న్యూఢిల్లీ / రాంచీ: గిరిజన భూ నేత, ప్రాంతీయ ఉద్యమ వెన్నెముక శిబూ సోరెన్ కన్నుమూశారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి,కేంద్ర మాజీ మంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) వ్యవస్థాపకులు, రాజ్యసభ ఎంపి అయిన సోరెన్ గిరిజన ఉద్యమాల సైరన్ గా పేరొందారు. అనారోగ్య కారణాలతో దేశ రాజధాని ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఈ నేత తమ 81వ ఏట సోమవారం మృతి చెందారు. నెలరోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం కొద్ది రోజులుగా విషమిస్తూ వచ్చింది. ఆయన మృతి వార్తను సోరెన్ కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సమాచార మాధ్యమాల ద్వారా ప్రకటించారు. తమ ప్రియమైన దిషోమ్ గురూజీ (భూ నాయకుడు) ఇక లేరని, ఇక తాము అంతా కోల్పోయినట్లే అని భావోద్వేగంతో స్పందించారు. ఆయన మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.
వయస్సు మీద పడటంతో చికిత్సకు శారీరక వ్యవస్థ సహకరించలేకపోవడంతో మృతి చెందారు. ఇక్కడి ఆసుపత్రిలోని నెఫ్రాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎకె భల్లా ఓ ప్రకటన వెలువరించారు. బహుళ స్థాయి వైద్య బృందం శక్తివంచన లేకుండా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన ప్రశాంతంగా ఈ రోజు చనిపోయారని వివరించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియచేశారు. ఆయన జనాదరణ పొందిన మాస్ లీడర్ అని తమ ప్రకటన ద్వారా నివాళులు అర్పించారు. సోరెన్ 1944 జనవరి 11వ తేదీన జన్మించారు. అప్పట్లో అవిభక్త బీహార్‌లో ఉన్న రామ్‌గగఢ్ జిల్లాలోని మారుమూల నెమ్రా గ్రామంలో సంతాల్ తెగ కుటుంబంలో పుట్టిన ఆయన విద్యాభ్యాసం ఎక్కువగా ఈ జిల్లాలోనే సాగింది. శిబూ రూపీ కిస్కూను పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు కుమారులు దుర్గా సోరెన్, హేమంత్ సోరెన్, బసంత్ సోరెన్, కుమార్తె అంజలి సోరెన్. కుమారులు కుమార్తె కూడా జెఎంఎం తరఫున రాజకీయాల్లో ఉంటూ వస్తున్నారు.
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం
సోరెన్ 40 సంవత్సరాల రాజకీయ సేవల అనుభవం ఉన్న వ్యక్తి. దేశంలోని పలువురు ప్రాంతీయ నేతలకు స్ఫూర్తిగా నిలిచారు. లోక్‌సభకు ఎనిమిది సార్లు ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపిగా వ్యవహరించారు. ఇప్పుడు రెండో దఫా ఎగువ సభ సభ్యుడిగా ఉన్నారు. గిరిజన సంతాల్ తెగకు చెందిన సోరె జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో జన్మించారు. అప్పట్లో ఈ ప్రాంతం బీహార్‌లో అంతర్భాగంగా ఉండేది. రాజకీయ ప్రయాణం పలు కీలక మలుపులతో సాగింది. వామపక్ష కార్మిక సంఘాల నేత ఎకె రాయ్, కుర్మి మహతో నేత బినోద్ బిహారీ మహతో కలిసి ముందుకు సాగిన ఆయన 1972లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం)ను స్థాపించారు. బీహార్ నుంచి తమ గిరిజన సంతాల్ ప్రాంతం విడిపోయేందుకు తమకంటూ ప్రత్యేక ఉనికి చాటుకునేందుకు జెఎంఎం ద్వారా గిరిజనులను పోగుచేసుకుని ఉద్యమం సాగించారు. ఈ క్రమంలో 2000 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రం అవతరించింది. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమానికి జెఎంఎం ఉద్యమం స్ఫూర్తి అయింది. శిబూ సోరెన్ పోరాట స్ఫూర్తి గురించి కెసిఆర్ పలు సందర్భాలలో ప్రస్తావించారు.
