Sunday, April 28, 2024

కరోనా వ్యాప్తిలో పాలకుల పాత్ర

- Advertisement -
- Advertisement -

Role of rulers in spread of the Corona

 

‘కరోనాను ఓడించిన ప్రపంచ ఆదర్శ దార్శనికుడు మోడీ’ అని ఫిబ్రవరిలో భక్తులు కీర్తించారు. సమస్యను పరిష్కరించుకోడమే కాదు (టీకా ఇచ్చి) ప్రపంచానికే సాయపడ్డామని 28.01.2021 న విశ్వ విత్త వేదికలో చాటుకున్నారు మోడీ. ఇప్పుడు కరోనా రెండవ అల సునామీలా, విశ్వవిజేతలా వచ్చింది. ప్రముఖ రాజకీయ నాయకులు, అధికారులు కొవిడ్ బారినపడ్డారు. 20వ తేదీ 2,95,041 మందికి కొవిడ్ సోకగా 2023 మంది చనిపోయారు. మొత్తం 1.56 కోట్ల రోగులతో అమెరికా తర్వాత 2వ స్థానంలో ఉన్నాం.

మోడీ సర్కార్ కుంభమేళాకు అనుమతిచ్చింది. ప్రధాని ప్రజలను కుంభ్‌కు ఆహ్వానించారు. జనవరి నుండి హరిద్వార్ గంగా తీరాన కుంభమేళాలో 2.5 కోట్ల భక్తులు స్నానం చేశారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కరోనా జాగ్రత్తలు వదిలేసింది. గంజాయి సాధువులు భౌతిక దూరం పాటించలేదు. ఏప్రిల్ 16 కు 2 వేల భక్తులకు కొవిడ్ అంటింది. మేళాలో 13 అఖాడాలు (సాధువుల శాఖలు) పాల్గొన్నాయి. కొవిడ్ నిబంధనలతో భక్తులను సతాయించం అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ సింఘ్ రావత్ అన్నారు. ఆయనకే కొవిడ్ సోకింది. మేళాలో కొవిడ్ పెద్దగా వ్యాపించదని రాష్ట్ర డిజిపి వంతపాడారు. వీళ్ళు కుంభ కోవిడ్‌ను నయం చేస్తుంది అన్నందుకు సంతోషించాలి. 2020 మార్చిలో ఢిల్లీ మర్కజ్ సభకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. విదేశీయులకు వీసాలిచ్చింది. ఈ సభలతో ముస్లింలు కొవిడ్‌ను వ్యాప్తి చేశారని సంఘీయులు, అధికార పక్షం గొడవ చేశారు. ఇప్పుడు 3 కోట్ల మంది కుంభ స్నానాలకు అనుమతించారు.

ముస్లింలే రోగం అంటిస్తారా? హిందువులు విశ్వమారిని వ్యాపించరా? మేళాను సంకేతాత్మకంగా, లాంఛనప్రాయంగా జరపమని ప్రధాని 17వ తేదీ విన్నవించారు. అతిపెద్ద జునా అఖాడా ఈ విన్నపాన్ని మన్నించింది. ఇది సంతోషకరం. మోడీ సర్కారు కరోనా రెండవ అల గురించి ఆలోచించలేదు. దేశబందీ కాలాన్ని వృథా చేసింది. రెండవ అల రాకుండా, వస్తే ఎదుర్కొనే ప్రణాళికలు, చైతన్య కార్యక్రమాలు, ఆసుపత్రుల సౌకర్యాలు, పరికరాల సేకరణ, ప్రత్యేక వైద్య సిబ్బంది ఏర్పాటు, శిక్షణ వగైరా చర్యలు చేపట్టలేదు. ప్రజల కరోనా అశ్రద్ధ నిజమే. కాని పాలకులే అశ్రద్ధ, అక్రమాలకు పాల్పడ్డారు. పాత అనుభవాల నుండి నేర్చుకోలేదు. పాలకుల అనుకూల ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ప్రణాళికలు విడుదల చేసింది. ప్రకటనకు ముందు ఆరోగ్యశాఖను, కొవిడ్ టాస్క్ ఫోర్స్‌ను సంప్రదించ లేదు. ఎన్నికల ప్రచారాల్లో, సభలు, రోడ్ షోలు, ఊరేగింపుల్లో కొవిడ్ వ్యాప్తి పరిణామాలను రాజకీయ పక్షాలతో చర్చించలేదు. అంతా మోడీ, షాల ఆదేశాల మేరకు జరిగిందని విజ్ఞుల విశ్లేషణ.

