Tuesday, April 30, 2024

ఒకే గ్యాస్ పైప్‌లైన్ గ్రిడ్‌తో దేశం అనుసంధానం

- Advertisement -
- Advertisement -

Modi promises to double India's natural gas pipeline

ఇంధన రోడ్‌మ్యాప్ ప్రకటించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఇంధన రంగానకి సంబంధించి ప్రభుత్వ రోడ్ మ్యాప్‌ను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. కేరళలోని కోచ్చి నుంచి కర్నాటకలోని మంగళూరుకు నిర్మించిన 450 కిలోమీటర్ల పొడవైన సహజ వాయువు పైప్‌లైన్‌ను ప్రధాని మోడీ ప్రారంభిస్తూ వినియోగదారుల రంగంలో స్వచ్ఛమైన సహజ వాయువు వినిమయాన్ని రెట్టింపు చేయాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. దేశ ప్రజలకు, పరిశ్రమలకు అందుబాటు ధరలలో ఇంధనాన్ని తీసుకురావడానికి దేశాన్ని ఒకే గ్యాస్ పైప్‌లైన్ గ్రిడ్‌తో అనుసంధానించనున్నామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో దేశంలో హైవేలు, రైల్వే, మెట్రో, విమానయానం, నీరు, డిజిటల్, గ్యాస్ కనెక్టివిటి రంగాలలో ఊహించని రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇది దేశ ఆర్థికాభివృద్ధి ఎంతగానో తోడ్పతాయని మోడీ తెలిపారు.

ఇంధన రంగానికి సంబంధించిన ప్రణాళికలో తమ ప్రభుత్వ సమీకృత వైఖరిని తీసుకుంటోందని ఆయన తెలిపారు. గడచిన ఐదారేళ్లలో దేశంలో సహజ వాయువు పైప్‌లైన్ వ్యవస్థ రెట్టింపు పెరిగి దాదాపు 32,000 కిలోమీటర్లకు చేరుకుందని, మరో పక్క గాలిమరలు, సౌర విద్యుత్‌తో కూడిన ప్రపంచంలోనే అతి పెద్ద రిన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ గుజరాత్‌లో ప్రారంభమైందని ప్రధాని వివరించారు. విద్యుత్‌తోపాటు బయో ఇంధనాల తయారీపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. రానున్న పదేళ్లలో పెట్రోల్ వాడకం 20 శాతం తగ్గి దాని స్థానంలో చెరకు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వెలికితీసే ఎథనాల్ భర్తీ చేయగలదని ఆయన అంచనా వేశారు. దీని వల్ల చమురు దిగుమతులపై ఆధారపడడం తగ్గడమే కాకుండా వాయు కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన తెలిపారు. 1992లో దేశంలో మొదటిసారి ఆటోమొబైల్స్‌కు ఇంధనంగా కంప్రెస్డ్ సహజ వాయువు వాడకాన్ని కనిపెట్టిన తర్వాత 2014 వరకు దేశంలో మొత్తం 900 సిఎన్‌జి స్టేషన్లు ఏర్పాటయ్యాయని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం గత ఆరేళ్లలో 1500కు ఈ సంఖ్యను పెంచిందని, ఈ సంఖ్యను 10,000కు పెంచాలన్నదే తమ లక్షమని ప్రధాని తెలిపారు. అంతేగాక..2014 వరకు వంట గ్యాస్ కనెక్షన్ల పైప్‌లైను 25 లక్షల కుటుంబాలకు ఉండగా ఇప్పుడా సంఖ్య 72 లక్షలకు పెరిగిందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News