ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం (17.9.25) కీలక వ్యాఖ్యలు చేసింది. ఏటా శీతాకాలంలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరడానికి పంటవ్యర్థాల దహనమే ప్రధాన కారణమన్న వాదనలు వస్తున్న నేపథ్యంలో దీనికి పాల్పడుతున్న కొంత మందిని ఎందుకు జైలుకు పంపకూడదని పంజాబ్ ప్రభుత్వాన్ని నిలదీసింది. అలాగే ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డుల్లో ఖాళీలను మూడు నెలల్లోగా భర్తీ చేయాలని ఆదేశించింది. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో రైతులు తదుపరి సాగు కోసం పొలాలను చదును చేయడానికి వాడుకలో ఉన్న వ్యవసాయ వ్యర్థాలను తగులబెడుతుంటారు. పర్యావరణ పరిరక్షణ చట్టం కింద పంటలు కాల్చడం నిషేధంలోకి వస్తుంది. అయితే దీనికింద రైతులను అరెస్ట్ చేస్తే రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పంజాబ్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. దీన్ని కూడా సుప్రీం కోర్టు తప్పుపట్టింది.
పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడానికి దూరంగా ఉంటారని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. రైతులు మనకు అన్నం పెడుతున్నారు కాబట్టి వారు ప్రత్యేకమైన వారని, అలా అని పర్యావరణాన్ని పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా అని నిలదీసింది. ఏటా ఈ సీజన్‌లో పంట వ్యర్థాల దహనం తీవ్ర సమస్యగా వేధిస్తోంది. చలిని తట్టుకోవడానికి చలిమంటలు వేయడం, పంట పూర్తయిన తరువాత వ్యర్థాలను దగ్ధం చేయడం, వాహనాల నుంచి లేచే దుమ్ము ధూళి, ఇవన్నీ ఉత్తరాది నగరాలకు ముఖ్యంగా ఢిల్లీ నగరానికి తీరని సమస్యలుగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత ఏడాది ఒక్క పంజాబ్ లోనే సెప్టెంబర్ అక్టోబర్ మధ్య కాలంలో 26 వేలకు పైగా పంట దహనాలు జరిగాయంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించవచ్చు. ప్రపంచం లోని అత్యంత కాలుష్య ఐదు నగరాల్లో నాలుగు దక్షిణాసియా నగరాలే.
అవి లాహోర్, ఢిల్లీ, ముంబై, ఢాకా. ఈ నగరాల్లోని పొలిమేరల్లోని పొలాల్లో పంట వ్యర్థాలను విపరీతంగా దగ్ధం చేస్తుంటారు. ఈ వ్యర్థాల మంట నుంచి వచ్చే పొగ మసి గాలి సాంద్రతలో 40% వరకు పేరుకుపోతుంది. దీంతో గాలి వేగం తగ్గిపోవడమే కాక, వర్షానికి కూడా ఆటంకం ఏర్పడుతుంది. సుదీర్ఘకాలం ఈ కాలుష్యాలు గాలిలో నిండి ఉండడంతో గాలి నాణ్యత క్షీణిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాయు కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు, గుండెపోటు, పక్షవాతం వంటి వ్యాధులకు దోహదం చేస్తోందని చెబుతున్నారు. కేవలం వాయు కాలుష్యం వల్లనే 2019 లో దాదాపు 1.67 మిలియన్ మంది అకాల మరణానికి బలయ్యారని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. వాయు నాణ్యతలో పరమ అధ్వాన దేశాల జాబితాలో భారత్ 8వ ర్యాంకులో ఉందని స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ గత ఏడాది తన వార్షిక నివేదికలో వెల్లడించింది.
