Monday, May 6, 2024

అర్థరాత్రి నేపాల్ విలవిల

- Advertisement -
- Advertisement -

ఖాట్మాండు : నేపాల్‌లోని పర్వతపంక్తుల పశ్చిమ ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి పెనుభూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై అత్యంత శక్తివంతంగా 6.4 పాయింట్ల తీవ్రతతో భూమికంపించడంతో కనీసం 143 మంది దుర్మరణం చెందారు. మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి గురించి ఇప్పటికిప్పుడు పూర్తి సమాచారం రాలేదు. దీనితో మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుందని శనివారం స్థానిక అధికారులు తెలిపారు. లోతట్టు పర్వత ప్రాంతం అయిన జజర్కోట్ జిల్లాలో భూకంప కేంద్రం నెలకొని ఉందని గుర్తించారు. ఇది దేశ రాజధాని ఖాట్మాండుకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. శుక్రవారం దాదాపు అర్థరాత్రివేళ 11.47 నిమిషాలకు భూ విలయం చోటుచేసుకుంది. అప్పటికీ అత్యధిక జనం నిద్రలో ఉన్నారు. పలువురు నిద్రలోనే చనిపోయినట్లు వెల్లడైంది. 2015 తరువాత సంభవించిన పెనుభూకంపం ఇదే. అప్పటి భూకంపంలో దాదాపు 9000 మంది మృతి చెందారు. ఇప్పటికీ అత్యధిక సంఖ్యలో జనం అప్పుడు దెబ్బతిని, ఇప్పటికి ఆర్థికంగా , శారీరకంగా కోలుకోలేని స్థితిలో ఉన్నారు. అప్పటి ఘటనలో 22వేల మంది వరకూ గాయపడ్డారు. శుక్రవారం రాత్రి భూకంపంలో వందలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పలువురు వీధుల పాలయ్యారు. ఇప్పుడిప్పుడే ఏర్పాటు అవుతున్న సహాయక శిబిరాల్లో, తాత్కాలిక గుడారాలలో జనం చేరుకుంటున్నారు.

పలు జిల్లాలు చివరికి ఢిల్లీ వరకూ ప్రకంపనలు
శుక్రవారం రాత్రి వచ్చిన భూకంప తీవ్రత ప్రభావం దూర ప్రాంతాల వరకూ కన్పించింది. సమీపంలోని పలు జిల్లాలు, చివరికి భారతదేశంలోని ఢిల్లీ, యుపి, బీహార్‌లలో కూడా భూమి కంపించింది. జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతను పసిగట్టి వెంటనే నేపాల్ సైన్యం సహాయక చర్యలకు దిగింది. పలు ప్రాంతాలకు సైనిక సహాయక బృందాలను పంపించినట్లు సైనిక అధికార ప్రతినిధి కృష్ణ ప్రసాద్ భండారి తెలిపారు. శుక్రవారం రాత్రి జరిగిన విధ్వంసం ఎంతటి తీవ్రస్థాయిలో ఉందనేది శనివారం ఉదయం ఇళ్ల శిధిలాలు, జనం హాహాకారాల నడుమ తెలిసివచ్చింది. పేరుకుపోయిన శిథిలాలను తొలిగించి ఇళ్ల నుంచి మృతదేహాలను వెలికితీసే పని క్రమేపీ వేగం పుంజుకొంది. జజర్కోట్, రుకుమ్‌లలో మృతుల సంఖ్య 140 దాటింది. ఈ రెండు జిల్లాలు తీవ్రస్థాయిలో ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు. ప్రకృతి విలయంపై దేశ ప్రధాన మంత్రి సచివాలయం స్పందించింది. ప్రధాన ప్రకంపన తరువాత దాదాపు 159 అనంతర ప్రకంపనలు నెలకొన్నాయి. దీనితో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ ప్రాంతాలలో 150 మందికి పైగా గాయపడ్డారు. జజర్కోట్ జిల్లాలోని నల్గాధ్ మున్సిపాల్టీ డిప్యూటీ మేయర్ సరితా సింగ్ కూడా మృతులలో ఉన్నారు. పలు అనంతర ప్రకంపనలు తీవ్రస్థాయి నష్టానికి దారితీశాయని జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధనా కేంద్రం తెలిపింది.

