Sunday, April 28, 2024

చెరువు, చేపల కోసమే శ్రీ.శా కథల పరిమళం

- Advertisement -
- Advertisement -

భళ్ళున నవ్వేశాడు -ఏడవడానికి కూడా ఈ లోకం సౌకర్యంగా లేనందుకు బిగ్గరగా, మనసారా (వాయిదాల విలాపం కథలో)… కొండచిలువ బాబుకి డబ్బే ప్రియురాలు. అలాగని అతనికి అసలు ప్రియురాలు లేదనుకోరాదు.., ఉంది… కానీ ఆవిడ కూడా డబ్బే ప్రియుడు అనుకుంది… (అగ్గిపుల్ల కథలో)… తెర తొలిగి తేజి ఆవురుమంటున్న జంతువుల నోరు తెరిచింది. – (తెర, కథానిక లో).. నలభయ్యవయేట పెళ్ళిపీట ఎక్కాడు. ఆ పెళ్ళి పీటకు ఓ కాలు లేదు. తాళికట్టిన భార్యకు తన మీద ప్రేమ లేదు…. (వాయిదా విలాపం కథలో)… తాము రెచ్చగొట్టే మతకలహ హత్యలకు వత్తాసుగా గాంధీ చేయని హత్యలను చేసినట్టు బల్లగుద్దే వక్రీకరణ సామ్రాట్టులు ఈ రోజుల్లో కోట్ల గేలాలు పట్టుకుని తిరుగుతున్నారు… (తు.చ. తప్పితే కథలో)… చిట్టి ఆ బొమ్మతో ఆడుకోదు. ఆ బొమ్మే కావాలనుకున్నప్పుడల్లా ఇష్టం వచ్చినట్లు చిట్టితో అడుకుంటుంది.‘ (పెళ్ళయ్యాక చూడు కథలో) ‘అప్పడే పాకెట్ విప్పి రేపర్ లోంచి బయటికి తీసిన కొత్త సబ్బు బిళ్ళ లా లేదు, కడగాల్సిన అంట్లగిన్నెలా ఉంది.‘

(రచయిత మరణం కథలో)… ‘ఆసిల్ మెట్ట నుంచి నక్కవానిపాలెం దాటి టి.బి. ఆసుపత్రి మీదుగా అక్కడి వరకు సవ్యంగానే వచ్చిన రోడ్డు నాయకత్వం కోసం తగవులాడుకున్న రాజకీయ పార్టీలా అక్కడ మూడు చీలికలయ్యింది. (ఒక ఖైదీ తిరుగుబాటు కథలో)… సెక్సులో ఆడది స్వేచ్ఛ చూపెడితే అందే సుఖం ఎంత మత్తెక్కిస్తుందో అర్థమైన రాజారావు తన అతీంద్రియ శక్తుల మాట ఆమె దగ్గర మళ్ళీ ఎత్తలేదు… (అతనికంతా తెలుసు కథానికలో)… ఇక్కడ పేర్కొన్న ఎనిమిది ఉటంకింపు వాక్యాలూ పురాణం శ్రీనివాస శాస్త్రి కథలు 2 సంపుటి నుంచి ఎంపిక చేసుకున్నవే! వీటిని పరిశీలిస్తే రచయితకుండే నిశితమైన పరిశీలన, మధ్యతరగతి జీవన విషాదం పట్ల సహానుభూతి, వ్యంగ్యం, హాస్యం గురించి చాలా సులువుగా బోధపడుతుంది. పురాణం శ్రీనివాస శాస్త్రి (1 జూన్ 195322 అక్టోబర్ 2021) ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త దినపత్రికల్లో చిరకాలం పనిచేసిన పాత్రికేయుడు. వీరి తండ్రి పురాణం సుబ్రహ్మణ్య శర్మ పేరెన్నికగన్న రచయితా, అలాగే లబ్ధ ప్రతిష్ఠులైన సంపాదకుడు. వీరి అన్న నాని అచిరకాలంలో కనుమూసిన మంచి చిత్రకారుడు.

పురాణం శ్రీనివాస శాస్త్రి పత్రికా రచయితగా నేను బాగా ఎరిగినా, మా పరిచయం మాత్రం ఇద్దరి పదవీ విరమణ తర్వాత సాధ్యమయ్యింది. అది కూడా ఫేస్ బుక్ ద్వారానే. కోవిడ్ కారణంగా కలుసుకున్నది లేదు గానీ, టెలిఫోన్ ద్వారా పలకరించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ’కోకిలమ్’ అని ఆన్ లైన్ ఛానల్ ద్వారా కొన్ని పరిచయాలను రికార్డు చేసిన సందర్భంలో కూడా నాకు తెలుసు. అయితే ఆయన రాసిన అరవై కథలలో కొన్నింటికి బహుమతులు వచ్చినా కనీసం వాటి గురించి అయినా పెద్దగా చర్చించుకున్న సందర్భాలు దాదాపు లేవు.శ్రీనివాస శాస్త్రి చనిపోయిన తరువాత ఆయన కుటుంబం (స్మిత, శ్రీరామ్, శ్రీనందు, శృతి) గత సంవత్సరం ఒకటి, ఇటీవల పురాణం శ్రీనివాస శాస్త్రి కథలు రెండు అంటూ రెండు సంకలనాలు వెలువరించి మంచి పని చేశారు. లేకపోయి వుంటే శ్రీనివాస శాస్త్రి కథా రచయితగా అసలు మన దృష్టికి వచ్చివుండేవారు కాదేమో! 184 పేజీల మొదటి సంపుటంలో 20 కథలు, 168 పేజీల రెండవ సంపుటంలో 28 కథలు మనకు కనబడతాయి. ఇవన్నీ 1975 నుంచి 2020 చివరి వరకూ రాసిన కథలు.

