Thursday, May 2, 2024

ప్రధాని ప్రగల్భాలు!

- Advertisement -
- Advertisement -

77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ గొప్పలే చెప్పుకొన్నారు గాని వాస్తవాలు మాట్లాడలేదు. తన తొమ్మిదేళ్లు పైబడిన పాలనలో దేశం విద్వేష విష భాండంగా మారిపోయిన చేదు వాస్తవాన్ని చెప్పుకోలేదు. అల్ప సంఖ్యాకుల ఆహారాన్ని కూడా ద్వేషించి వారిని కష్టాలు పాలు చేసిన సందర్భాల్లో తాను ఎందుకు మౌనం పాటించవలసి వచ్చిందో జాతికి వివరించలేదు. దేశం వెలిగిపోతున్నది, ప్రపంచమంతా మన వైపే చూస్తున్నది అని చెప్పుకొంటే సరిపోతుందా? ప్రధాని మోడీ మణిపూర్‌ను గురించి నాలుగు ముక్కలు మాట్లాడారు. ఇంత వరకు దీనిపై మౌనం పాటించారు. ఈ మధ్య ఒకసారి సిగ్గుపడవలసిన సందర్భం అన్నారు. పార్లమెంట్‌లో అది మినహా మిగతా అన్నీ మాట్లాడారు. అక్కడ సాగిన అమానుషాల మూలం ఏమిటో, తన పార్టీ మద్దతుతో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక మానభంగానికి గురి చేసిన దారుణ కృత్యం అందులో భాగమేనని చెప్పుకొనే నిజాయితీ ఆయనలో లేకపోయినా అక్కడ మైదాన మెయితీలకు,

కొండల్లో నివసించే కుకీలకు మధ్య ఒకరి వైపు మరొకరు కన్నెత్తి చూడలేని కక్ష కార్పణ్యం ఎందుకు కలిగింది, వాటిని తొలగించి రెండు వర్గాల మధ్య సామరస్యాన్ని ఎలా నెలకొల్ప దలిచారు అనే విషయాలను వివరించలేదు. కప్ప దాటుగా గత కొద్ది రోజులుగా మణిపూర్‌లో శాంతి నెలకొన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అక్కడ ఇరువర్గాలకు చెలిమి కుదుర్చగలవని మాత్రం చెప్పారు. మాసాల తరబడి హింస, విధ్వంసం సాగుతుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వాటిని ఆపలేకపోయారు అనే దానికీ సమాధానం లేదు. మణిపూర్ పులి చప్పరించిన లేడి పిల్లలా ఉంది. శాంతి ఉత్సవాన్ని కొనసాగిద్దాం అని ప్రధాని ప్రకటించారు. మణిపూర్ తర్వాత హర్యానాలో ఏమి జరిగిందో ఆయన వివరించలేదు. మణిపూర్ లోనూ దేశంలో మరికొన్ని చోట్ల అని దాట వేశారు. రగులుతున్న నిప్పును కప్పి ఉంచి అంతా బాగానే ఉంది, శాంతిని నెలకొల్పుతున్నాం అని చెప్పడం ప్రధాని మోడీకే చెల్లు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతి నెత్తురోడుతున్నది. అలాగే న్యాయ వ్యవస్థను తన ప్రభుత్వమే దెబ్బ తీస్తున్నది. రాజ్యాంగాన్ని నెమ్మది నెమ్మదిగా నీరుగార్చే పని సాగుతున్నది.

ఇటువంటి నేపథ్యంలో దేశం ముందుకుపోతున్నదని ఎలా చెప్పుకోగలరు? అధిక జనాభా, ప్రజాస్వామ్యం, భిన్నత్వం మన దేశ సంపదలన్నారు. నూట నలభై కోట్ల దేశ జనాభా తన కుటుంబమన్నారు. జనాభాలో ముప్పై ఏళ్ళ లోపు యువత అత్యధికంగా ఉన్నారన్నారు, వారి శక్తి సామర్ధ్యాలు అమోఘమైనవన్నారు. కాని ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం ప్రబలిపోయి చదువుకొన్న యువతకు సరైన ఉద్యోగాలు లభించడం లేదు. గ్రామీణ వ్యవసాయ ఆధార పరిశ్రమలను నెలకొల్పేందుకు గట్టి చొరవ తీసుకొంటున్న జాడలు లేవు. ఇది అందరికీ తెలిసిన చేదు సత్యం. వాస్తవం ఇలా ఉండగా యువతను మెచ్చుకొంటూ ఎర్రకోట నుంచి ఎంతగా ప్రసంగించినా ఏమి ప్రయోజనం? యువతలో అత్యధికులు నిరక్షరాస్యులు వ్యవసాయ రంగమే ఇప్పటికీ వారిలో ఎక్కువ మందిని ఆదుకొంటున్నది. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను వారికి కలిగించాలి, ఆ పని సమర్ధవంతంగా జరగడం లేదు. బహుళ జాతి కంపెనీలను దేశానికి రప్పిస్తామని కల్పించిన ఆశలు నెరవేరలేదు. నిరుద్యోగులుగా, నిర్వ్యాపారులుగా ఉన్న యువతరం పార్టీల జెండాలు మోయడానికి,

సంఘ్ పరివార్ అజెండా అమలుకు బలి పశువులయిపోతారు. దేశం మరింతగా మత కలహాగ్నుల గుండమైపోతుంది. తాను మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో ఇండియా 10వ స్థానంలో ఉన్నదని, ఇప్పుడు 5వ స్థానానికి చేరుకొన్నదని ప్రధాని ఘనంగా చెప్పుకొన్నారు. ఏ దేశమైనా తాను గొప్ప ఆర్ధిక శక్తినని చెప్పుకొన్నదంటే, అది ఆ దేశ ప్రజల ముఖాల్లో ప్రతిబింబించాలి, అది జరగడం లేదు. కార్పొరేట్లు, దళారీల చేతుల్లో ప్రజలు దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారు. ధరలు పేట్రేగిపోతున్నాయి. ప్రజలు తమ బతుకులను సవ్యమైన మార్గంలో నడుపుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేశం ఎంత ముందడుగు వేసినట్టు చెప్పుకొన్నా నిష్ఫలం. ప్రధాని మోడీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లకు పైబడి చేసిందంతా కార్పొరేట్ సంస్థలకు పబ్లిక్ రంగ పరిశ్రమలను ధారాదత్తం చేయడం, ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థను మరింత ప్రోత్సహించడమే. అదానీ, అంబానీల పల్లకీలు మోయడమే. దీని వల్ల ఎంతగా అరిచి ఎన్ని గొప్పలు చెప్పుకొన్నా వృథాయే. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వివిధ వర్గాల ప్రజలను ప్రశంసిస్తూ సాగిపోయిన మోడీ ప్రసంగం సుదీర్ఘ శుష్క కసరత్తే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News