Tuesday, May 7, 2024

కాకతీయ యూనివర్సిటీలో ర్యాంగింగ్ కలకలం

- Advertisement -
- Advertisement -

81మంది విద్యార్థినులు సస్పెన్షన్

మన తెలంగాణ/హైదరాబాద్ : కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ర్యాగింగ్ కు పాల్పడుతున్న విద్యార్థినిలను పెద్ద ఎత్తున సస్పెండ్ చేశారు. పిజి ఫైనల్ ఇయర్ చదువుతున్నవిద్యార్థినులు పద్మావతి మహిళా వసతిగృహంలో జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం వెలుగు చూడడంతో అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. కామర్స్, ఎకనామిక్స్, జువాలజీల్లో పిజి చేస్తున్న మొత్తం 81 మంది విద్యార్థినులపై సస్పెన్షన్ కొరడా ఝుళిపించారు. వీరిలో 28 మంది పిజి విద్యార్థినిలు ఉండగా, 28 మంది కామర్స్, 25 మంది ఎకనామిక్స్, జువాలజీ సెకండియర్ విద్యార్థినులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

లేడీస్ హాస్టల్ లో ర్యాగింగ్ జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాలేజీకి కొత్తగా వచ్చే విద్యార్థినులకు భయం పోగొట్టి పరిచయం పెంచుకునే క్రమంలో ర్యాగింగ్ చేస్తుంటారు. ఇది క్రమేణా మితిమీరి తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం కాలేజీల్లో ర్యాగింగ్ నిషేధించింది. అయితే, కాకతీయ యూనివర్సిటీలో జూనియర్ విద్యార్థినులపై సీనియర్ అమ్మాయిలు ర్యాగింగ్ కు పాల్పడడం ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. యూనివర్సిటీ చరిత్రలోనే ఏకంగా ఒకేసారి 81 మందిని సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి. గత కొద్ది రోజులుగా యూనివర్సిటీ హాస్టల్లో ర్యాగింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ మేరకు అధికారులకు సమాచారం అందడంతో కఠిన చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

పద్మావతి మహిళా వసతి గృహంలో ఉన్న విద్యార్థుల దగ్గర వివరాలు సేకరించిన తర్వాత కాలేజీ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. మిగతా విభాగాల్లో కూడా ర్యాగింగ్ పాల్పడ్డారా? ఎంతమంది ర్యాగింగ్ పాల్పడ్డారు? అనే వివరాలను వర్సిటీ అధికారులు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు దొరికితే సస్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వెల్లడించారు. శనివారం డిసెంబర్ ఒకటి వరకు కాకతీయ యూనివర్సిటీకి క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు వెంటనే హాస్టల్స్ ఖాళీ చేయాలని తెలిపారు. ర్యాగింగ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News