Monday, May 6, 2024

క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన పార్థివ్ ప‌టేల్..

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత స్టార్ ఆటగాడు పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 35 ఏళ్ల పార్థివ్ ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా టీమిండియాకు సేవలు అందించాడు. 18 ఏళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగిన పార్థివ్ బుధవారం ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించాడు. అన్ని ఫార్మాట్‌ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు పార్థివ్ ప్రకటించాడు. 17 ఏళ్ల వయసులో టీమిండియాకు ఎంపికైన పార్థివ్ మెరుగైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ అతనికి భారత జట్టులో స్థానం లభించింది. 2002లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా పార్థివ్ అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు. 2012లో శ్రీలంకతో జరిగిన వన్డేలో చివరిసారిగా భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఐపిఎల్‌లో కూడా పార్థివ్ సత్తా చాటాడు. ఇటీవల యూఎఇ వేదికగా జరిగిన ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగాడు. అయితే పార్థివ్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. కాగా, వికెట్ కీపర్‌గా, విధ్వంసక ఓపెనర్‌గా పార్థివ్ పేరు తెచ్చుకున్నాడు. భారత్ తరఫున మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే మహేంద్ర సింగ్ ధోనీ సుదీర్ఘ కాలంగా టీమిండియాకు వికెట్ కీపర్‌గా వ్యవహరించడంతో పార్థివ్‌కు టీమిండియాలో తగినన్ని అవకాశాలు లభించలేదు. చాలా ఏళ్ల పాటు ధోనీకి స్టాండ్‌బై వికెట్ కీపర్‌గా కొనసాగినా తుది జట్టులో ఆడే అవకాశాలు పెద్దగా లభించలేదనే చెప్పాలి. పార్థివ్ అంతర్జాతీయ కెరీర్‌లో పెద్దగా ప్రభావం చూపలేక పోయినా దేశవాళి క్రికెట్‌లో మాత్రం అద్భుత ఆటగాడిగా పేరు సంపాదించాడు. 194 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన పార్థివ్ 11,240 పరుగులు చేశాడు.

ఇందులో 27 శతకాలు కూడా ఉన్నాయి. ఇదిలావుండగా 25 టెస్టులు ఆడిన పార్థివ్ 934 పరుగులు సాధించాడు. అంతేగాక 38 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన పార్థివ్ 1696 పరుగులు చేశాడు. దీంతో పాటు రెండు అంతర్జాతీయ ట్వంటీ20 మ్యాచుల్లో కూడా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. 18 ఏళ్ల క్రికెట్ ప్రస్థానంలో పార్థివ్ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. సౌరవ్ గంగూలీ సారధ్యంలో తొలిసారిగా భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత సచిన్, ద్రవిడ్, కుంబ్లే, ధోనీల కెప్టెన్సీలో కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇక తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన కెప్టెన్లకు, సహచర క్రికెటర్లకు పార్థివ్ కృతజ్ఞతలు తెలిపాడు. సుదీర్ఘ క్రికెట్‌లో ఎన్నో తీపి జ్ఞాపకాలు తనకు ఉన్నాయని, కుటుంబంతో గడపాలనే ఉద్దేశంతోనే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు వివరించాడు. ఇక తనలోని ప్రతిభను గుర్తించి మంచి క్రికెటర్‌గా ఎదగడానికి సహకరించిన ప్రతి ఒక్కరూ సదా రుణపడి ఉంటానని తెలిపాడు. ఇక ఐపిఎల్‌లో కూడా పలు ఫ్రాంచైజీలు తనకు అవకాశాలు కల్పించాయని, వారందరికి కూడా కృతజ్ఞతలు చెప్పాడు. కాగా, అన్ని ఫార్మాట్‌ల క్రికెట్ నుంచి తాను తప్పుకుంటున్నట్టు, ఇకపై ఎలాంటిక్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించనని పార్థివ్ పటేల్ స్పష్టం చేశాడు. ఐపిఎల్‌లో పార్థివ్ 13 సీజన్లలో వివిధ జట్ల తరఫున బరిలోకి దిగాడు. ముంబై ఇండియన్స్, చెన్నై, బెంగళూరు తదితర జట్లకు పార్థివ్ ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఐపిఎల్‌లోని విధ్వంసకర ఓపెనర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న పార్థివ్ తాను ప్రాతినిథ్యం వహించిన వివిధ జట్లకు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టాడు.

Parthiv Patel retires from international Cricket

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News