Sunday, April 28, 2024

ఉధృతి-ఉదాసీనత!

- Advertisement -
- Advertisement -

Medical health system crisis in India

 

అతి వేగంగా వ్యాపిస్తూ తక్కువ కాలంలోనే ఎక్కువ మందికి సోకుతూ ఊహించనంత స్థాయిలో భయోత్పాతం కలిగిస్తున్న కరోనా రెండవ దశ ముందు దేశంలోని వైద్య ఆరోగ్య వ్యవస్థ కళ్లు తేలవేస్తున్నది, చేతులెత్తేస్తున్నది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్థాన్‌లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దేశమంతటా తేలుతున్న కొత్త కరోనా కేసుల్లో 78.58 శాతం పది రాష్ట్రాల్లోనే బయటపడుతున్నాయి. ఢిల్లీలో గత కొన్నాళ్లుగా రోజుకి 25,000 కేసులు రికార్డవుతున్నాయి. దేశం మొత్తం మీద ఒకే రోజున నమోదవుతున్న కేసుల సంఖ్య జోరు పెంచి 3 లక్షలకు చేరుకుంటున్న జాడలు కనిపిస్తున్నాయి. ప్రతి రోజు 1300 మంది మరణిస్తున్నట్టు సమాచారం. సెకండ్ వేవ్ యువతను కూడా వదిలిపెట్టడం లేదు. అందుచేత మే నెల 1 నుంచి 18 ఏళ్లు, ఆ పై వయసు వారికి టీకాలు వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఇది అభినందించదగినది, ఎంతో మంచి నిర్ణయం. కాని దేశంలో సాగుతున్న టీకా పంపిణీ కార్యక్రమం తీరు చూస్తుంటే కొవిడ్ వ్యాపిస్తున్నంత వేగంగా మెజారిటీ ప్రజానీకానికైనా వ్యాక్సినేషన్ పూర్తి చేయగల స్తోమత మనకున్నదా, కేంద్ర ప్రభుత్వం అందుకు తగిన పట్టుదల, చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

జనవరి 16న ప్రారంభమైన మన టీకా పంపిణీ కార్యక్రమం మొదట్లో ఎన్నో ఆశలు కల్పించింది. ఇంత వరకు 127 మిలియన్ల (12 కోట్ల 70 లక్షలు) మంది టీకా వేయించుకున్నారు. వీరిలో 10 కోట్ల మందికి పైగా మొదటి డోసు తీసుకున్నారు. 17 మిలియన్ల (కోటి 70 లక్షలు) మందికి రెండు డోసులూ పడ్డాయి. 10 కోట్ల మందికి మించి టీకా వేసి ప్రపంచ దేశాలన్నింటిలోనూ అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ జరుపుతున్న దేశం ఇండియా అని ఈ మాసారంభంలో గర్వంగా చెప్పుకున్నాం.

10 కోట్ల మందికి టీకా వేయడానికి అమెరికాకు 89 రోజులు, చైనాకు 102 దినాలు పట్టగా, భారత దేశం ఈ లక్షాన్ని 85 రోజుల్లోనే పూర్తి చేసిందని ఘనంగా చాటుకున్నాం. వచ్చే ఆగస్టు నాటికి దేశ వయో జనాభాలో మూడొంతుల మందికి అంటే 30 కోట్ల మందికి టీకా వేయాలని లక్షంగా పెట్టుకున్నాం. ఆచరణలో ఇంత వరకు 8 శాతం మందికే మొదటి డోసు, కేవలం 1 శాతం మందికి రెండు డోసులు పడ్డాయని సమాచారం. వ్యాక్సిన్ మందు నిండుకున్నదని, భారీ కొరత ఏర్పడిందని పలు రాష్ట్రాలు మొరపెట్టుకుంటున్నాయి. వారికి అదనపు నిల్వలు సకాలంలో అందేలా చేయడంలో కేంద్రం నిస్సహాయత కూడా స్పష్టపడుతున్నది. ప్రస్తుతం విదేశీ కొవిషీల్డ్, దేశీయ కొవాగ్జిన్ టీకాలు ఇస్తున్నారు.

టీకాను భారీ ఎత్తున ఉత్పత్తి చేయించడం దేశంలోని కోట్లాది మంది నిరుపేదలతో పాటు అందరికీ సమగ్రంగా అందుబాటులోకి తీసుకెళ్లడం అనే లక్షం పట్ల కేంద్రం తగినంతగా దృష్టి పెట్టడం లేదని బోధపడుతున్నది. పంపిణీలో ఉన్న టీకాలు రెండింటి అధికోత్పత్తికి కొంత కాలం పాటు నిధుల కొరత అడ్డురావడంతో ఆ రెండు కంపెనీలు అవసరమైన స్థాయిలో వాటిని అందించలేకపోయాయి. మధ్యలో బయటి దేశాలకు వితరణ ప్రదర్శించుకోడానికి జరిగిన ఎగుమతులు ఇక్కడ కొరతను పెంచాయి. టీకా ఉత్పత్తి కంపెనీలు రెండింటికీ ఇప్పుడిప్పుడే రుణ సహాయం అందుతున్నట్టు వార్తలు చెబుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కావలసిన కిమ్మత్తులో వ్యాక్సిన్ నిల్వలను అందుబాటులోకి తీసుకురావడానికి, నిర్బంధ ఉత్పత్తి లైసెన్సులను పలు కంపెనీలకు మంజూరు చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన సలహాను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 18 ఏళ్లు పైబడిన వారికి మే 1 నుంచి టీకాలు వేయడానికి అనుమతిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఆ కార్యక్రమానికి అది అందించే సహాయ సహకారాల ప్రస్తావన లేకపోడం ఆశ్చర్యం కలిగించింది.

వ్యాక్సిన్ కంపెనీలు తమ ఉత్పత్తిలో సగ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు రంగానికి విక్రయించాలని ఆదేశించి కేంద్రం చేతులు దులుపుకున్నది. 136 కోట్ల దేశ జనాభాలో 18 ఏళ్ల పైబడి ఉండే దాదాపు 100 కోట్ల మందికి టీకాలు వేసే కార్యక్రమంలో తన పాత్ర ఇంచుమించు శూన్యమేనని కేంద్రం చెప్పినట్లయింది. రాష్ట్రాలకు తగిన ఆర్థిక స్తోమత లేదు. అవి ఎక్కడి నుంచి అంతంత డబ్బు తెచ్చి టీకా మందు కొనగలుగుతాయి? దేశంలోని మెజారిటీ జనాభాగా ఉన్న మారుమూల గ్రామాల, మురికివాడల నిరుపేద ప్రజానీకానికి టీకా కొనుక్కునే స్తోమత ఉండదు. ప్రైవేటు రంగం టీకా పంపిణీని ఎంతగా సొమ్ము చేసుకుంటుందో ఊహించడం అసాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం మరింత బాధ్యతాయుతమైన పాత్ర పోషించి ఆర్థిక వనరుల తోడ్పాటు ఇవ్వడంతోపాటు పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ చేపడితే గాని ప్రజలందరికీ టీకాలు లభించి సెకండ్ వేవ్ మహోత్పాతం నుంచి ఊరట కలుగదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News