Thursday, May 2, 2024

డబుల్ ఎంఎ షబ్నమ్.. ఉరి కంబం ఎక్కే తొలిమహిళ

- Advertisement -
- Advertisement -

Shabnam The First Woman To Be Hanged In Independent India

 

మథుర : స్వాతంత్య్రానంతరభారతదేశంలో ఉరిశిక్షకు గురి కానున్న తొలి మహిళగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన షబ్నమ్ ఇప్పుడు రికార్డులలోకి చేరారు. అమ్రోహి హత్యకేసులో ఇద్దరు ప్రధాన నిందితుల్లో షబ్నమ్ ఒకరు. ఆమెను ఉరితీసేందుకు స్థానిక జైలు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మహిళ సొంత కుటుంబానికి చెందిన ఏడుగురిని చంపివేసిన ఘటనలో దోషిగా తేలారు. దీనితో న్యాయస్థానం షబ్నమ్‌కు ఉరిశిక్ష విధించింది. మీరట్‌కు చెందిన తలారీ పవన్ జల్లాద్ కు ఇప్పుడు ఈ ఉరి బాధ్యతలు అప్పగించారు. 2008లో షబ్నమ్ తన ప్రియుడు సలీంతో కలిసి ఎప్రిల్ 14 /15 అర్థరాత్రి వేళ కుటుంబ సభ్యులను హతమార్చింది. అమ్రోహలో కుటుంబ సభ్యులతో ఉండేది. సలీంతో సంబంధం పెట్టుకుంది. పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీనితో సలీంతో కలిసి ఆమె అందరినీ అంతమొందించాలని నిర్ణయించుకుంది. అప్పటికే ఏడు వారాల గర్భిణి అయిన షబ్నమ్‌ను ఐదురోజుల తరువాత సామూహిక హత్యాకాండకు సంబంధించి పోలీసులు అరెస్టు చేశారు.

అదే ఏడాది ఆమె డిసెంబర్‌లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డబుల్ ఎంఎ చేసిన షబ్నమ్ ఓ ప్రైమరీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేది. ఆరవ తరగతి వరకే చదివి బతికే సలీం వీరి ఇంటి బయట చెక్కపనిచేసే వాడు. సలీంతో అనుబంధం పెంచుకున్న షబ్నమ్ ఇంటివారు పెళ్లి వద్దని చెప్పడంతో కక్ష పెంచుకుని సలీంతో కలిసి వీరిని అంతమొందించేందుకు నిర్ణయించుకున్నారు. రాత్రి కుటుంబ సభ్యులకు మత్తు మందు కలిపిన పాలు ఇచ్చింది. తరువాత అందరిని నరికి చంపిందని, ఈ క్రమంలో చివరికి బాలుడైన మేనల్లుడిని కనికరం లేకుండా గొంతు నులిమి చంపిందని పలు సాక్షాధారాలతో కనుగొని, అంతిమ తీర్పుగా ఉరిశిక్ష విధించారు.

షబ్నమ్‌కు ఈ దారుణ అమానుష చర్యకు ఫలితంగా సెషన్స్ కోర్టు విధించిన ఉరిశిక్షను అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. సుప్రీంకోర్టుకు వెళ్లగా 2015లో అక్కడ కూడా చుక్కెదురయింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెక్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. దీనితో అన్ని దారులు మూసుకుపోవడంతో ఆమె ఉరికి రంగం సిద్ధం అయింది. ఇక ఉరికి తేదీ ఖరారు కావల్సి ఉంది. దేశంలోనే ఒకే ఒక్క ఆడవారి ఉరితీతల వేదిక మథుర జైలులో దాదాపు 150 ఏండ్ల క్రితం బ్రిటిష్ వారు 1870లో నిర్మించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ ఏ ఆడఖైదీ ఈ ఉరికంబం ఎక్కలేదు. 1956 జైళ్ల నిబంధనల ప్రకారం మహిళల ఉరి శిక్ష అమలుకు సంబంధించి పలు నిబంధనలు ఉన్నాయి. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు అయిన సలీం ఇప్పుడు ఆగ్రా జైలులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News