Sunday, April 28, 2024

స్కూల్ పిల్లలకు గంజాయి చాక్లెట్లు..

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ ః- స్కూల్ పిల్లలకు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా 8 కిలోల బరువున్న చాక్లెట్ కార్టన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే… రంగారెడ్డి జిల్లా, కొత్తూరు ప్రభుత్వ పాఠశాల సమీపంలోని పాన్‌షాప్‌లో చాక్లెట్స్ కొన్న విద్యార్థులు తిన్నప్పటినుంచి వింతగా ప్రవర్తించారు. కొందరు విద్యార్థులు తరగతి గదిలోనే మత్తులోకి జారుకున్నారు. కొద్దిరోజులుగా విద్యార్థులు వింతగా ప్రవర్తించడాన్ని గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయగా చాక్లెట్లు తిన్న తర్వాత విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిసింది. విషయాన్ని వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందజేగా ఎస్‌ఓటి పోలీసులు పాన్‌షాప్‌పై దాడి చేసి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిపి నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బయట ప్రాంతంలో తయారుచేసిన ఈ చాక్లెట్లను సరఫరా చేస్తున్న వీరేంద్ర బెహరా, సోమనాథ్ బెహరా, సూర్యమణి సాహూ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. వారి నుంచి 8 కిలోల బరువున్న చాక్లెట్ కార్టన్‌లను, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ ప్రాంతంలోని మూడు వేర్వేరు పాన్‌షాపుల్లో, కిరాణా దుకాణాల్లో రహస్యంగా దాచి అమ్ముతున్న ఈ చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఒక్కొక్క ప్యాకెట్‌లో 25 నుంచి 30 చాక్లెట్లను పెట్టి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని అన్నారు. ఒక్కో చాక్లెట్ ను 15 రూపాయల నుంచి 30 రూపాయల వరకు అమ్మకాలు జరుపుతున్నట్లు తేలిందని అన్నారు. 42 బాక్సుల్లో ఉన్న 8 కిలోల చాక్లెట్లను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్టు చెప్పారు. చాక్లెట్లను విప్పి చూడగానే గంజాయికి సంబంధించిన వాసన వస్తోందని చెప్పారు.

ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేసిన ముగ్గురు నిందితులు కొత్తూరు పారిశ్రామికవాడలోని వివిధ కంపెనీలలో కూలీలుగా పనిచేస్తున్నట్టు గుర్తించామని అన్నారు. డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఈ చాక్లెట్ల విక్రయాలు జరపాలని ముగ్గురు నిర్ణయించుకొని ఈ వ్యాపారానికి తెరలేపినట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఒడిశా ప్రాంతంలో తయారైన ఈ చాక్లెట్లను ఇక్కడికి తెచ్చి కొత్తూరుతో పాటు ఏఏ ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నారనే విషయాన్ని పసిగట్టేందుకు ప్రత్యేక టీంలను రంగంలోకి దింపామని అన్నారు. స్కూళ్లు, కాలేజీలు ఉన్న ప్రాంతాలతో పాటు యువకులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ చాక్లెట్ల విక్రయానికి నిందితులు ఎంచుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News