Sunday, September 15, 2024

విద్యార్థినులకు అశ్లీల వీడీయోలు చూపించిన స్కూలు టీచర్

- Advertisement -
- Advertisement -

అకోల(మహారాష్ట్ర): పాఠశాల విద్యార్థినులకు అశ్లీల వీడియోలను చూపించి వారితో అసభ్యంగా ప్రవర్తించిన ఒక 47 ఏళ్ల ప్రభుత్వ పాఠశాల టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా..విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఆ టీచర్‌ను ఉద్యోగం నుంచి ప్రభుత్వం బర్తరఫ్ చేసినట్లు మహారాష్ట్రలోని అకోల జిల్లా పరిషద్ ఎగ్జిక్యూటివ్ అధికారి బి వైష్ణవి బుధవారం తెలిపారు. ముంబై సమీపంలోని బద్లాపూర్ పట్టణంలోని ఒక పాఠశాలపై కిండర్‌గార్టెన్ చిన్నారులపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు రావడం, దీనిపై మంగళవారం తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తిన పరిణామాల నేపథ్యంలో తాజా సంఘటన వెలుగుచూడడం గమనార్హం.

అకోల నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని కాజీఖేడ గ్రామంలోని జిల్లా పరిషద్ పాఠశాలలో తాజా ఘటన వెలుగు చూసింది. గడచిన నాలుగు నెలలుగా ప్రమోద్ సర్దార్ అనే టీచర్ పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థినులకు తన మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూపుతూ, వాటిని చూడాలని వారిని ఒత్తిడి చేస్తున్నట్లు విద్యార్థినుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. బాధితులలో ఒక వద్యార్థిని ధైర్యం చేసి 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి టీచర్ గురించి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.

వెంటనే స్పందించిన శిశు సంక్షేమ కమిటీ(సిడబ్లుసి) మంగళవారం తన సభ్యులను పాఠశాలకు పంపించింది. విద్యార్థులకు క్లాసు తీసుకోవాలన్న కారణం చూపి 8వ తరగతి విద్యార్థినులతో కమిటీ సభ్యులు విడిగా సమావేశమయ్యారు. గడచిన నాలుగు నెలలుగా టీచర్ ప్రమోద్ సర్దార్ నుంచి తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను విద్యార్థినులు కమిటీ సభ్యులకు వివరించారు. బాలికల నుంచి వివరాలను రాబట్టిన కమిటీ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సిడబ్లుసి సభ్యుల నుంచి ఫోన్ రావడంతో మైనర్ బాలికల వాంగ్మూలాన్ని నమోదు చేసుకోవడానికి తమ పోలీసు బృందాన్ని స్కూలుకు పంపించినట్లు ఉరల్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ ధోలే తెలిపారు. అనంతరం టీచర్ ప్రమోద్ సర్దార్‌ను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు.

కాగా..తన స్కూలులో పనిచేసే టీచర్ విద్యార్థినులను లైంగిక వేధిస్తున్న విషయం తన దృష్టికి రాలేదని స్కూలు ప్రిన్సిపాల్ రవీంద్ర సండూర్ తెలిపారు. ఈ విషయం తెలిసి ఉంటే తాను వెంటనే టీచర్‌పై చర్యలు తీసుకుని ఉండేవాడినని ఆయన చెప్పారు. సిడబ్ల్యుసి సభ్యుల రాకతోనే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని ఆయన చెప్పారు. ఇలా ఉండగా..ఈ ఘటనపై మహారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు ఆషా మిర్జే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీచర్ ప్రవర్తనను ఖండించారు. స్కూలులో ఇంత జరుగుతున్నా ఇతర సిబ్బందికి తెలియకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News