Friday, May 3, 2024

మత తటస్థ దేశంలో విద్వేషం!

- Advertisement -
- Advertisement -

మానభంగం వంటి అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడిన వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘించింది. అలాంటి ప్రభుత్వం గుజరాత్‌లో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో శిక్షలు అనుభవిస్తున్న పదకొండు మంది పెరోలుపై వెలుపలికి వచ్చినపుడు సత్ప్రవర్తనతో మెలిగారని చెబుతూ జీవిత కాల శిక్ష పడిన వారిని గుజరాత్ సర్కార్ విడుదల చేసింది. 2002లో గోద్రా రైలు సజీవ దహనం, దానిలో కొందరు కరసేవకులు మరణించిన తరువాత జరిగిన మారణకాండలో ఈ దారుణం చోటు చేసుకుంది. బిజెపి పెద్దలు వారికి ఘన స్వాగతాలు పలికి స్వీట్లు పంచారు, వీర కుంకుమలు దిద్దారు. తమ ‘ఘన’ కార్యానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉందని ఆ రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది.

Bilkis Bano case convicts released by gujarat govt

కుటుంబంలో లోపాలు ఉంటే సర్దుకుపోవాలి, ఎవరైనా పరువును బజారుకు ఈడుస్తారా? అలాగే దేశం గురించి వేలెత్తి చూపే విధంగా విదేశాలకు అవకాశమిచ్చే రీతిలో ప్రవర్తించవచ్చా! నిజమే, ఎవరు ఏ సందర్భంలో ఎందుకు చెప్పినా ఎప్పుడైనా ఆలోచించాల్సిన అంశమే. ఈ సుభాషితం ముందుగా ఎవరికి వర్తింప చేయాలి? ఎవరు పాటించాలి? భారతీయులందరూ ఆలోచించాల్సిన అంశం. తమ మీద విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ముస్లింలు విమర్శిస్తుండగా, ఈ మతం వారు తమ మతం మీద జీహాద్ ప్రకటించారని, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని హిందూ మత పెద్దలుగా చెప్పుకొనే వారు ప్రతి ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద భారత్ అంటే మధ్య యుగాల నాటి మత విద్వేష భూమిగా ప్రపంచం భావించేట్లు చేస్తున్నారనే భావం రోజు రోజుకూ పెరుగుతోంది.

విదేశాల్లో లేదా స్వదేశంలో విమర్శలకు అవకాశం కల్పిస్తున్నదెవరు? ఏం చెబుతున్నారు? ఆచరణలో ఏం చేస్తున్నారు? ఇటువంటి స్థితిలో 2022 అక్టోబరు 21న సుప్రీంకోర్టు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం తోడైంది. దాఖలైన ఒక కేసు ఏమౌతుంది అన్నది పక్కన పెడితే కోర్టు చేసిన పరిశీలన ఎంతో కీలకమైనది. న్యాయమూర్తులు కెఎం జోసెఫ్, హృషీకేష్ రాయి బెంచ్ ‘ఇది 21వ శతాబ్దం, మనం దేవుడిని ఎంతకు దిగజార్చాము? మనకు శాస్త్రీయ దృష్టి ఉండాలని ఆర్టికల్ 51 చెబుతున్నది. మతం పేరుతో జరుగుతున్నదేమిటి? ఇది విషాదం’ అని చెప్పింది. మతం తటస్థంగా ఉండే దేశంలో విద్వేష వాతావరణం ఉందం టూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తాము చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదని, ఏ మతానికి వ్యతిరేకంగా ఎవరు చేసిన వాటికైనా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు అలాంటి ద్వేష పూరిత ప్రసంగాల ఏ మతం వారు చేసినప్పటికీ వాటి గురించి ఎవరూ ఫిర్యాదు చేసినా, చేయకున్నా స్వంతంగా కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

No Calculation For Death Sentences in India

తమ ఆదేశాలు పాటించకుంటే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాల గురించి జర్నలిస్టు షాహిన్ అబ్దుల్లా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 51(ఎ) ప్రకారం ప్రతి ఒక్కరూ మౌలిక విధుల్లో భాగంగా శాస్త్రీయ దృష్టి, మానవత్వం, పరిశీలన, సంస్కరణ దృక్పధాన్ని పాటించాలని, భారత్ ఒక లౌకిక దేశంగా రాజ్యాంగం ఆలోచించిందని, భిన్న మతాలు, కులాలకు చెందిన వారు సామరస్య పూర్వకంగా జీవించనట్లైతే సోదరభావం ఉండదని కోర్టు పేర్కొన్నది.

