Thursday, February 29, 2024

తెలంగాణకు ‘రెడ్ అలర్ట్’

- Advertisement -
- Advertisement -

నేడు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు : ఐఎండి

అప్రమత్తంగా ఉండండి.. జిల్లా కలెక్టర్లకు సిఎస్ శాంతికుమారి ఆదేశాలు

మన తెలంగాణ/ హైదరాబాద్ :  మిగ్ జాం తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాగల రెండురోజుల భారీ నుంచి అతి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మే రకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. సూర్యాపేట, మ హబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, జనగాం, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిస్తూ ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30నుంచి -50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది . ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం ఉదయం నుంచి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా అశ్వరావుపేటలో 96.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని వాతావరణశాఖ వివరించింది.

భారీవర్షాలకు అప్రమత్తంగా ఉండండి: జిల్లా కలెక్టర్లకు సి.ఎస్ ఆదేశాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తూఫాన్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబబాద్, సూర్యాపేట తదితర జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.ఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ, నేడు, రేపు రెండురోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటొకాల్స్ కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖ లు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వె, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని సి.ఎస్ శాంతి కుమారి సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News