Sunday, May 5, 2024

నీట్‌లో మనోళ్ల సత్తా

- Advertisement -
- Advertisement -

Neet UG 2021 results released

తెలంగాణకు చెందిన
మృణాల్ మొదటిర్యాంకు
హైదరాబాద్‌కు చెందిన ఖండవల్లి శశాంక్‌కు ఆలిండియా ఐదో ర్యాంకు
కోరుట్ల విద్యార్థిని శరణ్యకు 60వ ర్యాంకు

మనతెలంగాణ/హైదరాబాద్ : నీట్ యుజి 2021 ఫలితాలలో తెలంగాణకు మృణాల్ కుట్టేరీ 720 మార్కులతో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ఆయనతో పాటు దిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తిక నాయర్‌కు మొదటిర్యాంకు వచ్చింది. సమాన మార్కులు వచ్చిన అందరికీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ఒకే ర్యాంకు ప్రకటించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న నీట్ యుజి 2021 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఫలితాలు వెల్లడికి సుప్రీంకోర్టు గురువారం లైన్ క్లియర్ చేయడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) సోమవారం రాత్రి నీట్ ఫలితాలు ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన మరుసటి రోజే ఫైనల్ కీ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారని విద్యార్థులు భావించారు. అయితే, నాలుగు రోజులైనా ఫలితాలు వెల్లడించకపోవడంపై సామాజిక మాధ్యమాల వేదికగా ఎన్‌టిఎపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఏ అధికారులు ఫలితాలు విడుదల చేశారు. నీట్ పరీక్షకు మొత్తం 16,14,777 మంది దరఖాస్తు చేసుకోగా, 15,44,275 మంది హాజరయ్యారు. అందులో 8,70,074 మంది ఉత్తీర్ణత సాధించారు.

నీట్ యుజి 2021 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన మృణాల్ కుటేరీ 720 మార్కులతో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. అలాగే ఖండవల్లి శశాంక్ 715 మార్కులతో మార్కులతో టాప్ 20 ర్యాంకులలో 16వ స్థానంలో నిలిచారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన విద్యార్ధిని శరణ్య జాతీయస్థాయిలో 60వ ర్యాంకు సాధించారు. ఆలిండియా ఎస్‌సి కేటగిరీలో తెలంగాణకు చెందిన మీస రోహిణి ప్రభు 7వ ర్యాంకు సాధించగా, ఎస్‌టి కేటగిరీలో కేతావత్ విజయచందర్ 9వ ర్యాంకు సాధించారు. ఈ ఫలితాలలో ఎపి విద్యార్థులు ప్రతిభ కనబరించారు. విజయవాడ విద్యార్థి రుషీల్ నీట్‌లో మెరిశాడు. పివి కౌశిక్ రెడ్డి 23వ ర్యాంకు సాధించారు.

దేశంలో వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 12న నీట్ పరీక్ష నిర్వహించినప్పటికీ ఫలితాల విడుదలలో జాప్యం కొనసాగుతూ రావడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఫలితాల విడుదలలో జాప్యం కొనసాగుతూ రావడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమైంది. ముంబయిలోని ఓ పరీక్షా కేంద్రంలో ఇద్దరు విద్యార్థుల ఒఎంఆర్ షీట్లు తారుమారైనందున వారికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని, అంతవరకు ఫలితాల విడుదల నిలిపివేయాలంటూ బాంబే హైకోర్టు ఆదేశించింది. దీంతో ఫలితాల విడుదలలో జాప్యం కొనసాగుతూ వచ్చింది. అయితే, బాంబే హైకోర్టు తీర్పుపై ఎన్‌టిఎ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా .. కేవలం ఇద్దరి కోసం 16 లక్షల మంది విద్యార్థుల ఫలితాలు ఆపలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన ధర్మాసనం… ఆ ఇద్దరి విద్యార్థుల విషయాన్ని దీపావళి సెలవుల అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. దీంతో ఇప్పటికే సిద్ధం చేసిన నీట్ 2021 ఫలితాలను ఎన్‌టిఎ సోమవారం విడుదల చేసింది.

కార్డియాలజిస్టునవుతా : శరణ్య

కార్డియాలజిస్టు కావడం తన లక్ష్యమని నీట్ టాప్ ర్యాంకర్ శరణ్య పేర్కొన్నా రు. సోమవారం విడుదలైన నీట్ ఫలితాలలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన శరణ్య 60వ ర్యాంకు సాధించి దేశంలోనే ఉన్నత స్థానంలో నిలిచారు. శరణ్య తల్లిదండ్రులు ఇరువురితో పాటు అన్న కూడా డాక్టరే కావడం విశేషం. దీంతో ఈ కుటుంబం మొత్తం డాక్టర్ల కుటుంబంగా మారింది. శరణ్య తల్లి డాక్టర్ అనురాధ గర్భిణీ స్త్రీ వైద్య నిపుణురాలు, తండ్రి డాక్టర్ వేణుగోపాల్ పిల్లల వైద్య నిపుణులు ఆమె అన్న హరికృష్ణ కూడా ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు ఫలితాలు విడుదల సందర్భంగా శరణ్య ‘మన తెలంగాణ’తో మాట్లాడుతూ కార్డియాలజీలో సూపర్ స్పెషాలిటీ చదవడం తన లక్ష్యంగా పేర్కొన్నారు. తన విజయానికి ’హార్డ్ వర్క్’తో పాటూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహమే కారణమని పేర్కొన్నారు. సోమవారం రాత్రి శరణ్య ఇంటిల్లిపాది బంధువులతో సహా ఆనందోత్సాహాలు మిన్నంటాయి. తమ కుమార్తె నేషనల్ టాపర్గా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులిరువురు డాక్టర్లు ఉత్సాహంగా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News