వాహనాలు, పరిశ్రమలనుంచి వచ్చే కాలుష్యాలు కూడా 85 నుంచి 94 శాతం వరకు ప్రభావం చూపిస్తున్నాయి. వాయు కాలుష్యంతో వాతావరణ మార్పు సంభవించి 2030 నాటికి కార్మికుల పని గంటలు కోల్పోయి, 4.5% వరకు దేశ జిడిపి తగ్గుతుందని రిజర్వుబ్యాంకు గతేడాది వెల్లడించడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. ఉత్పత్తి సంస్థలు మూతపడి, నిర్మాణ, సేవా రంగాలు సరిగ్గా పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతుందని, ప్రజలు ఏదైనా కొనుగోలు చేయడానికి బయటకు రాలేరని ఆ నివేదిక వివరించింది. వాయు కాలుష్యం వల్ల భారత్‌లో ఏటా 95 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారాలు మూతపడతాయని డాల్బెర్గ్ నివేదిక అంచనా వేసింది. ఏ నగరంలోనైనా పి.ఎం 2.5 కాలుష్య స్థాయిని మించి ఉంటే ఆ నగరంలోని తలసరి ఆదాయంలో నష్టం ఎక్కువగానే ఉంటుంది.
‘జాతీయ స్వచ్ఛమైన గాలి’ అన్న లక్షంతో 2019 లో భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2024 నాటికి పిఎం 2.5 కాలుష్య స్థాయిలను 20 నుంచి 30 శాతానికి తగ్గించాలని లక్షంగా పెట్టుకున్నా అది ఇంకా నెరవేరలేదు. పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టడానికి ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. పంట వ్యర్థాలను వేరు చేయడానికి హ్యాపీ సీడర్ అనే యంత్రాలను వినియోగించవచ్చు. ఇది పొలాల నుంచి వ్యర్థాలను వేరు చేస్తూనే తదుపరి పంట విత్తనాలను కూడా నాటుతుంది. ఆ వ్యర్థాలను పొలంలోనే నశింప చేస్తుంది. పంట వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేయవచ్చు. ఈ వ్యర్థాల నుంచి వెలువడే మెథేన్‌ను పరిశ్రమలకు వాడుకోవచ్చు. అయితే ఈమేరకు సాంకేతిక యంత్రాంగం అవసరమవుతుంది. బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసి పంట వ్యర్థాలను వాటికి ముడి పదార్థంగా వినియోగించవచ్చు.
పంట వ్యర్థాలు ప్రయోజనకరంగా మారాలంటే ప్రభుత్వ పరంగా తగిన ప్రణాళికలు అవసరమవుతాయి. పంటలన్నిటిలో వరిగడ్డి వ్యర్థాలు భారీగా ఉంటాయి. వరికి బదులు ఇతర పంటల సాగుకు రైతులను మళ్లించడానికి హర్యానా ప్రభుత్వం ఎకరాకు రూ. 7000ను రైతులకు ప్రోత్సాహకంగా అందిస్తోంది. దీంతోపాటు వరిగడ్డి నిర్వహణకు అదనంగా ఎకరానికి మరో రూ. 1000 అందిస్తోంది. రానున్న రెండు మూడేళ్లలో వరిగడ్డి వ్యర్థాల దగ్ధాలను పూర్తిగా నివారిస్తామని హర్యానా ప్రభుత్వం చెబుతోంది. పంట వ్యర్థాల నివారణ, నిర్వహణ కోసం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ గత ఏడాది రూ. 3333 కోట్లను హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు కేటాయించింది. ఈ మొత్తంలో పంజాబ్‌కు రూ. 1531 కోట్లు, హర్యానాకు రూ. 1006 కోట్లు చెందాయి. పంట వ్యర్థాల దగ్ధాల నివారణకు పంజాబ్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా మిగతా రాష్ట్రాల కన్నా పంజాబ్‌లోనే పంట వర్థాల దహనాలు అత్యధికంగా 64% వరకు జరుగుతుండడం చర్చనీయాంశం అవుతోంది.
Also Read : ఓటు చోరులకు సిఇసి అండ