్షలు వ్యయం చేశామని, తొలివిడతలో 17 వాహనాలను ప్రారంభిస్తున్నామన్నారు. ప్రస్తుతానికి మొబైల్ టాయిలెట్ వాహనాలను మేడారం జాతరలో మహిళా పోలీసుల కోసం వినియోగించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని దీనిలో భాగంగానే రాష్ట్రంలో పోలీస్ నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లను కల్పించామని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం చేపట్టిన 27 పోలీసు నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పించిన ఘనత సిఎం కెసిఆర్‌కు మాత్రమే దక్కిందన్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ ఆధునీకరణ నిమ్తితం రూ. 400 కోట్ల వ్యయంతో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను నిర్మిస్తున్నామని తెలియచేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో తెలంగాణా పోలీసులు దేశంలోనే అగ్రభాగాన వున్నారని, పోలీస్‌స్టేషన్లకు వెళ్లడమంటే ప్రజలు స్వంత ఇళ్లకు వెళుతున్నట్లుగా భావిస్తున్నారని స్పష్టం చేశారు. అత్యుత్తమమైన పోలీసింగ్, అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నందునే తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉండటం, హైదరాబాద్ నగరంలో దేశ,విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు భారీఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని, దీంతో రాష్ట్రం పారిశ్రామికంగా దూసుకు పోతోందని వివరించారు.

రాష్ట్ర ప్రజల భద్రత దృష్టా ఇప్పటి వరకు నాలుగు లక్షలకు పైగా సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం మహిళా మొబైల్ టాయిలెట్ లో కల్పించిన సదుపాయాలను హోమ్ మంత్రి మహమూద్ అలీ పరిశీలించారు. మహిళా పోలీసుల కోసం మొబైల్ టాయిలెట్, రెస్ట్‌రూం సదుపాయం కల్పించడం పట్ల డిజిపి, ఇతర పోలీసు అధికారులను ఈ సందర్బంగా మంత్రి అభినందించారు. కార్యక్రమంలో డిజిపి మహేందర్ రెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త, అడిషనల్ డిజిలు, సీనియర్ పోలీస్ అధికారులు జితేందర్, శివధర్ రెడ్డి, స్వాతి లక్రా, గోవింద్ సింగ్, నవీన్ చంద్, నాగిరెడ్డి, సంజీవ్ కుమార్ జైన్ తదితరులు హాజరయ్యారు.

Mobile restroom and toilet facility for women police
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News