Monday, September 22, 2025

సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన సర్కార్..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  సింగరేణి 2024-25 ఆర్ధిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో కార్మికులకు ప్రభుత్వం వాటా ప్రకటించింది. సోమవారం హైదరాబాద్‌లో పలువురు మంత్రులతో కలిసి సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదని, రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను తమ పార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తూనే ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సింగరేణిని లాభాల బాటలో నడిపించేందుకు కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారని అందుకే సింగరేణి లాభాల్లో కార్మికులకు 34 శాతం వాటాలు పంచాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

సింగరేణి మొత్తం ఆదాయం రూ.6,394 కోట్లు అని, అందులో రూ.4,034 కోట్లు భవిష్యత్ పెట్టుబడులకు కేటాయించామని సిఎం రేవంత్ చెప్పారు. రూ. 2,360 కోట్లు నికర లాభాలు వచ్చాయని అందులో 34 శాతం రూ.819 కోట్లు పర్మినెంట్ కార్మికులకు బోనస్ కోసం కేటాయించినట్లు సిఎం రేవంత్ తెలిపారు. గతేడాది కాంట్రాక్టు కార్మికులకు రూ.5,000ల బోనస్ ఇచ్చామని ఈసారి రూ. 5,500లు అందిస్తున్నామని సిఎం పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు ఇప్పటికే దసరా అడ్వాన్స్ రూ.25 వేలు ఇచ్చామని సిఎం రేవంత్ అన్నారు. సింగరేణికి విద్యుత్ సంస్థలు, విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం బకాయి ఉందన్నారు. ఇది క్లిష్టమైన సమస్య అని, ఆదాయం పెరగకుండా, ధరలు పెంచకుండా ఏం చేయాలన్న విషయమై ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు.

సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో సింగరేణి 2 బ్లాక్‌లు కోల్పోయిందని, 2 కోల్ బ్లాక్‌లు ప్రైవేటు వ్యక్తులు దక్కించుకున్నారని సిఎం రేవంత్ చెప్పారు. కోల్ బ్లాక్‌లను తిరిగి ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన గనులను కూడా సింగరేణికి అప్పగించేలా చూడాలని కార్మికులు కోరారని సిఎం అన్నారు. ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్‌లో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. భవిష్యత్‌లో కార్మికులకు అండగా ఉంటామని సింగరేణి సంస్థను లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్మికులకు దీపావళికి కూడా బోనస్ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, ఎంపిలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్, సింగరేణి సిఎండి బలరాం, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.

Also Read: మీ సమస్య పరిష్కరించకుంటే స్థానిక ఎన్నికలను బహిష్కరించండి: కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News