Thursday, May 2, 2024

సమాజ నిర్మాత ఉపాధ్యాయుడే

- Advertisement -
- Advertisement -

Happy teachers day 2020 September 5th

పలక మీద తొలి అక్షరం దిద్దించటంతో మెుదలు అత్యుత్తమ స్థాయికి ఎదిగే దాకా మన వెంట నడిచి, తడబడినపుడు చేయూత నిచ్చి, నిరాశ చెందినపుడు ఆశల విత్తులు నాటి, ఎదుగుదలకు తనో నిచ్చనై, గుర్తింపు పొందినపుడు పరమానందసాగరంలో మునక వేసే ‘నడిచే ఆదర్శాల నిధి’ ఉపాధ్యాయుడు. గురువు లేని మనిషి ఉండడు. తరగతి గదిలో బోధించే వారే గురువులు కాదు. నిరక్షరాస్యుడు కూడా తను నమ్మిన వారిని గురువుగా స్వీకరిస్తాడు. పాఠ్యాంశాలతో శాస్త్రాలను బోధిస్తూ, వెన్ను తట్టి నడకను, నడతను నేర్పగల నిస్వార్థ జీవి గురువే. జీతం కాదు జీవితం ముఖ్యమని జ్ఞానోదయం కలిగించే నేర్పరి. ఢిల్లీకి రాజైనా గురువు ముందు మాత్రం మోకరిల్లేది శిష్యుడే. గురువును నమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరు. గురుశిష్య సంబంధం భగవంతుడికి భక్తుడికి ఉన్న అనుబంధం లాంటిది. దేశవ్యాప్తంగా గురువులను పూజించడానికి, కృతజ్ఞతలు సమర్పించడానికి, దీవెనలు తీసుకోవడానికి ఉద్దేశించబడిన రోజుగా 1962 నుండి ప్రతి యేటా మన మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు 05 సెప్టెంబర్ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ 05 సెప్టెంబర్ 1888 రోజున చిత్తూరు జిల్లా (నేటి తమిళనాడు) తిరుత్తనిలో తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో సర్వేపల్లి వీరస్వామి సీతమ్మలకు జన్మించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామానికి చెందిన రాధాకృష్ణన్ చిన్నతనం తిరుత్తని , తిరుపతిల్లో గడిచింది. పాఠశాల విద్యను తిరుత్తని, తిరుపతి, వాలాజిపేట్‌లలో పూర్తి చేశారు. తన 16వ ఏటనే శివకమునిని వివాహమాడి ఐదుగురు కూతుర్లు, ఒక కుమారుడికి (సర్వేపల్లి గోపాలన్) జన్మనిచ్చారు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో డిగ్రీ, పిజీ (ఎఎం తత్వశాస్త్రం) పూర్తి చేశారు. పిజిలో సమర్పించిన డిసర్టేషన్‌ను చదివిన గురువులు విలియమ్ మెస్టోన్, ఆల్ఫ్రెడ్ జార్జ్ హాగ్‌లు రాధాకృష్ణన్‌లోని ప్రతిభను చూసి అబ్బురపడ్డారు. మద్రాస్ ప్రసిడెన్సీ కళాశాల, మద్రాస్, కలకత్తా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు ఎనలేని ఖ్యాతిని అర్జించారు. హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలు లాంటి అనేక అంతర్జాతీయ వేదికల్లో భారతీయ తత్వాన్ని వినిపించి మన్ననలుపొందారు. ఆంధ్ర (1931-36), బెనారస్ (1939-48) విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా సేవలందించారు.

