Monday, June 17, 2024

విదేశాల్లో సెలవులు అనుభవించేది రాహులే

- Advertisement -
- Advertisement -

మోడీ జవాన్లతో దీపావళి జరుపుకుంటుంటారు
ఈ ఎన్నికలు వారిద్దరి మధ్యే
కేంద్ర హోమ్ మంత్రిఅమిత్ షా

ససారమ్/ కరకాత్ (బీహార్) : ప్రస్తుతం సాగుతున్న లోక్‌సభ ఎన్నికలు జవాన్లతో దీపావళి జరుపుకుంటుండే ప్రధాని నరేంద్ర మోడీకి,‘వాతావరణం ప్రతికూలించినప్పుడల్లా సెలవులు విదేశాలకు పరుగెత్తుతుండే’ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మధ్య పోటీ అని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం స్పష్టం చేశారు. బీహార్‌లోని కరకాత్, ససారమ్ లోక్‌సభ నియోజకవర్గాల్లో వరుస ఎన్నికల ర్యాలీల్లో అమిత్ షా ప్రసంగిస్తూ, ఇండియా కూటమిని ‘కుంభకోణాల నిందితులతో కూడినదిగా’ అభివర్ణించారు. ‘(గుజరాత్) సిఎంగా, ప్రధానిగా 23 ఏళ్ల కాలంలో నిష్కళంక రికార్డు ఉన్న’ మోడీని ‘రూ. 12 లక్షల కోట్లు విలువ చేసే ఆర్థిక కుంభకోణాల నిందితులతో’కూడిన ఇండియా కూటమి ఢీకొంటున్నదని ఆయన అన్నారు.

‘వెండి చెంచాతో పుట్టిన’ రాహుల్ గాంధీ వలె కాకుండా మోడీ అగ్ర స్థానానికి చేరుకోవడానికి బాగా శ్రమించారని, అత్యంత వెనుకబడిన తరగతి కుటుంబం నుంచి వచ్చి, జీవనోపాధికి ఒక దశలో టీ అమ్మిన మనిషి మోడీ అని అమిత్ షా పేర్కొన్నారు. ఇండియా కూటమికి సంఘటిత నాయకత్వం లేదని, ‘ఆ కూటమిలోని ప్రముఖ నేతలు ఒక్కొక్కరికి ఒక ఏడాది ప్రధాని పదవి కోసం చూస్తున్నారు. అటువంటి ఏర్పాటు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణచివేయగల పటిష్ఠ ప్రభుత్వాన్ని ఎన్నటికీ సమకూర్చజాలదు’ అని బిజెపి మాజీ అధ్యక్షుడు అన్నారు. ‘పాకిస్తాన్ అణు బాంబులకు భయపడుతున్నందుకు’ కాంగ్రెస్‌ను కేంద్ర హోమ్ శాఖ మంత్రి తూర్పారపట్టారు. జమ్మూ కాశ్మీర్‌లో 370 అధికరణాన్ని రద్దు చేసిన తమ ప్రభుత్వం‘మనదైన, మనతోనే ఉండిపోయే’ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను సొంతం చేసుకోవాలని తీర్మానించుకున్నదని అమిత్ షా తెలిపారు.

జెకెపై మా తదుపరి లక్షం అదే

జమ్మూ కాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా ముగియడమపై అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. అక్కడ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన మోడీ ప్రభుత్వం కాశ్మీర్ విధానాన్ని నిరూపించుకున్నదని ఆయన చెప్పారు. అది తమ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని హోమ్ శాఖ మంత్రిఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌పై తమ తదుపరి లక్షాలను ఆయన తెలియజేశారు. ‘కాశ్మీర్ వేర్పాటువాదులు కూడా ఈ ఎన్నికల్లో వోటు వేశారు. అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. ఇది పెద్ద పరిణామమని భావిస్తున్నా.

ఈ ప్రాంతంలో విజయవంతంగా పోలింగ్ జరగడం మోడీ ప్రభుత్వానికి దక్కిన అతి పెద్ద విజయం. మా ప్రణాళిక ప్రకారం, వెనుకబడిన తరగతులు, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన సర్వేలు జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తాం. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పిస్తాం. కేంద్రం ఆ దిశగా కృషి చేస్తోంది’ అని అమిత్ షా తెలిపారు. జెకెలో సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం విదితమే. అమిత్ షా దీనిని ప్రస్తావిస్తూ, సర్వోన్నత న్యాయస్థానం విధించిన గడువు కన్నా ముందే ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News