Tuesday, May 21, 2024

కాకులను కొట్టి…!

- Advertisement -
- Advertisement -

కంటికి కనిపిస్తున్నదానికి అద్దం ఎందుకు? దేశంలో ధనిక, పేద తేడాలు నానాటికీ పెరిగిపోతున్నాయని చెప్పడానికి ప్రత్యేక సర్వేలు, నివేదికలు అవసరమా? సంపన్నుల లాభాలు మితిమించిపోయి శ్రామికుల నిజ వేతనాలు పడిపోతున్నాయని వివరించడానికి ఆర్థిక పండితులు శ్రమించి లోతైన ఆరా తీయాలా? నిరుద్యోగం, అధిక ధరలు సామాన్య జనాన్ని కరకరా నమిలి మింగుతుంటే కార్పొరేట్ రంగం యజమానులు మరింతగా సిరిసంపదల్లో తులతూగతున్నారని తెలుసుకోడానికి అమర్తసేన్‌లు, రఘురామ రాజన్‌ల విజ్ఞత కావాలా? అక్కర్లేదు. అవన్నీ కట్టెదుటనున్న కఠోర వాస్తవాలే. కాదనగల ధైర్యం ఎవరికీ వుండదు. దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు అదేపనిగా అధికమవుతున్నాయని, 2022లో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆక్స్‌ఫర్డ్ కరువు నివారణ కమిటీ ఆక్స్‌ఫామ్ తాజా (2022) నివేదిక సోమవారం నాడు బయటపెట్టింది. 40.5 శాతం దేశ సంపద జనాభాలో 1 శాతంగానున్న అతి సంపన్నుల అధీనంలో వుందని ఈ నివేదిక వెల్లడించింది.

అలాగే దిగువనున్న 50% జనాభా వద్ద కేవలం 3% దేశ సంపద మాత్రమే వుందని స్పష్టం చేసింది. భారత దేశంలో పేదలు కనీస జీవన వసతులు లేక నానా అవస్థలు పడుతున్నారని వివరించింది. జుగుప్సాకరమైన ఈ ఆర్థిక తేడాలను తొలగించడానికి డబ్బుతో అతిగా ఉబ్బిపోయిన వర్గాల నుంచి సంపద పన్నును వసూలు చేయాలని భారత ఆర్థిక మంత్రికి సూచించింది. సంపన్నులు పెరుగుతున్న కొద్దీ పేదలు నిరుపేదలు కావడం సహజం. సంపదలో ఎవరి వాటా పెరుగుతుందో వారు మరింతగా ధనికులవుతారు. 2020లో 102 మందిగానున్న బిలియనీర్ల సంఖ్య 2022 నాటికి 166కి చేరిందని ఆక్స్‌ఫామ్ తెలియజేసింది. ఆక్స్‌ఫామ్ నివేదికను సోమవారం నాడు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు మొదలైన సందర్భంగా విడుదల చేశారు. దేశంలోనే అత్యంత సంపన్నుడుగా నిర్ధారణ అయిన గౌతమ్ అదానీ సంపద 2022లో 46% పెరిగింది. దేశంలోని సంపన్నులందరి మొత్తం సంపద 660 బిలియన్ డాలర్లకు చేరుకున్నది.

2022లో అంబానీని ప్రపంచంలోనే రెండవ అతి సంపన్నుడుగా బ్లూంబెర్గ్ సూచిక ఎంపిక చేసింది. ఆ ఏడాదిలో ప్రపంచంలోనే గరిష్ఠ స్థాయిలో సంపద పెరిగిన అతి సంపన్నుడుగా కూడా అదానీ నిలిచాడు. విశేషమేమిటంటే 2022లో దేశంలో వసూలైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) లో దాదాపు 64%, కిందనున్న 50 శాతం సాధారణ ప్రజానీకం నుంచే వసూలయింది. కేవలం 4% జిఎస్‌టి మాత్రం పైనున్న 10 శాతం మంది నుంచి వస్తున్నది. దేశంలో ఈ వ్యత్యాసాలు ఆర్థిక సంస్కరణల అమలు ప్రారంభమైనప్పటి నుంచే అత్యంత వేగంగా పెరుగుతూ వచ్చాయని రుజువైంది. 1990లలో ఊపందుకొన్న సంస్కరణల వల్ల దేశ ఆర్థిక వృద్ధి రేటు పెరిగినప్పటికీ పేదల నిజ వేతన విలువలు పడిపోయి వ్యవస్థీకృత పారిశ్రామిక రంగ యజమానుల లాభాలు అధికమయ్యాయని గత మే నెలలో వెల్లడైన పారిశ్రామిక స్థితిగతుల వార్షిక సర్వే బయటపెట్టింది.

1981-82లో వ్యవస్థీకృత రంగం లాభాల అదనపు విలువ రూ. 14,500 కోట్లు కాగా, ఇందులో 30.3% ఉద్యోగుల వేతనాల కిందకు వెళ్ళింది. 23.4% పరిశ్రమల యజమానుల, షేర్ హోల్డర్ల లాభాల కిందకు పోయింది. 2019-20లో మొత్తం అదనపు విలువ 12.1 లక్షల కోట్లు కాగా, అందులో కేవలం 18.9% మాత్రమే వేతనాల కిందకు పోగా, యజమానుల లాభాలు 38.6 % కావడం గమనించవలసిన విషయం. ఇలా ఉదారవాద సంస్కరణలు పేరిట భారత ప్రభుత్వాలు కార్పొరేట్ రంగానికి అనుగుణమైన విధానాలు ప్రవేశపెడుతూ శ్రామికుల నోట్లో మట్టి కొడుతూ వచ్చాయి. ప్రస్తుత ప్రధాని మోడీ ప్రభుత్వ హయాంలో, గత ఎనిమిదేళ్ళలో ఈ విధాన పక్షపాతం పేట్రేగిపోయి శ్రామిక జనం జీవితాలను కనీస జీవన వసతులకు కూడా నోచుకోని స్థితికి దిగజార్చింది.

ప్రభుత్వాల విధానాలే తాను ఇంత వాడు కావడానికి తోడ్పడుతున్నాయని, 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కొత్త దిగుమతి, ఎగుమతి విధానాన్ని ప్రవేశపెట్టి తాను పెరగడానికి దోహదం చేసిందని, అలాగే 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) విధానాన్ని తీసుకొచ్చి తన సంపద మరింత పెరగడానికి తోడ్పడిందని, మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న 12 ఏళ్ళలోనూ, ఆయన ప్రధాని అయిన తర్వాతనూ తీసుకొన్న విధానాలే తనను ఈ స్థాయికి చేర్చాయని అదానీ చెప్పుకొన్నారు. అంటే ఆర్థిక సంస్కరణలు కాకులను కొట్టి గద్దలకు వేయడానికే ఉపయోగపడుతున్నాయని స్పష్టపడుతున్నది. ఆర్థిక వృద్ధి రేటును, ఉద్యోగ కల్పనను పెంచే పేరుతో మోడీ ప్రభుత్వం బడా వ్యాపారులపై పన్ను భారాన్ని బాగా తగ్గించి దానిని నిరుపేదలు, సామాన్యులపైకి బదలాయించిందనేది తిరుగులేని సత్యం. ఈ ధోరణి మారనంత వరకు దేశం సామాన్యుల పాలిట నరకంగా మారిందని ఆక్స్‌ఫామ్ నివేదికలు పదేపదే గుర్తు చేస్తుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News