Sunday, April 28, 2024

మట్టి కోర్టు రారాజు నాదల్

- Advertisement -
- Advertisement -

ఫైనల్లో తేలిపోయిన జకోవిచ్, రఫెల్‌దే ఫ్రెంచ్ ఓపెన్

ఫెదరర్ రికార్డు బ్రేక్, 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో చరిత్ర సృష్టించిన స్పెయిన్ బుల్

Rafael Nadal win French Open 2020 Title

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో తానే రారాజు అని స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మరోసారి నిరూపించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 60, 62, 75తో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)ను చిత్తు చేసి 13వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే క్రమంలో అత్యధిక సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఆటగాడిగా స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సరసన నిలిచాడు. ఇప్పటి వరకు స్విస్ స్టార్ ఫెదరర్ పేరిట ఉన్న 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డును నాదల్ సమం చేశాడు. పురుషుల సింగిల్స్ చరిత్రలో నాదల్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అసాధారణ ఆటతో అలరించిన రఫెల్ అలవోకగా ట్రోఫీని సాధించి మట్టి కోర్టు (క్లేకోర్డు)లో తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించాడు. నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సాధించడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం. 2017, 2018, 2019లలో నాదల్ వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ సాధించాడు. తాజాగా ఈసారి కూడా ట్రోఫీని సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఇక తన ఖాతాలో రెండో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను జత చేసుకోవాలని భావించిన వరల్డ్ నంబర్‌వన్ జకోవిచ్‌కు నిరాశే మిగిలింది.
ఆరంభం నుంచే..
ఇద్దరు దిగ్గజాలు ఫైనల్‌కు చేరడంతో తుది పోరు నువ్వానేనా అన్నట్టు సాగుతుందని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ టాప్ సీడ్ జకోవిచ్ పేలవమైన ఆటతో నిరాశ పరిచాడు. ఆరంభం నుంచే నాదల్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. కసితో ఆడిన నాదల్ తొలి సెట్‌లో అసాధారణ రీతిలో విజృంభించాడు. జకోవిచ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాడు. నాదల్ జోరుకు జకోవిచ్ తేలిపోయాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన నాదల్ ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండానే సెట్‌ను సాధించాడు. నాదల్ అసాధారణ రీతిలో చెలరేగి పోవడంతో జకోవిచ్ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు.

ఇక రెండో సెట్‌లో కూడా నాదల్‌కు ఎదురులేకుండా పోయింది. ఈసారి కూడా రఫాడించాడు. స్పెయిన్ బుల్ జోరుకు నొవాక్ కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయాడు. తీవ్ర ఒత్తిడిలో కనిపించిన జకోవిచ్ వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన నాదల్ వరుసగా రెండో సెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ, మూడో సెట్‌లో మాత్రం నాదల్‌కు ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఈసారి జకోవిచ్ అద్భుత పోరాట పటిమను కనబరిచాడు. నాదల్ జోరుకు బ్రేక్ వేస్తూ మళ్లీ మ్యాచ్‌లో వచ్చేందుకు ప్రయత్నించాడు. ఇదే సమయంలో సెట్‌ను టైబ్రేకర్‌కు తీసుకెళ్లాడు. కానీ అద్భుత ఆటతో అలరించిన నాదల్ ఈసారి కూడా పైచేయి సాధించాడు. జకోవిచ్ ఆధిపత్యానికి తెరదించుతూ వరుసగా మూడో సెట్‌ను గెలిచి ట్రోఫీని ఎగురేసుకు పోయాడు. ఈసారి నాదల్ ఒక్క సెట్‌ను కూడా కోల్పోకుండానే ఫ్రెంచ్ ఓపెన్‌ను సొంతం చేసుకుని మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Rafael Nadal win French Open 2020 Title

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News