Monday, June 17, 2024

రిషి సునాక్ అసాధారణ చర్య

- Advertisement -
- Advertisement -

బహిరంగ కార్యక్రమాలకు దూరం
సన్నిహిత సహచరులతో ఇష్టాగోష్ఠి
ఎన్నికల్లో పోటీకి మరి ఇద్దరు టోరీల వైముఖ్యం
బరిలో ఉండబోమన్న 78 మంది కన్జర్వేటివ్‌లు

లండన్ : జూలై 4న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ ‘అసాధారణ చర్య’గా తన తొలి శనివారాన్ని సన్నిహిత సహచరులతో ఇష్టాగోష్ఠితో గడిపారు. ఎన్నికల ప్రచారం తొలి వారాంతంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా సునాక్ ఇలా గడపడం ఇదే మొదటిసారి. సంక్షోభంలో ఉన్న అధికార కన్జర్వేటివ్ పార్టీ నుంచి సీనియర్ ఎంపిల భారీ వలస నేపథ్యంలో 44 ఏళ్ల భారత సంతతి నేత సునాక్ తన సహాయకులు, కుటుంబంతో వ్యక్తిగతంగా కొంత సమయం గడుపుతున్నారు. కాగా, ఈ వేసవి ఎన్నికల్లో తిరిగి పోటీ చేయరాదన్న తమ నిర్ణయాన్ని మరి ఇద్దరు టోరీ అగ్ర నేతలు, క్యాబినెట్ మంత్రులు మైకేల్ గోవ్, ఆంద్రియా లీడ్సమ్ ప్రకటించారు.

దీనితో ఎన్నికల బరిలో నుంచి విరమించుకుంటున్న పార్టీ సభ్యుల సంఖ్య 78కి పెరిగింది. బ్రిటన్ దేశవ్యాప్తంగా నియోజకవర్గాల్లో ప్రస్తుత టోరీలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతుండగా శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక లేఖ ద్వారా గోవ్ ప్రకటించిన నిర్ణయం ఊహించినదే. లీడ్సమ్ ఆతరువాత కొద్ది సేపటికే తన లేఖను విడుదల చేశారు. ‘ఎంతో ఆత్మావలోకనం తరువాత రానున్న ఎన్నికల్లో అభ్యర్థిగా నిలవరాదని నిర్ణయించుకున్నాను ’ అని ఆమె సునాక్‌కు రాశారు. మాజీ ప్రధాని థెరెసా మే కూడా బరిలో నుంచి తప్పుకుంటున్న సీనియర్ ఎంపిలలో ఉన్నారు.

బ్రిటన్ రక్షణ శాఖ మాజీ మంత్రి బెన్ వాలాస్ ఎన్నికల రాజకీయాలకు స్వస్తి చెప్పాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది ఇలా ఉండగా, ‘సునాక్‌కు విశ్రాంతి దినం అవసరం ఇప్పటికే ఏర్పడింది. బ్రిటన్ ఇప్పటికే విభిన్న ప్రభుత్వం అవసరంలో ఉంది’ అని ప్రతిపక్ష లేబర్ ఎంపి స్టెల్లా క్రీసీ సోషల్ మీడియా పోస్ట్‌లో సూచించారు. సునాక్ ప్రచారం విషయమై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కన్జర్వేటివ్ మంత్రి బిమ్ అఫోలామి ఖండించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News