Thursday, May 2, 2024

అన్నదాత ఆగ్రహానికి ఆరు నెలలు

- Advertisement -
- Advertisement -

Six months to Farmers' protest for Repeal of new Farm bills

 

కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు ఈ నెల 26 తో ఆరు నెలలు పూర్తవుతుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఆందోళన కోసం ఊర్లోంచి బయలుదేరి దేశ రాజధానిలో 26 నవంబర్ 2020 నాడు అడుగు పెట్టారు. వివిధ మలుపులు తిరిగిన వారి చట్టాల వ్యతిరేకత ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికి ఢిల్లీ సరిహద్దులైన సింఘు, తిక్రి ప్రాంతాల్లో 40 వేల దాక రైతులు ఉన్నారని పోలీసులు అంటున్నారు. ఘజియాబాద్, చిల్లా సరిహద్దుల లోంచి ఢిల్లీకి బయటి ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి.

అన్నదాత కన్నా అరటి పండ్లు అమ్ముకొనేవాడి బతుకు బెటర్ అనే పరిస్థితి దేశంలో ఉంది. అయితే తరతరాలుగా సాగు తప్ప మరో లోకం తెలియని రైతు దీపం పురుగులా పంట చేలల్లో పొర్లుతున్నాడు. ఆ బాధలు చాలవన్నట్లు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలతో వారిని మరింత ఉచ్చులోకి లాగుతోంది. ఎలాంటి చర్చ లేకుండా సెప్టెంబర్ 2020లో పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ చట్టాలు ప్రధానంగా రైతులకు దక్కే కనీస మద్దతు ధరను, స్థానికంగా పంట అమ్మకపు వ్యవస్థను తొలగిస్తూ భూములపై కార్పొరేట్ శక్తుల ఆధిపత్యాన్ని పెంచేలా ఉన్నాయి. వాటిని ఏక మొత్తంగా రద్దు చేసి తీరాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

దాదాపు మధ్య, ఉత్తర భారతంలోని అన్ని రాష్ట్రాల రైతులు ఇందులో పాల్గొంటున్నారు. నవంబర్, డిసెంబర్ 2020, జనవరి 2021 సమయాల్లో రెండు నుండి మూడు లక్షల దాకా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో బస చేశారు. తొలుత ప్రభుత్వం వీరిని తక్కువ అంచనా వేసింది. ఈ ఆందోళనలో పాకిస్తాన్ తీవ్రవాదులున్నారని, ఖలిస్థాన్ మద్దతుదారులున్నారని, దేశంలోని చట్ట వ్యతిరేక శక్తులు వీరితో మిలాఖత్ అయ్యారని తప్పుడు వార్తలతో, ప్రచారంతో బలహీనపరచే ప్రయత్నం పెద్ద ఎత్తున చేసింది. అయితే రైతులు ఈ అపవాదులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యమ సానుభూతిపరులు ఎలెక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల ద్వారా వీరికి సహకరించారు.

ఇక వారంతా రైతులే అని నమ్మిన ప్రభుత్వం చర్చలకు రైతు ప్రతినిధులను ఆహ్వానించింది. ఇలా ఇప్పటికి 11 విడతలు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో అసలు సమస్యలు కొలిక్కి రాలేదు. రైతు సంఘాలు పెట్టిన పది డిమాండ్లలో పంట చెత్తను కాల్చివేసినవారిపై కేసుల ఉపసంహరణ, విద్యుత్ చార్జీల సవరణ వెనక్కి తప్ప మరేదానికి సర్కారు ఒప్పుకోలేదు. 22 జనవరి తరవాత మళ్ళీ చర్చలు జరగలేదు. చర్చలకు తాము సిద్ధమే అని రైతు సంఘాల నేతలంటున్నారు.

