Tuesday, May 7, 2024

జైశంకర్ బ్లింకెన్ భేటీ

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇక్కడ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశం అయ్యారు. ఇరువురి నడుమ ద్వైపాక్షిక సంబంధాల మరింత విస్తృతి దిశలో చర్చలు జరిగాయి. గురువారం వీరి భేటీ జరిగిందని శుక్రవారం విదేశాంగ వ్యవహారాల విభాగం తెలిపింది. ఖలీస్థానీ వేర్పాటువాదుల హత్యలతో ఇండియా , కెనడా మధ్య దౌత్యవివాదం రగులుకున్న దశలోనే జైశంకర్ బ్లింకెన్ సమావేశం జరిగింది. తాను తిరిగి ఇక్కడికి రావడం సంతోషకరమని జైశంకర్ తెలిపారు. ఈ వేసవిలో ఇక్కడికి ప్రధాని మోడీ వచ్చారు. జి 20 సమ్మిట్‌కు అమెరికా అన్ని విధాలుగా సహకరించినందుకు ధన్యవాదాలు అని జైశంకర్ చెప్పారు. విదేశాంగ శాఖ కార్యాలయంలో సమావేశానికి ముందు బ్లింకెన్, జైశంకర్ సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. విదేశాంగ మంత్రి జైశంకర్ తొలుత న్యూయార్క్‌కు చేరుకున్నారు. ఐరాస 78వ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు వాషింగ్టన్‌లో బ్లింకెన్‌ను కలిశారు. కెనడాతో వివాదం తలెత్తకముందే ఈ ఇరువురు దౌత్యాధినేతల సమావేశం ఖరారు అయింది.

కెనడా విషయం ప్రస్తావనకు రాలేదా?
జైశంకర్, బ్లింకెన్ సమావేశం తరువాత అమెరికా విదేశాంగ శాఖ వీరి సమావేశం గురించి ఓ ప్రకటన వెలువరించింది. జైశంకర్‌తో బ్లింకెన్ కెనడా విషయం ప్రస్తావించిందీ లేనిదీ ఈ ప్రకటనలో ఎక్కడా తెలియచేయలేదు. ఇండియా, కెనడాలు రెండూ అమెరికా మిత్రదేశాలు అయినందున ఇరుదేశాల నడుమ వివాదాస్పద అంశం నేతల చర్చలలో ప్రస్తావనకు వస్తుందని వార్తలు వెలువడ్డాయి. కానీ దీని గురించి విదేశాంగ శాఖ ఏ విషయం చెప్పలేదు. అయితే అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లెర్ దీనిపై స్పందించారు. ఈ విషయంపై అధికారికంగా తానేమీ చెప్పడం లేదన్నారు. అయితే ఇటీవలి కాలంలో తరచూ అమెరికా దీనిని భారత ప్రభుత్వంతో చర్చిస్తూ వచ్చిందని , కెనడాకు సహకరించాలని కోరామని వివరించారు.

ఇప్పుడు కూడా ఈ సమావేశంలో ఇదే పద్ధతిలో జైశంకర్‌కు ఇదే విషయం తెలియచేసేందుకు వీలుందని ఈ ప్రతినిధి తెలిపారు. త్వరలో ఇరుదేశాల నడుమ 2 ప్లస్ 2 అంటే విదేశాంగ, రక్షణ మంత్రుల స్థాయి భేటీ జరుగుతుంది. దీనికి తేదీలు ఖరారు కాలేదు. ఇప్పటి సమావేశంలో పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. జి 20 సదస్సులో తీర్మానాల తరువాతి ఫలితాలు, పరిణామాలు చర్చకు వచ్చాయి. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్, అత్యున్నత శ్రేణి మౌలిక వసతులపై చర్చలు జరిగాయి. ఇరుదేశాల నడుమ 2 ప్లస్ 2 స్థాయి భేటీ సాధారణంగా జరిగే నవంబర్ మధ్యలో ఉంటుందని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News