ఈ 48 కథలు కాకుండా మరో పది పదిహేను కథలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కథలు కూడా వచ్చే సంవత్సరం సంపుటిగా రూపం దాల్చే అవకాశం కూడా వుంది.‘1976లో ’ఎన్నెన్నో ఆత్మహత్యలు’ కథ చాలా శ్రద్ధగా రాస్తే; 1989 లో రాసిన ’పసివాడు’ అంత అశ్రద్ధగా రాశా‘రని రచయిత, సంపాదకులు కె.ఎన్.వై. పతంజలి అంటారు. ‘పత్రికా రచయిత కన్నా రచయితగానే శ్రీనివాస శాస్త్రికి ఎక్కువ పేరుం‘దని సంపాదకులు ఆర్. వి. రామారావు భావిస్తున్నారు. ఆయన కథల్లో పెట్టిని పరిశీలన, మంచి అభివ్యక్తి, స్పష్టంగా అందంగా చెప్పగలిగే భాష, భావాన్ని సమకూర్చుకునే కుశలత ఉన్నాయని రచయిత్రి ఇంద్రగంటి జానకీబాల అంటారు. కథానిక ఎత్తుగడ నుండి కథనం, సన్నివేశ కల్పన, సంఘటనల కదలిక ముగింపు వంటి శిల్ప విషయమైన విశేషాలన్నిటా శ్రీనివాస శాస్త్రి కథలలో మెరుపుతుంటాయని విహారి అభిప్రాయ పడతారు.తండ్రి సంపాదకుడుగా తెలుగు సాహితీ లోకాన మార్తాండునిలా వెలిగే కాలంలో కుమారుడు శ్రీనివాస శాస్త్రి 19751978 కాలంలోనే చాలా ప్రతిభావంతంగా, విరివిగా కథలు సృజించారు. ఆయన కథలకు ఆంధ్రప్రభ, జ్యోతి మాసపత్రిక, చక్రపాణి యువ వంటి పత్రికలు ఆదరించి అవార్డులు కూడా ఇచ్చాయి.

ఆయన జీవితంలో ఎక్కువ భాగం ఉద్యోగం కారణంగా విశాఖపట్టణం, హైదరాబాదు వంటి చోట్ల నడిచినా సందర్భం వచ్చినప్పుడు రైతు జీవితాన్ని, గ్రామీణ ప్రాంతపు కడగళ్ళనుప్రతిభావంతంగా చిత్రిక పట్టారు. ఉదాహరణకు ’చెరువులు, చేపలు’ అని రెండు పేజీల కథలో గ్రామ ప్రెసిడెంట్ నీళ్ళ బిందెలతో చెరువు దగ్గిరకి వచ్చిన మాలగూడెం ఆడమనుషుల్ని ఆమడ దూరం తరిమేయించి ఇలా అంటారు- ‘ ఈ చెరువు మీ కోసం కాదే… …. సేపల కోసం. చెరువులో నీళ్ళు తోడితే సేపలు సత్తయి. …. పోండి పోండి.’అచ్చంగా డిటెక్టివ్ కథలాగా నడిచిన ‘అతనికంతా తెలుసు’ కథ చివరిలో ఓ పాత్రతో మనిషి ఎన్ని శక్తులున్నా స్వార్థానికే వాడతాడు. ఉన్న శక్తులతోనే న్యూట్రన్ బాంబు చేసుకోలా అని అనిపిస్తాడు.తాత నుంచి, తండ్రి నుంచి సంక్రమించిన విలువలను సుబ్బారావు వదిలించుకొని ఎలా పతనమయ్యాడో చెప్పే ‘ఫియాస్కో’ కథలో సింబాలిక్ గా వదిలించుకున్న కోటుతో వర్ణిస్తాడు రచయిత. ‘వాయిదా విలాపం’ అనే కథను జాగ్రత్తగా చూస్తే వస్తు, శిల్ప రిత్యా నగ్నముని విలోమ కథలు గుర్తుకు రాక మానవు. ఈ కథ మధ్యలో రచయిత శ్రీనివాస శాస్త్రి రాసిన ఒక పేరాగ్రాఫ్ మీరే పరిశీలించి తేల్చుకోండి.

