Tuesday, April 30, 2024

సర్వే వేదా విదాః శూరాః సర

- Advertisement -
- Advertisement -

sarvepalli radhakrishnan quotes in telugu

గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు. భగవంతుని కృప, ఆశీర్వాదం ఉన్న వ్యక్తి మాత్రమే విద్యాకృషీవలుడైన ఉపాధ్యాయుడవుతాడు. గురువును ఒక అత్యున్నత స్థానంలో నిలబెట్టిన దేశం మనది. స్వతంత్ర భారతదేశంలో తొలిఉపరాష్ట్రపతిగా రెండుసార్లు, 1962 మే 3న అత్యున్నత రాష్ట్రపతి పదవిని చేపట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని ప్రతి సంవత్సరం గురుపూజోత్సవంగా జరుపుకోవడం అందరికీ తెలుసు. 1888 సెప్టెంబర్ 5న మద్రాస్ సమీపంలో తిరుత్తిణి అనే గ్రామంలో వీరస్వామి, సీతమ్మ దంపతుల కడుపు పంట వీరు. ఉన్నత విద్యావిధానాన్ని రూపకల్పన చేసిన, పలు విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ బిరుదులను పొందిన, భారతీయ తత్వశాస్త్రం రచించిన గొప్ప తత్వవేత్త, మహామనీషి అయిన వీరు 1939లో కాశీ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఆ వృత్తికే ఒక ఉన్నత స్థానాన్ని, గౌరవాన్ని ఆపాదించిన వీరు ఒక ఉపాధ్యాయుడు కావడం ఆ వృత్తిలోని వారందరికీ మహాభాగ్యం.

తలపాగా లేని వాడు విద్వాంసుడు కాడు. ప్రసంగం చేయడానికి వెళ్లినా తలపాగా లేనిదే వెళ్ళకూడదనేది శాస్త్రం. ధర్మం, శాస్త్రం తెలిసిన వీరు జీవితాంతం చివరకు విదేశాలకు వెళ్లినా తలపాగా లేనిదే వెళ్లలేదు. అందుకే వీరు పండిట్ రాధాకృష్ణగా పిలువబడినారు. పండిట్ అంటే నూరు పద్యాలు చదివిన వారు కారు. జ్ఞానం ఉన్న వాడు అని అర్థం. ఆచరించేవాడు ఆచార్యుడు. అందుకే ఆ రెండు సంభోధనలకు వీరు అర్హులు. భారతీయ విద్యా వ్యవస్థను గురించి వీరు మాట్లాడుతూ ఒక తల్లి తనబిడ్డల్లో బలహీనంగా ఉన్న బిడ్డపట్ల ఎలా శ్రద్దగా ఉంటుందో గురువు అలా చదువులో వెనకబడినవాడి పట్ల ఆ విధంగా ఉండాలన్నారు. తక్కువ మార్కులు వచ్చే విద్యార్థిని అక్కున చేర్చుకొని నీకు నేనున్నాననే ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలన్నారు.

వీరు రాష్ట్రపతి పదవిని చేపట్టాక కొంతమంది స్నేహితులు, పూర్వవిద్యార్థులు ఆయన పుట్టినరోజు వేడుకలు జరపడానికి అనుమతి కోరారు. తన పుట్టినరోజు వేడుకను జరిపే కన్నా దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం మంచిదని తెలిపినందున అప్పటినుండి అధికారికంగా జరుపబడుతున్నది. సర్వే వేదా విదాః శూరాః/ సర్వే లోకహితే రతాః/సర్వే జ్ఞానోప సంపన్నాః/ సర్వే సముదిత గుణైః. వాల్మీకి రామాయణంలో విద్యా వ్యవస్థ గురించి చెబుతూ రామ లక్ష్మణ భరత శతృఘ్న లకు వశిష్ఠుడు విద్యనెలా బోధించాడో ఈ ఒక్క శ్లోకంలో చెప్పబడింది. తల్లిదండ్రుల తర్వాత గురువు మన జీవితంలో చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తాడు. అందువల్ల ఇది ఒక అసాధారణమైన వృత్తి. ఈరోజు మనము గురువులను పూజిస్తున్నాం. అధ్యాపకులు, ఉపాధ్యాయులు చాలా మందే ఉంటారు. కానీ గురువన్న వారి సంఖ్య చాలా తక్కువ.
‘గు’ అంటే గుహ్యమైనది. తెలియనిది. ‘రు’ అంటే దానిని రుచ్యము చేసేది. తెలియపరచేది. మనలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించేవాడే గురువు అనే పదానికి అర్థం. అందుకే ప్రతి ఉపాధ్యాయుడు గురువు స్థానానికి వెళ్లాలనుకున్నప్పుడు కొన్ని ఆచరించాలి. అధ్యాపకుడంటే పాఠ్య పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని విద్యార్థులకు అందిస్తాడు.ఉపాధ్యాయుడు దానితోపాటు కొంత జ్ఞానాన్ని జోడిస్తాడు. అజ్ఞానాంధకారంలోవున్న శిష్యున్ని జ్ఞానమనే వెలుగులోకి తీసుకువచ్చి వారిలోఉన్న జ్ఞానాన్ని వెలికి తీయగలిగినవాడే నిజమైన గురువు. అట్టి గురువే బ్రహ్మ. అనగా ఒక నూతన తరాన్ని సృష్టించే సృష్టి కర్త. గురువు అంటే సమాజం ఉన్నతి కోసం సదా ఆలోచిస్తూ తన శిష్యులను కూడా సమాజం కోసం ఆలోచించే విధంగా, సమాజాన్ని, దేశాన్ని గొప్పగా నిర్మించడానికి దోహదపడేలా ఎలా తయారు చేయాలో రాధాకృష్ణన్ లాంటి గొప్ప ఉపాధ్యాయుడి సందేశాన్ని మననం చేసుకోవాలి.

ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ ఈశ్వరానుగ్రహం ఉంటుంది. వినయమే లేకుంటే ఎంత చదువు చదివినా అప్రయోజనం. అలాంటి అపకీర్తికి ఉపాధ్యాయుడే బాధ్యుడు. విద్యా నైపుణ్యాలతో పాటుగా సామాజిక బాధ్యతను, సమాజం పట్ల స్పృహ, చైతన్యాన్ని, మంచి నడవడిక, సంస్కారం, కుటుంబ విలువలు, నైతిక విలువలను వీటన్నింటిని పాఠ్యాంశాలతో పాటుగా బోధించాలి. ఇవన్నీ లేని వాడు ఎంత ఎక్కువగా చదువుకుంటే అంత ప్రమాదం. జేబు దొంగలతో ప్రమాదం లేదు. ఎక్కడో దొరికిపోతారు. కానీ కంప్యూటర్ వ్యూహం అంతా తెలుసుకొని ఒక్క ఎస్‌ఎంఎస్‌తో ప్రపంచాన్నిఅంతా అతలాకుతలం చేసే వాడు చాలా ప్రమాదకారి. ప్రతి విద్యలో రెండు కోణాలు ఉంటాయి. ఒక సివిల్ ఇంజినీర్ బ్రిడ్జి నిర్మిస్తున్నాడంటే సమాజానికి ఎంతో సౌకర్యం కలిగిస్తున్నాడ న్నమాట. అక్రమంగా నిర్మిస్తే ఎన్నో ప్రాణాలను బలి తీసుకున్న వాడవుతాడు.

అందుకే సిలబస్‌లో మారల్ సైన్స్ ఉన్నా లేకున్నా ఉపాధ్యాయుడు ఇలాంటి ఉదాహరణలు చెప్తూ కుటుంబంలోఒక వ్యక్తి మన వల్ల మరణిస్తే ఆ కుటుంబానికి ఎంత ద్రోహం చేసిన వాళ్లమవుతామో వాళ్ళ మనసులో నాటుకుపోయే విధంగా చెప్పాలి. ఇలాంటి నైతిక విలువలతో కూడిన విద్య ఒక సమాజాన్ని, తద్వారా దేశాన్ని ఉద్ధరించగలుగుతుంది. అప్పుడే ఉపాధ్యాయుడు గురువు స్థానానికి చేరుకోగలుగుతాడు. చిన్ననాడు చదువు చెప్పే ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నా జీవితాంతం శిష్యుడు ఎవరినైతే స్ఫూర్తిదాయకంగా గుర్తుంచుకుంటాడో అతడే నిజమైన గురువు. గురువును ఆశ్రయించినప్పుడు, కనిపించినప్పుడు వారికి వినయంగా నమస్కరించి వారి వల్ల కలిగే ప్రయోజనాన్ని పొందడమే గురువుకి ఇచ్చే సత్కారం. దేశానికి, రాష్ట్రపతి పదవికి అత్యున్నత గౌరవాన్ని తీసుకొచ్చిన అలాంటి వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు కావడం, తన పుట్టినరోజు సత్కారాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరికీ ఉత్సవంగా ప్రకటించిన వీరు ఉపాధ్యాయ లోకానికి, తల్లిదండ్రులకు, సమాజానికి గర్వకారణం.

వేముగంటి శుక్తిమతి- 9908110937

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News