Monday, April 29, 2024

బిల్కిస్ బానో కేసులో ‘సుప్రీం’ తీర్పు

- Advertisement -
- Advertisement -

మొత్తం దేశ ప్రజలు ఒక వంక అయోధ్యలో భవ్యమైన రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’ సంబరాలలో తేలియాడుతున్న సమయంలో బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల శిక్షా కాలాన్ని తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న చట్ట విరుద్ధమైన నిర్ణయాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక విధమైన గగుర్పాటుకు గురి చేస్తుంది. ఇప్పటి వరకు నిందితులను కాపాడేందుకు అసాధారణమైన అధికార బలాన్ని ఉపయోగించుకొని ప్రయత్నాలు చేస్తున్న వారికి తీవ్రమైన భంగపాటు అని చెప్పవచ్చు. శ్రీరాముడు అంటేనే మనకు ‘ఏకపత్నీవ్రతుడు’ గుర్తుకు వస్తారు. నైతిక విలువలకు అంతకన్నా మరో సజీవ ఉదాహరణ మనముందుండదు. అటువంటి యుగ పురుషుడిని స్మరించుకొంటున్న సమయంలో ఒక నిస్సహ మహిళ న్యాయం కోసం రెండు దశాబ్దాలకుపైగా న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడడం, బలమైన శక్తులు ఆమెకు వ్యతిరేకంగా పని చేస్తుండడం మొత్తం జాతికి ఓ విధమైన సిగ్గుచేటైన విషయం.

కండబలం, ధనబలం ముందు వ్యవస్థలు సాగిలపడుతున్న సమయంలో న్యాయం కోసం సాధారణ ప్రజలకు దిక్కుతోచని స్థితిలో చీకట్లో చిరుదీపం మాదిరిగా సుప్రీం కోర్టు తీర్పు ఆ మహిళకు ఆసరాగా నిలబడినదని చెప్పవచ్చు. న్యాయస్థానాలు బలహీనులకు న్యాయం అందించడం కోసమే అని చెబుతున్నా ఆచరణలో చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే సామాన్యులు న్యాయస్థానం ద్వారా న్యాయం పొందగలుగుతున్నారు. 2002 గుజరాత్ మారణ హోమం సమయంలో అయిదు నెలల గర్భవతి అయిన బిల్కిస్ బానోపైన, ఆమె కుటుంబ సభ్యులపైన సామూహిక అత్యాచారానికి పాల్పడడం, మూడేళ్ళ ఆమె కుమార్తెతో సహా 14 మందిని మూకుమ్మడిగా చంపేసిన కేసు రెండు దశాబ్దాలుగా కలకలం రేపుతూనే ఉంది. రాజకీయంగా, సామాజికంగా బలమైన వర్గాలు ఈ కేసును కప్పిపుచ్చేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే సుప్రీం కోర్టు జోక్యంతోనే మొదటి నుండి బాధితురాలికి ఉపశమనం కలిగించే ప్రయత్నం జరుగుతూ వస్తున్నది.

మొదటగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్యాడర్‌కు చెందిన అప్పటి సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివేక్ దూబే నేతృత్వంలో ఏర్పర్చిన సిట్ అత్యంత సాహసోపేతంగా, నిజాయితీతో వ్యవహరించి బాధితులను చట్టం ముందుకు తీసుకు రాగలిగింది. బాధితురాలి భయపడుతున్న వాతావరణంలో వారిలో ఆత్మవిశ్వాసం కలిగించి కేసు దర్యాప్తును ముందుకు తీసుకు వెళ్లడం అంత తేలికైన వ్యవహారం కాబోదు. వివేక్ దూబే బృందం నిర్భయంతో ఎటువంటి వత్తిడులకు లొంగకుండా నిజాయితీతో వ్యవహరించిన కారణంగానే 11 మంది బాధితులకు జీవిత శిక్షపడింది. అయితే, ఎటువంటి సంశయం లేకుండా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు దోషులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదిస్తూ, శిక్షా కాలాన్ని తగ్గించి ముందస్తుగానే విడుదల చేసింది. 2022 ఆగస్టులో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై అప్పట్లో పెద్ద యెత్తున విమర్శలు వచ్చాయి. జైలు నుండి విడుదల సందర్భంగా వారేదో ‘ఘనకార్యం’ సాధించి వస్తున్నట్లు వారికి లభించిన స్వాగత సత్కారాలు మొత్తం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేశాయి.

