హైడ్రాక్సీక్లోరోక్విన్,అజిత్రోమైసిన్‌పై శాస్త్రజ్ఞుల హెచ్చరిక
న్యూఢిల్లీ: కరోనామహమ్మారి ప్రబలినప్పటినుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటుగా చాలామంది నోళ్లలో నానుతున్న పదం హైడ్రాక్సీ క్లోరోక్విన్. కోవిడ్19 బాధితుల చికిత్సలో ఈ మందు వాడకం గురించి అనేక వార్తలు వచ్చాయి. అయితే దీన్ని వాడడం వల్ల గుండెమీద దుష్ప్రభావం చూపుతుందని అమెరికాకు చెందిన వాండర్‌బిల్ట్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని అజిత్రోమైసిన్ యాంటీ బయోటిక్‌తో కలిపి ఇస్తే ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ) డేటాబేస్‌లో ఉన్న 21 మిలియన్ కేసుల రిపోర్టులను విశ్లేషించిన తర్వాత వారు ఈ నివేదికను తయారుచేశారు.
కోవిడ్19 చికిత్స కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ ఔషధాలను కలిపి కాని,విడిగా కానీ వాడాలన్న ప్రతిపాదన నేపథ్యంలో వారు ఈ పరిశోధన చేపట్టారు. వాటి వాడకం గుండె కొట్టుకునే క్రమపద్ధతిని దెబ్బతీస్తుందని వారు వెల్లడించారు. క్లోరోక్విన్‌తో పోలిస్తే అజిత్రోమైసిన్‌తో ఈ ప్రమాదం మరీ ఎక్కువని అన్నారు. రెండింటినీ కలిపితే ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. క్లోరోక్విన్ కొన్ని నెలల పాటు వాడితే రక్తప్రసరణను దెబ్బతీసి గుండె వైఫల్యానికి దారి తీస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఇదిలా ఉండగా కరోనా బాధితులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇస్తూ వివిధ దేశాల్లో నిర్వహిస్తున్నక్లినికల్ ట్రయల్స్‌ను తాత్కలికంగా నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థసోమవారం నిర్ణయించిన విషయం తెలిసిందే.