Thursday, May 2, 2024

రేవంత్ వర్సెస్ ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్‌లో నిరుద్యోగ సభల చిచ్చు రేగింది. కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. నేతల మధ్య సమన్వయం లేదని మరోసారి నిరూపితమైంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కలిసి సాగాల్సిన తరుణంలో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు బయటకు పొక్కాయి. ఒకవైపు ఇతర పార్టీలు ఎన్నికల వ్యూహాలు రచించి ముందుకు సాగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఒకరి తప్పులను ఒకరు ఎత్తిచూపుకుంటుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం వారిలో వారే విమర్శలు చేసుకుంటున్నారు. నిరుద్యోగ నిరసనల పేరుతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ తరుణంలోనే నల్గొండ ఎంపి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

బిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పే కాంగ్రెస్ రానున్న ఎన్నికల కోసం కొన్ని రోజులుగా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర స్ఫూర్తితో హాథ్ సే జోడో యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించింది. ఇలాంటి పలు కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్ శ్రేణులను తిరిగి యాక్టివేట్ చేసే పనిలో పడింది కాంగ్రెస్ నాయకత్వం. తాజాగా టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారాన్ని కూడా సమర్థంగా వాడుకుంది. క్వశ్చన్ పేపర్ల లీకులతో నిరుద్యోగుల సమస్యలు మరోసారి ఫోకస్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. నిరుద్యోగ నిరసన పేరుతో ఈ నెల 21వ తేదీన నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది.
ఇక్కడే అసలు కథ మొదలైంది…
సరిగ్గా ఇక్కడే అస్సలు కథ మొదలైంది. కాంగ్రెస్ నేతల మధ్య మరోసారి ఫిర్యాదుల పర్వం షురూ అయ్యింది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు థాక్రేకు ఫిర్యాదు చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండానే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న తన నియోజకవర్గంలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీలో నిరుద్యోగ సభ నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ నెల 21న నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీలో నిరుద్యోగ సభను నిర్వహించనున్నట్టుగా రేవంత్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఈ విషయమై తనతో చర్చించకపోవడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో పాటు అలక బూనారు.

Also Read: కాన్పు కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్తే..కడుపులో..

కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన దీక్ష రద్దు
అయితే సమస్య తీవ్రతను గుర్తెరిగిన పిసిసి తక్షణమే దిద్దుబాటు చర్య తీసుకన్నట్లైంది. నల్గొండలో తలపెట్టిన కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభ్యంతరంతో పిసిసి స్పందించింది. నిరుద్యోగ నిరసన సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, రాష్ట్రంలో ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ నేతలు తమ ఆధిపత్యం కోసం ప్రయత్నం చేయడం ప్రత్యర్దులకు రాజకీయంగా అవకాశాలు కల్పించేందుకు దోహదం చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో సమస్యను పెద్దది చేసి మరింత రచ్చకెక్కేకన్నా సమస్య పరిష్కారానికే పిసిసి నడుం బిగించింది. సత్వర పరిష్కారాన్ని చూపగలిగింది. మరోవైపు పిసిసి తాజా నిర్ణయం పార్టీకి ఉపయుక్తంగా ఉందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News