బాధితురాలు ధైర్యం చేసి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు ఈ సంచలన తీర్పు వెలువడింది. ఒక వంక దేశంలో మహిళలకు సొంత ఇళ్లలో, వారు పని చేసే చోటనే భద్రత కరువవుతోందని, వారిపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్న సమయంలో దారుణమైన అకృత్యాలకు పాల్పడిన వారికి మద్దతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలబడటం, వారిని కాపాడేందుకు అత్యున్నత న్యాయవాదులను రంగంలోకి దింపడం సిగ్గుచేటైన అంశం.ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు నిత్యం మహిళల పట్ల సానుభూతి ఒలకబోస్తూ, వారి రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాజకీయ వేత్తలకు, పాలకులకు చెంపపెట్టు కాగలదని ఆశిద్దాము. శిక్ష తగ్గింపు ఆదేశాలను సమర్ధించుకోవడానికి వాస్తవాలను అందజేయడంలో గుజరాత్ ప్రభుత్వం మోసానికి పాల్పడిందని ధర్మాసనం పేర్కొనడం ఒక విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభిశంసించడమే కాగలదు. నేరస్థులు మోసం చేసి శిక్షను తప్పించుకున్నట్టయితే, సమాజంలో శాంతి, భద్రతలు మిథ్యగా మారిపోతాయని సుప్రీం కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

కేంద్ర ప్రభుత్వం ఆమోదం ప్రాతిపదికనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లైతే ఈ పాపంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాన వాటా ఉన్నట్లేనని సుప్రీం కోర్టు పేర్కొనడం గమనార్హం. నేరాల క్రూరత్వాన్ని, సమాజంపై వాటి విస్తృత పర్యవసానాలను, చట్టబద్ధ పాలనను వేటినీ పరిగణనలోకి తీసుకోకుండా నాగరిక ప్రభుత్వాలు నేరస్థులను కాపాడే ప్రయత్నం చేయడం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వాలనేవి రాజ్యాంగబద్ధమైన సంస్థలు. ప్రభుత్వాలు తమ అధికార పరిధులను, చట్టాన్ని, న్యాయ వ్యవస్థను ఉల్లంఘించేలా వ్యవహరించినట్లైతే, అది మన ప్రజాస్వామ్య ఉనికినే ప్రమాదంలో పడేస్తుందని గమనించాలి. సుప్రీం కోర్టు తీర్పు పట్ల దేశం అంతటా హర్షామోదాలు వ్యక్తం అవుతూ ఉంటే గుజరాత్‌లోని రాజకీయ పార్టీలు మాత్రం మౌనం వహించడం విస్మయం కలిగిస్తోంది. కేవలం ఆప్ మాత్రమే స్పందించింది. ముఖ్యంగా నిందితులను కాపాడేందుకు విస్తృతంగా ప్రయత్నాలు చేసిన్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న బిజెపి నేతలు మౌనం వహిస్తున్నారు.

నిందితులకు క్షమాభిక్ష కల్పించి విడుదల చేయాలని సిఫార్సు చేసిన జైలు సలహా కమిటీ సభ్యుడైన గోధ్రా బిజెపి ఎంఎల్‌ఎ సికె రాహుల్ మాత్రం కోర్టు తీర్పు విషయంలో ఎటువంటి వ్యాఖ్యానం చేయలేనని తప్పించుకున్నారు. మొత్తం తీర్పు చదివిన తర్వాతనే ఏమైనా చెప్పగలను అన్నారు. 2022లో నిందితులను శిక్ష తగ్గించి విడుదల చేసినప్పుడు వారు ‘మంచి సంస్కారాలు గల బ్రాహ్మణులు’ అంటూ కొనియాడి పెనువివాదంలో ఆయన చిక్కుకున్నారు. మరోవంక, సుప్రీం కోర్టు ఆదేశం మేరకు ఈ కేసులో 11 మంది నిందితులు తిరిగి రెండు వారాలలో జైలుకు వేడతారా లేదా తప్పించుకు తిరుగుతారా? అనే చర్చ ఒక వంక జరుగుతుంది. అన్నింటికీ మించి నిందితులను కాపాడేందుకు నేరమయ దుర్మార్గానికి పాలపడిన వ్యవస్థలు, వ్యవస్థలలో బాధ్యులను జవాబుదారీగా చేసే విధంగా సుప్రీం కోర్టు తీర్పు దోహదం చేయకపోవడం దురదృష్టకరం. ఆ విధంగా జవాబుదారీగా చేయగలిగితే తప్ప ఇటువంటి నేరాలను కట్టడి చేయడం సాధ్యం కాదు.

