Monday, August 4, 2025

అణు బెదిరింపుల పట్ల మరింత అప్రమత్తత అవసరం: రష్యా

- Advertisement -
- Advertisement -

మాస్కో : రష్యాకు చేరువలోని సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను మోహరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ నౌకాదళాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే రష్యా స్పందిస్తూ తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని పేర్కొంది. తాజాగా ఈ విషయంపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మాట్లాడుతూ అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించడంపై తాము మరింత శ్రద్ధ వహిస్తామన్నారు. అణు బెదిరింపుల విషయంలో ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రపంచ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ త్వరలో మాస్కోలో పర్యటించనున్న నేపథ్యంలో దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విట్కాఫ్ పర్యటనపై మాట్లాడుతూ ఆయనను మాస్కోకు ఆహ్వానించడానికి తాను ఎదురు చూస్తున్నామన్నారు. అటువంటి వారితో సంబంధాలు మెరురుపరుచుకోవడం చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తున్నట్టు తెలిపారు. వీలైతే ఆయన పుతిన్‌తోనూ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపారు.

ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ అంశంలో కాల్పుల విరమణకు 10 రోజుల్లో ముందుకు రావాలని రష్యాకు హెచ్చరికలు చేశారు. దీంతో ఆగ్రహించిన మాస్కో మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ రష్యా వద్ద సోవియట్ యూనియన్ హయాం నాటి అణుదాడి సామర్ధం ఉందన్నారు. దీంతో ఆ దేశానికి చేరువ లోని సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను మోహరించాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశించారు. “ఒకవేళ మెద్వదేవ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వెనుక ఏదైనా ఉద్దేశాలు ఉంటే వాటికి సన్నద్ధమయ్యేందుకు ఇలా చేశా. మాటలు ముఖ్యం. వాటివల్ల కొన్నిసార్లు అవాంఛిత పరిణామాలు తలెత్తవచ్చు. ప్రస్తుత అంశంలో ఇలాంటివి జరగవచ్చని ఆశిస్తున్నా” అని తెలిపారు. మరోవైపు భారత్, రష్యా సంబంధాలపైనా ట్రంప్ పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News