Sunday, June 16, 2024

కుదుపుల నుంచి గుణపాఠాలు

- Advertisement -
- Advertisement -

లండన్ నుంచి సింగపూర్ వెళుతున్న సింగపూర్ ఎయిర్ లైన్స్ మిగిల్చిన భీకర కుదుపుల నుంచి ప్రపంచ విమానయాన సంస్థలు అనేక గుణపాఠాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సంస్థలే కాకుండా ప్రయాణికులు కూడా ప్రయాణ సమయంలో మరిన్ని ప్రాణరక్షక చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కుదుపులు తేల్చిచెబుతున్నాయి. సింగపూర్ ఎయిర్ లైన్స్ లండన్ నుంచి బయలుదేరి సింగపూర్‌కు చేరుకునే సమయంలో మధ్యలో అకస్మాత్తుగా సంభవించిన భారీ కుదుపులకు 73 ఏళ్ళ గియోఫ్రీ కిచెన్ అనే బ్రిటన్ ప్రయాణికుడు మరణించగా, మరో 20 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించే వారిని భయాందోళనలకు గురి చేసింది.

విమాన ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతపై అనేక సందేహాలను లేవనెత్తింది. కుదుపులకు దారి తీసిన కారణాలు, దీనితో విమానమే ఛిద్రమై అనేక మంది రక్తగాయాలతో అత్యవసరంగా బ్యాంకాక్‌లో విమానం ల్యాండ్ అయిన దృశ్యాలు ప్రయాణికుల మనసులను అల్లకల్లోలం చేశాయి. కుదుపులు ఇలాంటి ప్రమాదాలు మిగులుస్తాయా అని అంతా ఆందోళన పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విమానం ఇంతగా కుదుపులకు గురి కావడానికి ప్రాథమిక కారణాలను విమాన భద్రతా నిపుణులు ఇప్పటికే తేల్చివేశారు. విమానాలు 37000 అడుగుల పైన ఆకాశంలో ప్రయాణించే సమయంలో అప్పుడప్పుడు మంచు, తుఫాను గాలుల కారణంగా కుదుపులు ఏర్పడతాయి. ఇవి ఒక్కో సారి భీకరంగా ఉంటాయి. ఇలాంటి కుదుపులు సంభవించినప్పుడు పైలెట్లు హెచ్చరిక సంకేతాలు ప్రకటిస్తుంటారు.

సీటు బెల్ట్ ధరించాలనే సిగ్నల్ లైట్ కూడా ప్రతి సీటుకు ఇస్తుంటారు. ఆ సమయంలో ప్రయాణికులు సీటు బెల్ట్‌ను కదలకుండా ఉండేలా బిగించుకోవాలి. విమానం బయలుదేరేటప్పుడు, విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేటప్పుడు సీటు బెల్ట్ ధరించమని చెబుతారు. ఎందుకంటే ల్యాండింగ్ టైమ్‌లో విమాన వేగం అనంతంగా ఉంటుంది. అప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోకుంటే సీటు ముందు భాగానికి తగలవచ్చు లేదంటే క్యాబిన్ హెడ్‌కు తల తగలవచ్చు. ఫలితంగా ప్రయాణికులు గాయాల పాలయ్యే ప్రమాదం ఉంది. ఇదే కాకుండా ప్రయాణ మార్గంలో వాతావరణంలో మార్పుల కారణంగా విమానం కుదుపులకు గురి కావచ్చు.పైలెట్లు వెదర్ రాడార్లో కనిపెట్టి ‘కుదుపులున్నాయి సీటు బెల్ట్‌ను పెట్టుకోండి’ అని హెచ్చరికలు చేస్తుంటారు. తద్వారా చిన్న, పెద్ద కుదుపుల నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడుతుంటారు. కాని సింగపూర్ ఎయిర్ లైన్స్‌కు ఎదురైన కుదుపులు అరుదైనవని విమాన భద్రతా నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటివి ఎక్కడైనా జరగవచ్చని, ప్రయాణికులు ప్రయాణమంతా అప్రమత్తంగా ఉండడమే శ్రేయస్కరమని విమానాల అటెండెంట్ల అంతర్జాతీయ అధ్యక్షుడు సారా నెల్సన్ అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 వేల విమానాలు, 20 ప్రముఖ ఎయిర్ లైన్స్‌తో కూడిన సంస్థకు నెల్సన్ అధ్యక్షుడిగా ఉండి సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రమాదం గురించి ప్రయాణికులకు అనేక సూచనలు ఇచ్చారు. సింగపూర్ ఎయిర్ లైన్స్‌కు ఎదురైన ‘క్లియర్ ఎయిర్ టర్బులెన్స్’ అనేది అత్యంత ప్రమాదకరమైందని నెల్సన్ అన్నారు. ఇది వెదర్ రాడార్‌లో పైలెట్‌కు కనిపించదని, ఇలాంటి అరుదైన కుదుపులను కనిపెట్టే టెక్నాలజీ ఇంకా లేదని ఆయన అన్నారు. గతంలో మార్చి నెలలో బోయింగ్ 787 అనే భారీ విమానం కూడా ఇలాంటి అరుదైన కుదుపులకు గురై 50 మంది గాయాలపాలయ్యారని, ఇలాంటి అదృశ్య కుదుపుల ప్రమాదాలు మునుముందు కూడా ఎదురు కావచ్చని ఆయన హెచ్చరించారు.

అట్లాగని ప్రయాణికులు 15 నుంచి 24 గంటలు సుదీర్ఘంగా ప్రయాణించే సమయంలో మొత్తం సమయం సీటు బెల్ట్ ఎలా పెట్టుకుంటారనే ప్రశ్నలకు నెల్సన్ నుంచి సమాధానం లేదు. అయితే విమాన భద్రతా నిపుణులు ఆంధోని బ్రిక్ హౌజ్ ఒక పరిష్కారం సూచిస్తున్నారు. ఇది అందరూ పాటిస్తే కొంత మేరకైనా నష్టాన్ని నివారించే అవకాశముంది. అదృశ్య కుదుపులను కనిపెట్టే అవకాశం పైలెట్లకు లేనప్పుడు అప్రమత్తంగా ఉండే ప్రయాణికులే విమానం కుదుపులకు గురవుతుందని గ్రహించగానే సీటు బెల్ట్‌లు పెట్టుకోవాలని, ఆ సమయంలో విమానం లోపలా టాయిలెట్లకో, ఇతరత్రా అవసరాల కోసమే తిరగడం మానేయాలని ఆయన సూచిస్తున్నారు. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా విమాన యానం అనివార్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో సగటు ప్రయాణికులు కుదుపుల నుంచి రక్షించుకోవడానికి పై సూచనలు పాటించడం మినహా మరో మార్గం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News