ఇండియన్ ఫిలాసఫీ, హిందూతత్వానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రపంచానికి పరిచయం చేసి, దేశ పరువు ప్రతిష్ఠలను మరింత ఇనుమడింపజేశారు. ఆలస్యంగా రాజకీయరంగ ప్రవేశం చేసిన రాధాకృష్ణన్ యునెస్కో భారత ప్రతినిధిగా(1946-52) , రష్యా అంబాసిడర్‌గా (1949- 52) పని చేశారు. భారత రాజ్యాంగ సభకు ఎన్నికైన డా. రాధాకృష్ణన్ భరతజాతి గర్వించదగిన ప్రఖ్యాత మాజీ ఉపరాష్ట్రపతి (1952- 62), మాజీ రాష్ట్రపతి (1962-67)గా దేశానికి ఎనలేని సేవలను అందించారు. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని రాధాకృష్ణన్ స్వాతంత్య్ర పోరాటంలో కూడా చురుకుగ పాల్గొనకపోయినా భారతీయ సంస్కృతీ వారసత్వ సంపదను విశ్వవ్యాప్తం చేయటంలో కృతకృత్యులైనారు. రాష్ట్రపతి పదవిలో ఉన్నపుడు రాధాకృష్ణన్ శిష్య బృందం సన్మానించే ప్రయత్నం చేయగా, తన పుట్టిన రోజు 05 సెప్టెంబర్ ఉపాధ్యాయ దినంగా పాటించమని సూచించారు. దీనికి స్పందనగా భారత ప్రభుత్వం 05 సెప్టెంబర్‌ను జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా 1962 నుండి పాటించడం జరుగుతోంది. బ్రిటన్‌చే ‘నైట్ బ్యాచిలర్’గా నియమించబడిన రాధాకృష్ణన్‌కు గౌరవ బిరుదు ‘సర్’ ప్రదానం చేయబడింది. 1933 – 37ల మధ్య ఐదుసార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి వారి పేరును ప్రతిపాదించారు.

1954లో దేశ అత్యుత్తమ పౌర పురస్కారం ‘భారతరత్న’తో పాటు బ్రిటీష్ ఆర్డర్ ఆఫ్ మెరిట్, ఆక్సఫర్డ్ టెంప్లెటాన్ బహుమతి, జర్మన్ శాంతి బహుమతి లాంటి అనేక అంతర్జాతీయ గౌరవాలు స్వంతం చేసుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ పలు భారతీయ తత్వశాస్త్ర గ్రంథాలను (ఇండియన్ ఫిలాసఫీ-1 & 2, ఫిలాసఫీ ఆఫ్ రవింద్రనాథ్ టాగోర్, భగవద్గీత తత్వబోధన, రిలిజియన్ అండ్ సొసైటీ, ది ప్రిన్సిపల్ ఉపనిషద్, ది దర్మపాద, రికవరీ ఆఫ్ ఫేయిత్, ది బ్రహ్మసూత్ర, రిలిజియన్ – సైన్స్ & కల్చర్ లాంటివి) రచించారు. మనందరికీ ప్రేరణగా నిలిచిన రాధాకృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా మేధావులు పలు గ్రంథాలను కూడా రచించారు. ప్రపంచ స్థాయి అత్యుత్తమ ఉపాధ్యాయులు డా. రాధాకృష్ణన్ నుండి అనేక అంశాలను నేర్చుకున్నానని జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా ఒప్పుకున్నారు.

ఉత్తమ ఉపాద్యాయులు, స్కాలర్, సాహితీవేత్త, రచయిత, తత్వవేత్త, విద్యావేత్త, స్టేట్స్ మెన్, మేధావి, రాజనీతిజ్ఞుడైన రాధాకృష్ణన్ జీవితమే మనందరికీ ఒక అమూల్య సందేశంగా నిలుస్తుంది. విద్యను బోధించటంతో వాటి విద్యా దాహాన్ని పెంచగలిగే వారే అసలైన గురువులుగా గౌరవింపబడతారు. తరగతి గదికి మాత్రమే పరిమితమై పాఠ్యాంశాలు బోధించేవారు సాధారణ గురువులు, పాఠ్యాంశాలను చక్కగా వివరించగల వారు మంచి గురువులు, జీవిత పాఠాలతో పాటు విద్య పట్ల ప్రేరణ కలిగించగల వారు మాత్రమే అత్తమ ఉపాధ్యాయులుగా జీవితాంతం గుర్తుండిపో తారు. గురువులకే గురువు, భరత జాతి మెచ్చిన సర్వోన్నత విజ్ఞాన నిధి సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని ప్రేరణగా తీసుకొని, వారు చూపించిన బాటలో ముందడుగు వేయడమే వారికి మనం సమర్పించే ఘన నివాళి.

* బుర్ర మధుసూదన్ రెడ్డి- 99497 00037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News