ప్రభావిత ప్రాంతాలలో ప్రధాని ప్రచండ పర్యటన
రాత్రంతా జనం భూకంప భయాలతో వీధుల్లోనే గడిపారు. కూలిపోయిన ఇళ్ల శిథిలాలను తొలిగిస్తూ తమ వారి కోసం వెతుకుతూ ఉండాల్సి వచ్చింది. చిమ్మచీకట్ల నడుమ జనం తమ వారికోసం వెతుకులాటలో పడి రోదిస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలు వైరల్ అయ్యాయి. శనివారం ఉదయం దేశ ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండ అధికారులు, వైద్య బృందంతో కలిసి భూకంప ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ప్రజలను పలకరించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. తరువాత జజర్కోట్ నుంచి సుర్కేత్‌కు వచ్చారు. తీవ్రంగా గాయపడ్డ ఏడుగురిని ఆయన తన వెంట తీసుకువచ్చి ఆసుపత్రులలో చేర్పించారు. హెలికాప్టర్‌లో భూకంప ప్రాంతానికి వెళ్లిన ప్రధాన మంత్రి హెలికాప్టర్‌ను సహాయక చర్యల కోసం అక్కడనే ఉంచి తాను రెగ్యులర్ విమానంలో తిరిగి రాజధానికి చేరారు. భూకంపంలో పలువురు మృతి చెందడం, అపార నష్టం సంభవించడంపై ప్రచండ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నేపాల్‌లో భూకంప విలయంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. భారతదేశం తరఫున పూర్తి స్థాయి సాయం అందుతుందని వెల్లడించారు. నేపాల్ అధ్యక్షులు రామచంద్ర పౌడెల్ తమ విచారం వ్యక్తం చేశారు.

భూకంప తాకిడి ప్రాంతంలోని నేపాల్‌కు తరచూ విలయాలే
అత్యంత తీవ్రస్థాయి రాపిడికి గురయ్యే టిబెటియన్, ఇండియన్ రాతి పలకల ఘర్షణల అంతర్భాగ ప్రాంతంలో నేపాల్ నెలకొని ఉంది. పర్వతాలు విస్తరించుకుని ఉండటం టెక్టోనిక్ ప్లేట్స్ రాపిడి పరిణామాలతో తరచూ భూకంపాలు సంభవిస్తూ వస్తున్నాయి. రెండు కీలక ఫలకాలు ఇప్పటికే రెండు మీటర్లు సమీపానికి వచ్చాయి. ప్రతి శతాబ్ధానికి ఈ దూరం తగ్గుతూ ఉండే క్రమంలో భూమి పొరలలో తలెత్తే తీవ్రస్థాయి ఒత్తిడి చివరికి భూకంపాల రూపంలో వెలువడుతూ వస్తోంది. ఇది ఈ దేశానికి ప్రకృతిపరంగా ఖరారు అయిన కరకు వీలునామా అయి కూర్చుంది. గత నెల 16 వ తేదీన నేపాల్‌లోని సుదురుపశ్చిమ ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.8 . తరువాత 22న 6.1 తీవ్రతతో ఖాట్మాండులో భూమి కంపించింది. భూమిపొరలలో రాళ్ల రాపిడి క్రమంలో చాలా కాలంగా తీవ్రస్థాయి ఇంధన ఉత్పత్తి జరుగుతూ వస్తోంది. ఇది తరచూ భూకంపాలకు , పెను విలయాలకు దారితీస్తుందని సీనియర్ సిస్మాలిజిస్టు భారత్ కోయిరాలా తెలిపారు. ప్రత్యేకించి నేపాల్ పశ్చిమ ప్రాంతం ఎక్కువగా భూకంపాల తాకిడికి గురవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News