Sunday, May 12, 2024

‘నవోదయ’లో తెలంగాణకు తీరని అన్యాయం

- Advertisement -
- Advertisement -

Navodaya schools

 

హైదరాబాద్ : నవోదయ స్కూల్స్ ను ఏర్పాటు చేసే విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం నీతి ఆయోగ్ (పూర్వ కేంద్ర ప్రణాళికా సంఘం) వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌కు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ స్కూల్ ను ఏర్పాటు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉండగా, కొత్తగా మరో 23 జిల్లాలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా, జనాభా దాదాపుగా నాలుగు కోట్లకు చేరుకుంటోందని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం కేవలం తొమ్మిది నవోదయ స్కూల్స్ మాత్రమే ఉన్నాయన్నారు.

కొత్తగా మరో 24 నవోదయ స్కూల్స్ ఏర్పాటు కావాలని, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 33 నవోదయ విద్యాలయాలు ఉండాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. నవోదయ స్కూల్స్ విషయంలో తెలంగాణ పట్ల చారిత్రక అన్యాయం జరుగుతోందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ ప్రధాన మంత్రిని కోరారని ఆయన గుర్తు చేశారు. తాను ఎంపిగా ఉండగా పార్లమెంటు సభలో ఈ విషయాన్ని ప్రస్తావించానని వినోద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ కన్నా తక్కువ జనాభా ఉన్న ఉత్తర, మధ్య భారత దేశ రాష్ట్రాలకు వక్రంగా పెద్ద ఎత్తున నవోదయ స్కూల్స్ కేటాయించారని ఆయన విచారం వ్యక్తం చేశారు.

అన్ని రంగాల్లో శరవేగంగా పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపడం సరికాదన్నారు. చత్తీస్ ఘడ్, జార్ఖండ్, అస్సాం, హర్యానా వంటి రాష్ట్రాల కన్నా తెలంగాణలో జనాభా సంఖ్య ఎక్కువగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అక్షరాశ్యతను మరింత పెంచేందుకు సిఎం కృషి చేస్తున్నారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. అందుకోసం ’ఈచ్ వన్ -టీచ్ వన్’ అనే అక్షర ఉద్యమాన్ని చేపట్టారని ఆయన తెలిపారు. తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ స్కూల్ ను ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంత బాల, బాలికలకు ఎంతో ఉపయోగపడుతుందని వినోద్ కుమార్ వివరించారు. తద్వారా అక్షరాశ్యత శాతం కూడా పెరుగుతుందని అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని వినోద్ కుమార్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌ను కోరారు.

Unfair to Telangana in setting up Navodaya schools
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News