సుప్రీం కోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచ జనావళిని, విశ్లేషకులను ఆకర్షించకుండా ఉంటాయా?మన పత్రికలను చదవరా, టివిలను చూడరా? ఇప్పటికే విద్వేష ప్రసంగాలు మన దేశానికి పెద్ద మరకను అంటించాయి. దీనికి కారకులు ఎవరు అంటే మెజారిటీ, మైనారిటీ మతాలకు చెందిన ఓటు బ్యాంకు పార్టీలు, నేతలు, కుట్రదారులు, ఉన్మాదులు, వారి ప్రభావానికి లోనై తప్పుదారి పట్టినవారు తప్ప సామాన్యులు కాదు. విద్వేష వాతావరణం ఏర్పడటానికి ఎవరిది ఎంత భాగం అంటే జనాభాలో ఎవరి వాటా ఎంత ఉంటే అంత అన్నది స్పష్టం. ఫిర్యాదును చూస్తుంటే దేశంలో విద్వేషవాతావరణం వ్యాపించినట్లు కనిపిస్తోందని కోర్టు పేర్కొన్నది. పిటీషనర్ తరఫున న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ విద్వేష ప్రసంగాల గురించి ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు కేసులున్నాయని, నిరోధ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ అక్టోబరు తొమ్మిదిన ఢిల్లీలో జరిగిన ఒక సభలో ముస్లింల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టినందున కోర్టును ఆశ్రయించినట్లు సిబల్ చెప్పారు.

Bilkis Bano Case: Petition against Convicts in SC

ఢిల్లీలో ముస్లింలు చేసినట్లుగా చెబుతున్న ఒక హత్య గురించి విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు చేసిన జన అక్రోశ్ నిరసన సభలో బిజెపి ఎంపి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ప్రసంగిస్తూ పేరు ప్రస్తావించకుండానే ముస్లింలను సాంఘికంగా బహిష్కరించాలని పిలుపు ఇచ్చినట్లు దరఖాస్తుదారు పేర్కొన్నారు. పిటీషన్‌పై వాదన ప్రతివాదనల సందర్భంగా అలాంటి పిలుపులు హిందువులకు వ్యతిరేకంగా కూడా ఇస్తున్నారని, ఉభయ పక్షాలు అందుకు పాల్పడుతున్నట్లు కోర్టు పేర్కొన్నది. ముస్లింలు కూడా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు కదా అని పేర్కొన్నది. దాని మీద సిబల్ స్పందిస్తూ వారిని మినహాయించాలని అనుకుంటున్నారా? ఎవరు అలాంటి విద్వేష ప్రసంగాలు చేసినా సహించకూడదు అని చెప్పారు. ఒక సామాజిక తరగతికి వ్యతిరేకంగా ఒక తరహా ప్రకటనను నొక్కి వక్కాణించాలని తాము చూడటం లేదని, తమకు ఆ సంగతి తెలుసునని కోర్టు పేర్కొన్నది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బిజెపి అధికారంలో ఉంది.

ఢిల్లీలో ఆవ్‌ుఅద్మీ పాలన ఉన్నా పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు. ఇక్కడ జరుగుతున్న విద్వేష ప్రసంగాలు జనాభా దామాషా ప్రకారం చూసినా హిందూ ఉన్మాదులు చేస్తున్నవే ఎక్కువ. ఎవరూ ఫిర్యాదులు చేయకున్నా పోలీసులు తమకు తామే కేసులు నమోదు చేయాలని దేశ సర్వోన్నత కోర్టు చెప్పిందంటే మన దేశంలో ఉన్న పరిస్థితి గురించి వేరొకరెవరో వేలెత్తి చూపాల్సిన అవసరం ఉందా? గతంలో అధికారంలో ఉన్న పార్టీలు లేదా ప్రభుత్వాలకు ఇలాంటి ఆదేశాలు ఎన్నడైనా జారీ చేసిన ఉదంతం ఉందా? ఎవరు సమాధానం చెబుతారు! ఇలాంటి పరిస్థితి రావటం మెజారిటీ రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని అభిశంసించటమే. మానభంగం వంటి అత్యాచారాల కేసుల్లో శిక్షలుపడిన వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘించింది. అలాంటి ప్రభుత్వం గుజరాత్‌లో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో శిక్షలు అనుభవిస్తున్న పదకొండు మంది పెరోలుపై వెలుపలికి వచ్చినపుడు సత్ప్రవర్తనతో మెలిగారని చెబుతూ జీవిత కాల శిక్ష పడిన వారిని గుజరాత్ సర్కార్ విడుదల చేసింది. 2002లో గోద్రా రైలు సజీవ దహనం, దానిలో కొందరు కరసేవకులు మరణించిన తరువాత జరిగిన మారణకాండలో ఈ దారుణం చోటు చేసుకుంది.

