న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీల నియంత్రణ కోసం చట్టం తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ విషయంలో ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. క్రిప్టో కరెన్సీలపై దేశ వ్యాప్తంగా అనేక ఫిర్యాదులు దాఖలయ్యాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. జస్టిస్ బీఆర్‌గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. క్రిప్టో కరెన్సీలను నియంత్రించడానికి ఎలాంటి చట్టాలు లేనందున , కేంద్రానికి, ఇతర సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు కోరుతున్నారని ధర్మాసనం పేర్కొంది.
అయితే ఇది విధాన రూపకర్తల పరిధి లోని అంశమని, తాము ఆదేశాలు ఎలా జారీ చేయగలం ? అని కోర్టు ప్రశ్నించింది. ఇలాంటి అంశాల్లో తాము కేంద్రాన్ని నిర్దేశించలేమని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం ముందు వాదనలు వినిపించాలని పిటిషనర్లకు కోర్టు సూచించింది. క్రిప్టో కరెన్సీలను నియంత్రించడానికి , సంబంధిత నేరాలను సమర్థవంతంగా దర్యాప్తు చేయడానికి ఒక యంత్రాంగంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జనవరిలో సుప్రీం కోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే.