Thursday, May 2, 2024

తెరమీదకు కొత్త హామీలు

- Advertisement -
- Advertisement -

మేనిఫెస్టోలో లేని అంశాలను ప్రకటిస్తున్న బిఆర్‌ఎస్ అధిష్టానం
ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించి సాధ్యాసాధ్యాలను
అంచనా వేసి కొత్త పథకాల ప్రకటన
ఇప్పటికే ప్రకటించిన బిఆర్‌ఎస్ మెనిఫెస్టోకు జనం జేజేలు

ఇప్పటివరకు బిఆర్‌ఎస్ ప్రకటించిన కొత్త హామీలు
ప్యాసింజర్ ఆటోలకు పర్మిట్ ఫీజు మాఫీ
జనవరి నుండి గల్ఫ్ పాలసీ,జాబ్ క్యాలెండర్,
హైదరాబాద్‌లో ఇల్లు కొనే వారికి కొత్త పథకం, గిరిజన బంధు

మనతెలంగాణ/హైదరాబాద్ : ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ప్రజల అవసరాలను తీర్చేందుకు బిఆర్‌ఎస్ నడుం బిగించింది. ఈ నెల 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న వేళ.. మిగిలిన రాజకీయ పార్టీల కన్నా ముందుగానే మేనిఫెస్టోను ప్రకటించి బిఆర్‌ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ అగ్రనాయకులు హరీశ్‌రావులకు ప్రజల నుంచి పలు విజ్ఞప్తులు అందుతున్నట్లు తెలిసింది. సబ్బండవర్గాల సంక్షేమమే దృష్టిలో ఉంచుకుని ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించి,సాధ్యాసాధ్యాలను అంచనా వేసి బిఆర్‌ఎస్ మేనిఫెస్టోలో లేని మరిన్ని పథకాలు అంశాలను సిఎం కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావులు ప్రకటిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో మరోసారి బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటోలకు సంబంధించిన ఫిట్‌నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ జారీ ఫీజును మాఫీ చేస్తామని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. జనవరి నుండి గల్ఫ్ పాలసీ తీసుకొస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టో తీసుకువస్తామని, హైదరాబాద్‌లో ఇల్లు కొనే వారికి మరో కొత్త పథకం తీసుకువస్తామని, జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని కెటిఆర్ ప్రకటించగా, దళితబంధు తరహాలో గిరిజన బంధు తీసుకొస్తామని హరీశ్‌రావు ప్రకటించారు.

సబ్బండవర్గాలకు మేలు చేసేలా బిఆర్‌ఎస్ మేనిఫెస్టో
బిఆర్‌ఎస్ మెనిఫెస్టోలో సబ్బండవర్గాలకు మేలు చేసే హామీలు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తున్నది. ముఖ్యంగా అభాగ్యులకు పింఛన్ల పెంపు సాహసోపేతమైన నిర్ణయంగా మేధావులు కీర్తిస్తున్నారు. అనాథ పిల్లలను ఆదుకునేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకురాబోతుండడం బిఆర్‌ఎస్ మానవీయతకు అద్దం పడుతున్నది. మహిళలకు భృతి, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు ఒకటేమిటి అనేకానేక పథకాల సమాహారంతో సిఎం కెసిఆర్ ప్రకటించిన ఎన్నికల హామీలు ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే చెప్పినవి చేసి, చెప్పనివి సైతం అమలు చేసి ప్రజలందరికీ ఎంతో మేలు చేసిన సిఎం కెసిఆర్ పరిపాలనను దేశవ్యాప్తంగా కీర్తిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి రావడం ద్వారా ప్రజలకు మరింత మేలు జరుగనున్నది.

కేంద్ర ప్రభుత్వం అమానవీయంగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచితే మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పడం బిఆర్‌ఎస్ పార్టీ గొప్పతనాన్ని చాటుకుంటున్నది. ఇక రైతుల మేలు కోసం పెట్టుబడి సాయాన్ని భారీగా పెంచడంతో వ్యవసాయం పండుగలా మారనున్నది. దళితబంధు, రైతుబీమా వంటి కీలకమైన పథకాలు కొనసాగింపు ఉంటుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. రైతుబీమా తరహాలోనే కెసిఆర్ బీమా …ప్రతి ఇంటికీ ధీమా పేరుతో రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికీ ఎల్‌ఐసి ద్వారా రూ.5 లక్షల జీవిత బీమా అందించబోతున్నారు. ఆరోగ్య శ్రీ గరిష్ఠ పరిమితి రూ.15 లక్షలకు పెంచుతున్నట్లుగా బిఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించారు. మూడోసారి అధికారంలోకి రాగానే ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను కొనసాగించడంతోపాటు కొత్త హామీలను ఆరు నెలల్లోనే అమలు చేస్తామని సిఎం కెసిఆర్ చెప్పడంతో అన్ని వర్గాల ప్రజల్లో విశ్వాసం ఏర్పడి బిఆర్‌ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News