ఇంకా నయం. రోడ్డు గొప్పింటి పెళ్ళంత సందడిగా వుంది. అంతమంది మధ్య ఏడుపు ప్రారంభించకుండా మరోసారి పరువు కాపాడుకొన్నందుకు తనను తాను మెచ్చుకున్నాడు. కానీ అంతలోనే ఒక సీసం పెంకు ఆకులా అరిగిన చెప్పు కింద నుంచి కాలిలో కస్సున గుచ్చుకుంది. దబ్బున చతికిలబడ్డాడు. ఇక లాభంలేదు – ఏడ్చేద్దాం అనుకొంటూండగా బిలబిలలాడుతూ పిల్లలు చుట్టుముట్టారు, వాళ్ళెవరికీ సరిగా బట్టల్లేవు. వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల సంసారాలు కూడా సరిగా సాగుతున్న దాఖలల్లేవు. అయినా వాళ్ళు ఏడవటం లేదు. పైగా అహోబలరావు సీసంపెంకు గుచ్చుకొన్నందుకు ఏడిస్తే వెంటనే నవ్వుతూ చుట్టూ గంతులెయ్యడానికి రెడిగా వున్నారు. మిణుకు మిణుకు చూస్తూ.”నిడివి, పరిశీలన, శైలీ, శిల్పం, అభివ్యక్తి రీత్యా ఎన్నోచోట్ల కథలతో మనలను మెప్పించే ఈ కథారచయితలో తికమకాస్త్రం, ఓట్లాట, చెత్తాత్ముడు, వ్యథాసరిత్సాగరం, కరోనాతో కోవిదులైపోవడం వంటి మెరిసే పద ప్రయోగాలు కనబడతాయి. ఈ నలభై ఎనిమిది కథల్ని నిడివి రీత్యా చూస్తే అవి రెండు పేజీల నుంచి 16 పేజీల దాకా ఉన్నాయి.

సగటున ఎనిమిది పేజీలు నిడివి కలిగిన ఈ కథలు ఆసక్తికరంగా చదివిస్తాయి. శ్రీనివాస శాస్త్రి బతికున్నప్పుడు తన తండ్రి రాసిన ఇల్లాలి ముచ్చట్లు గురించి ఓ మంచి వ్యాసం రాసిపెట్టమని నన్ను ఎన్నోసార్లు పోరారు. నేను మొదలుపెట్టకముందే తన జీవనపయనాన్ని చాలించారు. కనీసం ఇప్పుడైనా నేను రాయాల్సి ఉంది. తండ్రి రచనలు గురించి రాయమన్నారే కానీ, తన కథల గురించి గురించి రాయమని ఆయన నన్ను కోరలేదు. ఆయన పిల్లలు ఇప్పుడు ఈ కథలను సంకలనాలుగా వెలువరించడం ఎంతో ముదావహం.చివరిగా ఒకమాట – పురాణం ఇంటి పేరుతో ఆధునిక కాలంలోనే అంతకు ముందు సూరి శాస్త్రి కూడా ప్రఖ్యాతులు. తరువాత పురాణం సుబ్రహ్మణ్యం శర్మ ఆం ధ్రజ్యోతి వారపత్రిక సంపాదకుడుగా సాహిత్య లోకంలో పెద్ద పేరు గడించారు. ఈ ఇంటి పేరు లగేజీ ఎందుకని శ్రీనివాస శాస్త్రి అది వాడుకోకుండా పి. శ్రీనివాస శాస్త్రి అనే పేరుతోనే కథలు రాశారు. అవి కూడా క్రమం తప్పకుండా రాయలేదు. రాసినవి కూడా కొన్ని సంవత్సరాల్లో కొన్ని రాయడం, తర్వాత విరామం ప్రకటించడం, ఇలా నడిచింది కథారచన.

పత్రికా రచయిత వృత్తి ఆయనలోని కథా రచయితను కొంతవరకు చంపేశాడేమో…! అలాగే సంపాదకుడుగా తండ్రికున్న ఖ్యాతి కారణంగా పెద్దవారైన ఎంతోమంది రచయితలు, విమర్శకులు ఎందరో శ్రీనివాస శాస్త్రికి ఉన్నారు, వారందరికీ శ్రీనివాస శాస్త్రి పట్ల మంచి అభిమానం ఉన్నా ఆ అభిమానం ఈయన కథలను చదవడంలో గానీ, విశ్లేషించడంలో గానీ ప్రసరించలేదని అనిపిస్తోంది. కనుక ఈ రకంగా కీర్తివంతమైన ఇంటి పేరు కొన్ని సందర్భాల్లో అవరోధం కూడా కావచ్చు కూడా. ఈ కథల సంపుటాల ద్వారా కథా రచయితగా పి శ్రీనివాస శాస్త్రి కొత్త ఊపిరి పోసుకుంటారనడంలో సందేహం ఎంత మాత్రమూ లేదు!

డా నాగసూరి వేణుగోపాల్
9440732392

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News