రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిదిలోని మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ నెల్కి సుగుణాకర్ శుక్రవారం ఎసిబి దాడులలో దొరికిపోయారు. ఎస్‌ఐపై ఆర్‌టివో కేసు నమోదు చేసినట్లు ఎసిబి, ఎసిపి విజయ్‌కుమార్ తెలిపారు. ఎసిపి విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…. జనవరి 25వ తేదిన జరిగిన ఒక కేసు విషయంలో ప్రభంజన్ అనే వ్యక్తి నుండి 2 లక్షలు రుపాయలను ఎస్‌ఐ సుగుణాకర్ తీసుకొని సీజ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. నేరంలో పాల్గొన్న వారిని అరెస్టు చేసి 2 లక్షల రుపాయలు స్వాధీనం చేసుకొని వారిని జ్యుడిషియల్ కస్టడికి తరలించడం జరిగిందన్నారు. ఈ విషయంలో ప్రభంజన్ కోర్టును ఆశ్రయించి తన డబ్బు విడుదల ఆర్డర్‌ను పొందడం జరిగిందన్నారు.
నిందితుడు ఎస్‌ఐ సుగుణాకర్ ఈనెల 5వ తేదిన ప్రభంజన్‌ను పిలిచి అతని చేతిలో లక్షా 50 వేలు ఇచ్చి ఫొటోలు తీసుకొని మళ్లీ డబ్బులు గుంజుకోవడంతోపాటు డబ్బులు ముట్టినట్లు రైటర్ వద్ద సంతకం పెట్టాలని అనడంతో ఫిర్యాది ప్రభంజన్ పెట్టకపోవడంతో తరువాత రావాలని పంపించడాన్ని తెలిపారు. తిరిగి ఈనెల 8న ప్రభంజన్ పోలీస్‌స్టేషన్ వెళ్లగా డబ్బులు ఖర్చు అయ్యాయని 50 వేలు రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పడంతో ప్రభంజన్ ఎసిబి శాఖను ఆశ్రయించాడు. దీంతో ఈ నెల 10న ప్రభంజన్‌కు ఆడియో రికార్డు చేయడం కొరకు పంపించడం జరిగిందన్నారు. ఎస్‌ఐ (సెల్‌ఫోన్‌లను లోనికి అనుమతించరు) ఈ విషయమై బాధితుడు మళ్లీ స్టేషన్‌కు వెళ్లి డబ్బులు అడగగ 50 వేలు మాత్రమే ఇస్తానని, మరో పది వేలు బ్రాంది షాపు ద్వారా తీసుకోవాలని తెలపడం జరిగిందని ఇది ఆడియోలో రికార్డు అయ్యిందని ఎసిబి,ఎసిపి తెలిపారు.
ఎస్‌ఐ సుగుణాకర్ తన విధిని సరికాని విధంగా, అన్యాయంగా వ్యవహరించడం వల్ల ఎస్‌ఐని అరెస్టు చేసి కరీంనగర్ ఎస్‌పిసి, ఏసిబి కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపర్చడం జరిగిందని ఆయన తెలిపారు. పబ్లిక్ సర్వేంట్ లంచం డిమాండ్ చేసినట్లయితే ఎసిబిని ఆశ్రయించాలని ట్రోల్ ఫ్రీ నెంబర్ 1064లో సంప్రదించాలని ఎసిపి సూచించారు.