ఈ మధ్యనే చట్టసభలలో మహిళలకు మూడో వంతు సీట్లు రిజర్వ్ చేసే బిల్లుకు చట్టరూపం ఇవ్వడం ద్వారా ‘మహిళా సాధికారికత’ లో పెద్ద ముందడుగు వేస్తున్నామని భావించే రాజకీయ నాయకులు వారి రక్షణ పట్ల ఎంతటి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో ఈ తీర్పు వెల్లడి చేస్తుందని చెప్పొచ్చు. అయితే అప్పుడప్పుడు కొన్ని కేసులలో సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత సంచలనాలు జరుగుతున్నప్పటికీ మన సమాజంలో మహిళలకు రక్షణ లభిస్తుందని ఆశింపలేము. ఢిల్లీలో ‘నిర్భయ’ ఉదంతం తర్వాత కఠినమైన చట్టాలు తీసుకు వచ్చాము. అత్యాచారం నేరానికి మరణ శిక్ష కూడా విధించే అవకాశం కల్పించాము. బాధితుల రక్షణ కోసం కేంద్రం ప్రత్యేకంగా ఓ నిధిని ఏర్పాటు చేసింది. అయినా దేశంలో ఇటువంటి కేసులసంఖ్య పెరుగుతూనే ఉంది.ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిధిని బాధితులకు అవసరమైనప్పుడు ఖర్చు చేస్తున్న సంకేతాలు ఏమాత్రం లేవు. ప్రతి కార్యాలయంలో మహిళలపై వేధింపుల ఫిర్యాదుల పరిశీలనకు ఓ కమిటీ ఉండాలని చట్టం ఉన్నప్పటికీ ఎన్నికార్యాలయాల్లో అటువంటి ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి?

కమిటీలు ఏర్పాటు చేసినా అవి ఏ మేరకు పని చేస్తున్నాయి? వేధింపులకు గురవుతున్న మహిళలు ఎందరు నిర్భయంగా ఫిర్యాదు చేయగలుగుతున్నారు? ఉన్నత స్థానాలలో ఉన్న మహిళలో ఎటువంటి విషయాలలో అభద్రతకు గురవుతూ ఉండటాన్ని చూస్తున్నాము. పోలీస్ సంస్కరణలను సూచిస్తూ సుప్రీం కోర్టు ఏనాడో ఇచ్చిన ఆదేశాలను ఎన్ని రా్రష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్నాయి? శాంతిభద్రతలు, నేరపరిశోధనలను వేర్వేరు విభాగాలుగా చేయాలని సూచన అమలవుతున్నదా? డిజిపిల నియామకంలో, పోలీస్ అధికారుల బదిలీలలో రాజకీయ జోక్యం లేకుండా చేయగలుగుతున్నారా? పోలీసులపై ఫిర్యాదుల పరిష్కారానికి ఓ కమిటీ ఏర్పాటు చేయమని సుప్రీం కోర్టు చేసిన సూచనను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్నాయి? పోలీస్ ఉన్నతాధికారులు అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల ప్రయోజనాలు కాపాడే వారుగా వ్యవహరిస్తున్నంత కాలం మహిళలకే కాదు మన సమాజంలో ఎవ్వరికీ న్యాయం అందుబాటులో ఉండదు. పోలీస్ ఉన్నతాధికారుల నియామకాల్లో రాజకీయ ప్రమేయం నివారించనిదే చట్టబద్ధ పాలన సాధ్యం కాదు.

బిల్కిస్ బానో వంటి వారికి మాదిరిగా దశాబ్దాల తరబడి న్యాయపోరాటం చేసేందుకు అవసరమైన అండదండలు లభించడం అందరికీ సాధ్యం కాదు. ఉన్నత ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు చేస్తున్న వారు సహితం న్యాయం కోసం ధైర్యంగా నేడు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే పరిస్థితి లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు వలస పాలకుల చట్టాలను మార్చివేసి తీసుకు రావడం సంతోషం కలిగిస్తున్నా, వాటిల్లో సహితం పోలీసులకు విశేష అధికారాలు కట్టబెట్టడం ఆందోళన కలిగించే అంశం. నేర న్యాయ వ్యవస్థ మరింత కరుకుగా కండబలం, ధనబలం గలవారికి మాత్రమే అందుబాటులో ఉండే ప్రమాదం లేకపోలేదు.ఏదేమైనా సామాజిక చైతన్యం ద్వారా మాత్రమే వ్యవస్థలలో జవాబుదారీతనం తీసుకు రాగలమని గమనించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News