సర్కారు పెద్దలు ఎన్నికల్లో తీరిక లేకుండా ఉన్నారు. మోడీకి ఎన్నికల గెలుపే ముఖ్యం. ప్రజల ప్రాణాలు లెక్కలేదు. అహ్మదాబాద్, భోపాల్, వారాణాసిలతో సహా ఎక్కడా కొవిడ్ రోగులకు మందులు, ఆస్పత్రులు, మృతులకు స్మశానాలు ఖాళీ లేవు. ప్రముఖులకూ పడకలు దొరక్క మరణిస్తున్నారు.162 ఆక్సిజన్ ప్లాంట్ల అనుమతి కోరగా 33 కు ఇచ్చారు. విదేశాల నుండి ఆక్సిజన్ దిగుమతి చేసుకోవల్సిన దుస్థితికి చేరాము. కరోనా ఉధృతి దృష్ట్యా తక్కిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల దశలను ఒకటి, రెండు రోజుల్లో నిర్వహిద్దామన్న ముఖ్యమంత్రి మమత విన్నపాన్ని బిజెపితో సహా ప్రతిపక్షాలన్నీ తిరస్కరించాయి. ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. పరిస్థితి విషమిస్తున్నా, తృణమూల్, ఇతర ప్రతి పక్షాలు ప్రచారాలను కుదించుకున్నా ప్రధాని, కేంద్ర గృహమంత్రి, మంత్రులు ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో తలమునకలుగా ఉన్నారు.

కరోనా నిర్వహణ పెత్తనం ప్రధాని కార్యాలయానిదే. అఖిలపక్ష, శాస్త్రజ్ఞుల, వైద్య బృందాలతో సమావేశం జరపాలన్న ఊసే లేదు. కరోనా నియంత్రణలో అశ్రద్ధ చేశాయని మహారాష్ట్ర వంటి కొవిడ్ పెరిగిన రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం నిందించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి బిజెపి పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి దారుణం. అక్కడ లెక్కలు సగానికి పైగా తగ్గించి చూపారు. ఉద్దేశపూర్వక, పశ్చాత్తాపరహిత, పక్షపాత, అప్రజాస్వామిక పాలనలో ప్రజల ప్రాణాలు, ప్రజా సంపదలను పాలకులు లెక్కచేయరు.

మోడీ సర్కార్ 6.45 కోట్ల డోసుల టీకాను దౌత్యనీతితో విదేశాలకు ఎగుమతి చేసింది. కొవిడ్ ప్రకోపంతో భారత సీరం సంస్థ ఎస్‌ఐఐ 9 కోట్ల డోసుల టీకా ఎగుమతిని ఆపేసింది. ప్రభుత్వ అశ్రద్ధతో టీకా పంపిణీలో ధనిక పేద వివక్ష చోటు చేసుకుంది. తమ టీకాలకు వైరస్ తో సరిగా పోరాడే శక్తి లేదని చైనా అంగీకరించింది. ఇది భారత టీకా ఉత్పత్తిపై వత్తిడి పెంచింది. అమెరికా ఫిబ్రవరిలో ఔషధ కంపెనీలకు రక్షణ ఉత్పత్తుల చట్టం వర్తింపజేసింది. దీంతో అమెరికా ఔషధ కంపెనీలకు కరోనా టీకా తయారీ సౌకర్యాలు లభించాయి. 37 రకాల మన టీకా ముడి పదార్థాల దిగుమతులు ఆగాయి. ఆస్ట్రాజెనిక అభివృద్ధి చేసిన కరోనా టీకా కోవిషీల్డ్‌ను తయారు చేస్తున్న ఎస్‌ఐఐ విజ్ఞప్తిని అమెరికా అధ్యక్షుడు ఖాతరుచేయలేదు. మన ప్రధాని అమెరికాతో ఏమీ మాట్లాడలేదు. దీంతో 16 కోట్ల డోసుల ఎస్‌ఐఐ మాసిక టీకా ఉత్పత్తి ఆగింది.