దుమ్కా నుంచే ఎంపిగా విజయ ఢంకా
శిబూ 1980లో తొలిసారిగా దుమ్కా ఎంపి స్థానంలో గెలుపొందారు. అప్పటి నుంచి ఈ జిల్లా పట్టణ కేంద్రం జెఎంఎంకు పెట్టని కోట అయింది. వరుస విజయాల దశలో ఆయనకు ఇక్కడ 2019లో అపజయం ఎదురైంది. ఆయనను అప్పుడు బిజెపికి చెందిన నళిన్ సోరెన్ అత్యధిక ఓట్ల మెజార్టీతో ఓడించారు. సోరెన్ కేంద్ర మంత్రిగా, మూడు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయితే ఎప్పుడు కూడా ఆయన పూర్తికాలం అధికారంలో ఉండలేకపోయారు. 2005లో తొలిసారి సిఎం అయ్యారు. అయితే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోలేకపోవడంతో తొమ్మిది రోజుల్లోనే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సంకీర్ణ రాజకీయాధికారాల సమీకరణల ఫలితంగా ఆ తరువాత రెండు సార్లు కూడా ఆయన ఎక్కువ రోజులు పదవిలో ఉండలేకపోయారు.
కేంద్ర మంత్రిగా కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 2004లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అయితే అంతకు ముందటి ఓ కేసులో అరెస్టు వారంట్ ఎదురుకావడంతో పదవికి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. బెయిల్ తరువాత తిరిగి మంత్రి అయ్యారు. అయితే జార్ఖండ్ సిఎం గా బాధ్యతలు తీసుకోవల్సి రావడంతో కేంద్ర మంత్రి పదవిని వదులుకున్నారు. అయితే పదిరోజులే సిఎంగా ఉన్నారు. తరువాత కేంద్ర బొగ్గు గనుల మంత్రిగా 2006లో నియుక్తులు అయ్యారు. కానీ తన మాజీ కార్యదర్శి శశినాథ్ ఝా హత్య కేసులో ఆయన దోషిగా నిరూపితం కావడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పట్లో ఓ కేంద్ర మంత్రి దోషిగా నిర్థారితం కావడం తొలిసారి అయింది. తరువాత ఈ కేసులో ఆయన నిర్దోషి గా బయటకు వచ్చారు.
సోరెన్ మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపాలు
సీనియర్ నేత శిబూ సోరెన్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో దేశంలో సామాజిక న్యాయం సాధన దిశలో నష్టం వాటిల్లిందని తెలిపారు. గిరిజన తెగలకు ఆయన నాయకత్వం వహించారు. జార్ఖండ్‌కు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కల్పించారని పేర్కొన్నారు. అట్టడుగు స్థాయిలె ఆచప సేవలు ఘననీయం అని కితాబు వెలువరించారు. ఆయన కుటుంబ సభ్యులకు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సానుభూతి తెలియచేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తమ సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన గిరిజన తెగల సాధికారికతకు పాటుపడ్డారని తెలిపారు. పేదలు, అణగారిన వర్గాల పక్షపాతిగా పనిచేశారని పేర్కొన్నారు. హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఖర్గే, బీహార్ సిఎం నితీశ్ కుమార్, నవీన్ పట్నాయక్, ఢిల్లీ సిఎం రేఖా గుప్తా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర నేతలు సోరెన్ కుటుంబానికి సంతాపం తెలియచేశారు. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన తన స్నేహితుడని, ఇరువురం కలిసిచేసిన పోరాటాలు ఉద్యమాలు ఇప్పటికీ గుర్తుకు వస్తాయని స్పందించారు. ఉత్తరప్రదేశ్ సిఎం ఆదిత్యానాథ్, తమిళనాడు సిఎం స్టాలిన్ ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీల నాయకులు సోరెన్‌కు నివాళులు అర్పించారు.