బిజెపి పెద్దలు వారికి ఘన స్వాగతాలు పలికి స్వీట్లు పంచారు, వీర కుంకుమలు దిద్దారు.తమ ‘ఘన’ కార్యానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉందని ఆ రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. బాధితులుగా ఉన్న తమను దీని గురించి సంప్రదించలేదని, విడుదల గురించి తమకు తెలుపలేదని బిల్కిస్ కుటుంబం పేర్కొన్నది. పదకొండు మంది దోషులు పెరోలు, శిక్షపడక ముందే జైల్లో ఉన్నారనే పేరుతో సంవత్సరాల తరబడి వెలుపలే ఉన్నారు. గడువు తీరిన తరువాత జైలుకు వచ్చినా ఇదేమిటని అడిగిన వారు లేరు. కారణం వారంతా బిజెపికి చెందినవారు, అక్కడున్నది వారి ప్రభుత్వమే గనుక. వారిలో ఒకడు పెరోలు మీద వచ్చి ఒక మహిళ మర్యాదకు భంగం కలిగించాడంటూ పోలీసులు ఒక కేసు నమోదు చేశారు.

అతడిని విడుదల చేయకూడదని పోలీసుల డైరీలో రాసినా ఖాతరు చేయకుండా విడుదల చేశారు. మరొకరిని విడుదల చేస్తే మీకేమైనా అభ్యంతరమా అని బిల్కిస్ కుటుంబాన్ని అడగ్గా కూడదని చెప్పినప్పటికీ విడుదల చేశారు, ఇతరుల గురించి అసలు అలా అడగనూ అడగలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ విడుదలకు మెరుపు వేగంతో కదిలింది. గుజరాత్ సర్కార్ 2022 జూన్ 28న కేంద్రానికి లేఖరాస్తే జూలై 11న అనుమతి మంజూరైంది. ఏ కారణంతో విడుదలకు కేంద్రం అనుమతించిందో గుజరాత్ ప్రభుత్వం కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించలేదు. సిపిఎం నాయకురాలు సుభాషిణీ ఆలీ నేరగాండ్ల విడుదలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాహిత కేసును దాఖలు చేశారు. ఆమెకు ఈ కేసుతో ఎలాంటి సంబంధమూ లేదని మూడవ పక్షపు కేసును స్వీకరించకూడదని గుజరాత్ ప్రభుత్వం వాదించింది. నవంబరు 29న కేసు విచారణకు రానుంది. చిత్రం ఏమిటంటే ఈ నేరగాండ్లను గుజరాత్ ప్రభుత్వం ఆజాదీకా అమృతమెత్సవం పేరుతో ఆగస్టు 15న విడుదల చేసింది. అనేక చోట్ల ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఖైదీలను విడుదల చేశారు.

ఈ నేరగాండ్లకు దానితో నిమిత్తం లేకుండా అదే రోజున వదిలారు. నారీశక్తి, మహిళలకు రక్షణ గురించి కబుర్లు చెబుతున్న పెద్దలు ఈ కేసులో రేపిస్టులను విడుదల చేసేందుకు ఎవరినీ ఖాతరు చేయలేదు. కేసు విచారణ జరిపిన సిబిఐ, సిబిఐ కోర్టు జడ్జి కూడా వీరి విడుదలను వ్యతిరేకించారు. ‘ఈ కేసులో నేరగాండ్లకు బాధితులకు ఎలాంటి సంబంధమూ లేదు, ఎలాంటి వైరమూ లేదు. బాధితులు ఒక మతానికి చెందిన వారనే కారణాలతో మాత్రమే నేరానికి పాల్పడ్డారు. ఈ కేసులో చిన్న పిల్లలను, గర్భిణీని వదల్లేదు. ఇది అత్యంత హీనమైన విద్వేష పూరిత, మానవత్వం మీదనే జరిపిన నేరం’ అని సిబిఐ కోర్టు జడ్జి పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి పాలకులు, వాతావరణం ఉన్నపుడు ఎవరో బదనాం చేసేందుకు చూస్తున్నారని గగ్గోలు పెట్టడం అంటే దొంగే దొంగని అరవటం తప్పవేరు కాదు. విదేశాల్లో స్పందిస్తే జాతి దురహంకారం అని, దేశీయంగా స్పందించిన వారిని దేశద్రోహులు మరొక పేరుతో నిందిస్తూ ఎదురు దాడి చేస్తున్నారు.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News