Saturday, April 27, 2024

ఆర్థిక ఊబిలో దేశం

- Advertisement -
- Advertisement -

Unemployment has risen again in India

 

ఆర్థిక పురోభివృద్ధి అంటే దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరగడమే అయితే ఇండియా ప్రగతి దారుల్లో పరుగులు పెడుతున్నట్టే. ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లున్న దేశాల్లో అమెరికా, చైనాల తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉందని ఫోర్బెస్ మేగజైన్ తాజా పరిశీలన నిగ్గు తేల్చింది. మన రిలయన్స్ ముఖేశ్ అంబానీ ఆసియాలో అత్యంత సంపన్నుడి కిరీటాన్ని మళ్లీ సాధించుకున్నట్టు కూడా ప్రకటించింది. దేశంలోని ధనికులు తమంత తాముగా ప్రకటించుకునే ఆస్తుల ఆధారంగానే ఇటువంటి సంస్థలు వారి ఐశ్వర్య స్థాయిని నిర్ణయిస్తుంటాయి.వారి అప్రకటిత ధనాన్ని కూడా లెక్కగడితే వారు మరింత ధనికులుగా తేలుతారు. అప్పుడు అత్యధిక బిలియనీర్లున్న దేశాల జాబితాలో భారత్ మొదటి, రెండవ స్థానాల్లోకి కూడా చేరుకునే అవకాశముంటుంది. అందుచేత ఐశ్వర్యవంతుల లెక్కల్లో చూసుకుంటే భారత దేశం బ్రహ్మాండంగా వెలిగిపోతున్నట్టే. కాని పేదరికం, నిరుద్యోగం పరంగా మన వాస్తవ పరిస్థితిని గమనిస్తే నానాటికీ అధమ స్థాయికి కుంగిపోతున్న చేదు వాస్తవం కళ్ల ముందు భయంకర నాట్యం చేస్తుంది.

దేశంలో నిరుద్యోగం మళ్లీ అసాధారణంగా పెరిగిపోయిందని భారతీయ ఆర్థిక గమన పర్యవేక్షక కేంద్రం సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) తెలియజేసింది. పట్టణ ప్రాంత నిరుద్యోగం గత నెల (ఏప్రిల్) 25తో ముగిసిన వారంలో 9.55 శాతంగా ఉండగా, ఈ నెల 9వ తేదీతో పూర్తయిన వారంలో 11.72 శాతానికి పెరిగిపోయిందని వివరించింది. నగరాల్లో లాక్‌డౌన్‌ను ఇదే మాదిరిగా కొనసాగిస్తూ పోతే వాణిజ్య పారిశ్రామిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయి నిరుద్యోగం మరింత పేట్రేగిపోతుందని ఈ సంస్థ హెచ్చరించింది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత పట్టణ నిరుద్యోగం పెరుగుదల రేటు తక్కువే అయినప్పటికీ అప్పుడు నెలల తరబడి దేశమంతటా కఠోర లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పట్టణ నిరుద్యోగం 27.83 శాతానికి ఎక్కి కూర్చుందని, ఇప్పుడు జాతీయ లాక్‌డౌన్ లేని సమయంలో 12 శాతం రేటు కూడా ఆందోళనకరమైనదేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు పలు నగరాల్లోని లాక్‌డౌన్లు కొంత వరకే కారణమని మొత్తం మీద ఆర్థిక వ్యవస్థను ఇంతకు ముందు నుంచి పీడిస్తున్న బలహీనతలు సైతం ఇందుకు హేతువులని భావిస్తున్నారు.

గ్రామీణ ఆర్థిక రంగమైతే ఉపాధులు, ఉద్యోగాలకు బొత్తిగా అవకాశం లేని స్థాయిలో కుంగిపోయి మంచం పట్టిపోయిందని అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈసరికే బాగా వేళ్లూనుకొని ఉండవలసిన వ్యవసాయాధార పారిశ్రామిక రంగం ఆశించినంతగా పుంజుకోకపోడం ఇందుకు కారణం. కరోనా మొదటి దశలోనే ఘోర పతనాన్ని అనుభవించిన ఆర్థిక రంగం ప్రస్తుత రెండవ కెరటం మూలంగా చావు దెబ్బ తిన్నది. ఇందువల్ల పలు సంస్థలు మూతపడి కోల్పోయిన ఉద్యోగాలు మళ్లీ ఎప్పుడూ అందుబాటులోకి రాని పరిస్థితి తలెత్తి అవి శాశ్వత నష్టం లెక్కలోకి జారిపోయే ప్రమాదమున్నదని సిఎంఐఇ హెచ్చరించింది. కొన్ని వ్యాపారాలు భవిష్యత్తులో తిరిగి తెరుచుకొని పుంజుకోలేవని స్పష్టం చేసింది. ఇప్పటి దుస్థితికి గత ఏడాదిన్నరగా కొవిడ్ 19 విజృంభణ, పునర్విజృంభణ కొంత కారణం కాగా గతంలో తీసుకున్న తప్పుడు విధాన నిర్ణయాలు, వైఫల్యాల వల్ల ఆర్థిక స్థితి తిరిగి లేవలేని స్థాయికి కుప్పకూలిందని నిపుణులు చెబుతున్న దానిని కాదనలేము.

ఇందుకు 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అపసవ్య అమలును ఉదహరిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజల జేబులు ఖాళీ అయిపోయి చిన్న సంస్థలు మూతపడిపోయి సరకులకు, ఉత్పత్తులకు డిమాండ్ దారుణంగా పడిపోయిందని జిఎస్‌టి అవకతవకల వల్ల 11 కోట్ల మంది వ్యవసాయేతర జనానికి ఉపాధి కల్పించిన చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, పరిశ్రమలు దెబ్బ తిన్నాయని సిఎంఐఇ తేల్చి చెప్పింది. ఒకవైపు వ్యాక్సిన్, ఆక్సిజన్, ఆసుపత్రులు, బెడ్లు తగినంతగా సమకూర్చలేకపోడం వల్ల కొవిడ్ మరణాలు విపరీతంగా పెరిగిపోతుంటే మరోవంక ఉద్యోగాలు, ఉపాధులు అంతరించిపోయి రెక్కాడించి డొక్క నింపుకునే దారులూ మూసుకుపోతున్నాయి. ఆకలి చావులు దాపురించే దురవస్థ నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో దేశ నాయకత్వం విజ్ఞత ఉపయోగించి అత్యవసర చర్యలు తీసుకోవలసి ఉంది. ఉపాధులు, ఉద్యోగాలు నష్టపోయిన వారికి నేరుగా నగదు సాయం అందించాలని, ఉద్యోగులను భరించగలిగేందుకు వీలుగా చిన్న, మధ్య తరహా సంస్థలకు ఆర్థికంగా తోడ్పడాలని నిపుణులు హితవు చెబుతున్నారు.

కేంద్ర పాలకులు ఇకనైనా వీటిని సానుకూల దృష్టితో ఆలకించాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింతగా విస్తరింపచేయాలి. పట్టణాల్లో కూడా అటువంటి దాన్ని రూపొందించి చేపట్టాలి. బయటి నుంచి వచ్చే జాతి హితమైన సలహాలను పని కట్టుకొని తోసిపుచ్చడం, వాటిని అమలు చేస్తే తమకు నామోషి అని భావించడం మంచి పాలకుల లక్షణంకాదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News