టీకా తయారీకి ఎస్‌ఐఐ రూ.3 వేల కోట్లు అడిగింది. 20వ తేదీ ఎస్‌ఐఐ రూ. 3 వేల కోట్లు, భారత్ బయోటెక్ కు రూ.1.5 వేల కోట్లు అప్పు ఇప్పిస్తామన్నారు. ఆర్నెళ్లకు రాబోయే టీకా వైరస్ నిరోధానికా? చికిత్సకా? అగ్గువగా దొరికే అవకాశం వదులుకొని ప్రాణం మీదికి వచ్చిన తర్వాత అధిక ధరకు రష్యా టీకా స్పుత్నిక్ దిగుమతికి అంగీకరించింది మన సర్కార్. 2021-22 బడ్జెట్‌లో ఆరోగ్య పద్దుకు గతేడాది కంటే 9.6% తగ్గించారు. కరోనా నియంత్రణకు ఉద్దేశించిన పిఎం కేర్స్ నిధికి రూ.10 వేల కోట్లు వసూలైందని పాత లెక్కలు. తర్వాతి జమా ఖర్చులు లేవు. సమాచార హక్కు చట్ట ప్రశ్నలకు సమాధానం నిరాకరించారు. మింగమెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు 138 కోట్ల జనాభా ఉన్నా విదేశాలకు టీకా ఎగుమతి చేశాం.

టీకా వేయించుకున్న వారికి కొవిడ్ ఎందుకు వస్తోందో, టీకా సృష్టించిన ప్రతి రోధక క్రిములు (యాంటిబాడీస్) ఎంతకాలం పని చేస్తాయో, ఏ వైవిధ్య వైరస్ ఇప్పుడు సోకుతోందో, ఏది సోకబోతోందో, ఆఫ్రికా వైవిధ్య వైరస్ బి.1.351 ఫైజర్ టీకాపై నిరోధక శక్తిని పెంచుకున్నట్లు మన టీకాలు నిరోధక శక్తిని పొందాయా వంటి విషయాలు మనకు తెలియవు. మనం నాల్గవ వైరస్ అలలో ఉన్నామని విజ్ఞుల అంచనా. కోవిడ్ 4 దశల్లో వ్యాపిస్తుంది. మొదటి దశలో కోవిడ్ సోకిన వ్యక్తులు ఇతరులకు అంటించలేరు. రెండవ దశలో ఇతరులకు అంటిస్తారు. మూడవ దశలో వైద్యనిపుణులు కూడా సంక్రమణ మూలాలు గుర్తించలేరు. నాల్గవ దశలో రోగం అనియంత్రిత స్థితికి చేరి దేశమంతా వ్యాపిస్తుంది. ఢిల్లీ, ముంబై, పుణె, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, కేరళలలోని పట్టణాల్లో కోవిడ్ 3, 4 దశల్లో ఉంది.

మన దేశంలో ఏకకాలంలో కొవిడ్ వైరస్ బహుళ వైవిధ్య రూపాలు కొనసాగుతున్నాయి. ఈ పునః రూపాంతరాలు ఎంతకాలం ఉంటాయో ఎప్పుడు తగ్గుతాయో చెప్పడం కష్టం. నేటి మన కోవిడ్ రోగులకు 30 వేల ఆస్పత్రి పడకలు అవసరం. దేశంలో ఇప్పటికీ 10 కోట్ల మందికి ఒక డోసు టీకా వేశారు. 2 ఔషధ సంస్థలు కలిసి నెలకు 7 కోట్ల డోసుల టీకాలు తయారు చేస్తున్నాయి. ఈ లెక్కన మనిషికి 2 డోసుల చొప్పున మిగిలిన జనాభాకు టీకాలు వేయడానికి కనీసం మూడేళ్లు పడుతుంది. కరోనా ఉప్పెన సమస్యలను దారిమళ్లిస్తోంది. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న అసాధారణ రైతు ఉద్యమం లాంటి పోరాటాలు అణచివేయబడతాయి. మోడీ సర్కారు ఎన్నికల రాజకీయాలు, హిందూమత సమీకరణ పథకాలు ఆపాలి. కార్పొరేట్ల లాభాలకు గాక ప్రజా శ్రేయస్సుకు, సమస్యల పరిష్కారానికి పని చేయాలి. ప్రజల ప్రాణాలు కాపాడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News