Friday, May 3, 2024

తొలగించిన 937 కస్తూర్బా టీచర్లను విధుల్లోకి తీసుకోవాలి : కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -
వందలాది మంది టీచర్లతో కమీషనర్ కార్యాలయ ముట్టడి

హైదరాబాద్ : కస్తూర్బా పాఠశాలల్లో పనిచేసే 937 టీచర్లను తొలగించడం అన్యాయమని వీరిని హై కోర్టు ఉత్తర్వుల ప్రకారం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం నిరుద్యోగ జెఎసి ఛైర్మన్ నీల వెంకటేష్ నాయకత్వంలో వందలాది మంది కస్తూర్బా టీచర్లు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ముట్టడికి వివిధ జిల్లాల నుండి పెద్ద యెత్తున టీచర్స్ కదలివచ్చారు. వారినుద్దేశించి ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రెండేళ్ళ క్రితం అక్టోబర్‌లో ఆర్థిక శాఖ జి.ఓ 1321 ఇస్తూ కస్తుర్బా గాంధీ పాఠశాలల్లో 937 టిచర్ పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేశారని తెలిపారు. ప్రభుత్వ జిఓలో కాంట్రాక్టు టీచరుగా భర్తీ చేయాలని స్పష్టంగా ఉందని, విద్యాశాఖ అధికారులు మౌఖికంగా చెప్పి తీసుకుంటూ ప్రతి సంవత్సరం మార్చిలో టర్మినేట్ చేస్తున్నారని కృష్ణయ్య తెలిపారు. ప్రస్తుతం ఉన్న 937 మంది టీచర్లను మెరిట్ పై ఎంపిక చేసి, నియమించారని, వారు కెజిబివి లలో బోధకులుగా పనిచేస్తున్నారని తెలిపారు.

వీరికి రాత పూర్వక ఆదేశాలు ఇవ్వకుండా మౌఖికంగా చెప్పి చేర్చుకుంటూ మార్చిలో తొలగిస్తున్నారని, ఆగష్టులో తిరిగి తీసుకుంటున్నారని వాపోయారు. కస్తూర్బా పాఠశాలలో టీచర్స్ గా పని చేసేందుకు ఇటీవల ప్రభుత్వం 1241 కాంట్రాక్ట్ టీచర్ల రిక్రూమెంట్ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. 2021లో నియమించిన 937 కాంట్రాక్ట్ టీచర్లను ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. వీరు కూడా కాంట్రాక్ట్ టీచర్స్ గా రిక్రూట్ అయిన వారేనని బోధనంలో రెండేళ్ల అనుభవం ఉందని, వీరిని తీసివేసి కొత్తవారిని తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

వీరికి విద్యార్హతలు ఉన్నాయని, కాంట్రాక్టుగా రిక్రూట్ అయ్యారని, తెలిపారు. వీరు పని చేస్తున్న తాత్కాలిక పోస్టుల్లో మళ్లీ తాత్కాలిక ఉద్యోగులను నియమించ వద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని కృష్ణయ్య అన్నారు. వీరందరిని డ్యూటీలో కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. 2021 నవంబర్ నుండి పని చేస్తున్న 937 టిచర్లను యదాతధంగా కొనసాగించాలని కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం అన్న సుప్రీంకోర్టు తీర్పు ననుసరించి వీరికి కనీసం చేసిన పనిదినాలకు సరియగు వేతనం చెల్లించాలని, కోరారు. గత నవంబర్ నుండి పని చేస్తున్న 937 టిచర్లను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

మానవతా దృక్పథంతో పరిశీలించి విద్యార్థుల విద్యా బోధన కోసం నవంబర్ 2021 లో నియామకం చేయబడిన 937 మంది పిజిసిఆర్‌టి, సిఆర్‌టి, పిఈటి కుటుంబాలకు భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. ఈ ఉద్యమంలో నీల వెంకటేష్, తెలంగాణ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, తెలంగాణ బిసి ఫ్రంట్ ఛైర్మన్ గోరేగే మల్లేశ్ యాదవ్, బిసి విద్యార్ధి సంఘం అధ్యక్షులు అంజి, ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ, బిసి సంఘ నాయకులు సుధాకర్, బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఎమ్. పృధ్వీ గౌడ్, సతీశ్, మల్లేశ్ యాదవ్, భాస్కర్, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News