Thursday, May 2, 2024

దక్షిణ మధ్య రైల్వే… విజయవాడ టు ఉప్పలూరు డబుల్ లైన్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ టు ఉప్పలూరు
విద్యుదీకరణతో సహా డబుల్ లైన్ ప్రారంభం
221 కిమీల మేర ఈ ప్రాజెక్టులో
ప్రస్తుతం 141 కిమీ మేర పనులు పూర్తి

మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌లోని విజయవాడ టు ఉప్పలూరు డబుల్‌లైన్‌లో భాగంగా 17 కి.మీ మేర విద్యుదీకరణ పనులు పూర్తి చేసి ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ఈ విద్యుదీకరణతో సహా డబ్లింగ్ పూర్తి కావడంతో విజయవాడ టు గుడివాడ టు భీమవరం టౌన్, గుడివాడ టు మచిలీపట్నం మధ్య 141 కి.మీ మేర నిరంతరాయంగా విద్యుదీకరణతో సహా డబుల్‌లైన్ పూర్తి చేశామని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

విజయవాడ టు గుడివాడ టు భీమవరం టు నర్సాపూర్, గుడివాడ టు మచిలీపట్నం, నర్సాపూర్ టు నిడదవోలు డబ్లింగ్ విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా డబుల్ లైన్ పనులు పూర్తి చేసింది. రూ.3,000 కోట్ల అంచనా వ్యయంతో 221 కిమీ దూరం గల ఈ ప్రాజెక్టు 2011, 12 సంవత్సరంలో మంజూరు చేయగా, ఆర్‌విఎన్‌ఎల్ (రైల్ వికాస్ నిగం లిమిటెడ్) వారు ఈ పనులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని అధికారులు తెలిపారు. 221 కిమీల మేర ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 141 కిమీ మేర పనులు పూర్తిచేసినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. మిగిలిన సెక్షన్‌లో నిదడవోలు టు నర్సాపూర్ మధ్య 70 రూట్ కిమీ మేర పనులు వేగవంతంగా సాగుతూ చివరిదశకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రాజెక్టులోని ముఖ్యాంశాలు ఇలా…

గంటకు 110 కిమీ వేగం సామర్థ్యంతో 25 టి యాక్సెల్ లోడ్లను తట్టుకునేలా ట్రాక్‌ను రూపొందించారు. పిఎస్‌సి గిర్డర్లతో 2 ప్రధాన వంతెనలు, 18 చిన్న వంతెనలు నిర్మించారు. ఉప్పలూరు, నిడమానూరు, రామవరప్పాడు స్టేషన్లలో ప్రణాళికబద్ధమైన సర్క్యూలేటింగ్ ఏరియా, టికెట్ల బుకింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. సౌకర్యవంతమైన ప్లాట్‌ఫాంలు, త్రాగునీటి సౌకర్యం, పాదచారుల వంతెనలు మొదలగు ప్రయాణికుల సౌకర్యాలను పటిష్టపరిచారు. ఉప్పలూరు, నిడమానూరు, రామవరప్పాడు స్టేషన్ల యార్డులను ఆధునిక సౌకర్యాలతో సహా ప్రామాణిక డబుల్ లైన్ లే ఔట్‌తో పునర్నిర్మించారు.

అవసరమైన చోట్ల కట్ అండ్ కనెక్షన్ విధానాన్ని అవలంభించారు. దీంతో దాదాపు లైన్ అంతా గరిష్ట వేగం అనుమతులతో ప్రారంభించబడిందని అధికారులు తెలిపారు. అధిక స్థాయిలో భద్రతా ప్రమాణాలు కల్పించేలా ఉప్పలూరు, నిడమానూరు, రామవరప్పాడు 3 స్టేషన్లలో దేశీయంగా రూపొందించిన సెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ ఏర్పాటు చేశారు. సెక్షన్‌లో 7 రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద మంచి రహదారులు, సూచిక బోర్డులతో విద్యుత్‌తో నిర్వహించే లిఫ్టింగ్ బారియర్స్ ఏర్పాటు చేశారు.
ఈ ప్రాజెక్టుతో ప్రయోజనాలు :
సరుకు రవాణా, ప్రయాణికుల రవాణా నిరాటంకంగా సాగడానికి రైలు రవాణా మౌలిక సదుపాయాలు ఈ ప్రాజెక్టుతో గణనీయంగా మెరుగుపడ్డాయి. నూతన డబ్లింగ్ లైన్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రైలు రవాణా మెరుగుపడుతుంది.
వ్యవసాయం, ఆక్వా ఉత్పత్తుల రవాణాను ప్రోత్సాహించి ఆయా రంగాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ విద్యుదీకరణ పనులు ఇంధన పొదుపు, ఇంధన ఖర్చు తగ్గింపునకు దోహదపడుతుంది. విజయవాడ టు విశాఖపట్నం మధ్య కోస్తా రైల్వే కారిడార్‌కు ప్రత్యామ్నాయ రైల్వే లైన్‌గా ఉపయోగపడనుంది.

పూర్తి ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలి: జిఎం

షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేసిన విజయవాడ డివిజన్, ఆర్‌వీఎన్‌ఎల్ అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు. సానుకూల విధానంతో ముందుకు సాగి పూర్తి ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేసి ఆంధ్రపదేశ్‌లోని కోస్తా ప్రాంత ప్రజల అవసరాలను నెరవేర్చాలని జనరల్ మేనేజర్ ఆర్‌విఎన్‌ఎల్ అధికారులకు సూచించారు. ప్రాజెక్టు వేగవంతంగా పూర్తికావడానికి కావాల్సిన తోడ్పాటును అందించాలని ఆయన రైల్వే అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News