కొత్త వ్యవసాయ చట్టాల అమలును 18 నెలల పాటు నిలిపివేస్తామని, రైతులు ఇళ్లల్లోకి వెళ్లాలని జనవరి 21 న కేంద్రం తెచ్చిన ప్రతిపాదనను రైతులు ఒప్పుకోలేదు. ఎన్నో అభ్యర్థనల అనంతరం 4 జనవరి నాడు సుప్రీంకోర్టు తొలిసారిగా కొత్త వ్యవసాయ చట్టాల రద్దుపై కేసును స్వీకరించింది. 11 నాడు ఆ చట్టాల అమలుపై మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేదాకా నిలుపుదలకు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత నలుగురు సభ్యుల కమిటీని వేసి రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే రైతులు సుప్రీం చర్యలను స్వాగతించ లేదు. పార్లమెంట్‌లో కొత్త చట్టాల రద్దు తీర్మానం ఆమోదించడం తప్ప తాము దేనికి ఒప్పుకోమని స్పష్టం చేశారు. ఆ కమిటీ మార్చి 19 న సుప్రీం కోర్టుకు తన నివేదికను సీల్డ్ కవర్‌లో అందజేసింది. ఏప్రిల్, 5 న ఉన్న విచారణ వాయిదా పడింది. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో కరోనా ఉధృతి వల్ల రైతులు తిరిగి ఇళ్లలోకి వెళ్లిపోవాలని వారిపై ఒత్తిడి పెరిగింది. తాము ఢిల్లీ సరిహద్దుల్ని ఖాళీ చేయడం వల్ల దేశంలోంచి కరోనా పోతుందంటే తక్షణం వెళ్లిపోతామని రైతు నేతలంటున్నారు. ఈ నిరసన సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ నేతృత్వంలో సాగుతోంది. మోర్చాలో 40, కమిటీలో 130 రైతు సంఘాల సభ్యత్వముంది. మోర్చాకు బల్బీర్ సింగ్ రజేవాల్, కిసాన్ కమిటీకి రాకేష్ తికాయత్ నాయకులుగా ఉన్నారు.

ఈ ఆరు నెలల కాలంలో వివిధ అనారోగ్య సమస్యలతో 243 మంది రైతులు లంగర్లలో చనిపోయారు. ఐదుగురు ప్రభుత్వ వైఖరికి నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్నారు. అన్ని ఇక్కట్లను ఎదుర్కొంటూ రైతులు ‘లా వాపసీతోనే ఘర్ వాపసీ’ అని భీష్మించుకొని ఉన్నారు. మరో వైపు ప్రభుత్వం ఎరువుల, డీజిల్ ధరలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పెంపు వల్ల క్వింటాల్ గోధుమపై వేయి రూపాయల అదనపు భారం పడుతుందని వారి అంచనా. నిర్దాక్షిణ్యంగా రైతుపై మరో బండ వేయడం ఆక్షేపణీయం. మోయలేని భారం దింపకుండా పిఎమ్ కిసాన్ సొమ్ముతో కంటి తుడుపు ప్రయత్నం పనికిరాదని అంటున్నారు.

ఆరు నెలలు పూర్తయిన సందర్బంగా దేశ వ్యాప్తంగా రైతులు మే 26 ను ‘బ్లాక్ డే’ గా పాటించాలని రైతు నేతలు కోరుతున్నారు. రైతులు తమ ఇళ్లపై, వ్యాపార సంస్థలపై, వాహనాలపై నల్ల జెండాలు ఎగరవేసి నిరసన తెలుపాలని అంటున్నారు. ప్రోటోకాల్ పాటి స్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మలను దగ్ధం చేయమని వారి అనుబంధ సంఘాలకు సమాచారం పంపారు. బిజెపియేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలైన కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లలో ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు అసెంబ్లీలలో తీర్మానాలు చేశారు. గణతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోటపై రైతు సంఘాల జెండా ఎగరవేయడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడి విషయం అరెస్టులు, కేసుల దాకా వెళ్ళింది.

మధ్యలో ‘టూల్ కిట్’ వచ్చింది. రైతులకు మద్దతుగా ఏం చేయాలో చర్చించేందుకు ఖలిస్థాన్ మద్దతుదారులు జనవరి 11 న ఏర్పాటు చేసిన జూమ్ సమావేశంలో ‘గణతంత్ర’ అల్లరులకు సంబంధించిన టూల్ కిట్ అందిందని ఢిల్లీ పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. స్వీడిష్ పర్యావరణవేత్త అయిన గ్రెటా థమ్ బెర్గ్ నుండి దిశ రవి, నిఖిత జాకబ్, శాంతను ములుక్ సమాచారం పంచుకున్నారని వారిపై అభియోగం మోపబడింది. రైతులు అన్నిటిని అధిగమిస్తున్నారు. వరదల్లాంటి వర్షాలు వచ్చాయి. ఎముకలు నమిలే చలి వచ్చి వెళ్ళింది. కరోనా పక్క పక్కనే తిరుగుతోంది. సత్యాగ్రహాన్ని ఏవీ ఓడించలేకపోయాయి. ఇంకెన్ని ఓడిపోయి రైతులను గెలిపిస్తాయో చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News