Wednesday, May 8, 2024

సోనియాతో రెబెల్స్ బృందం భేటీ ఖరారు?

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi Agrees To Meet Congress Rebels

 

కమల్ నాథ్ చొరవతో సయోధ్య మార్గం

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సంస్థాగత మార్పుల వాదన తెచ్చిన 23 మంది కాంగ్రెస్ రెబెల్స్ బృందం త్వరలోనే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తుంది. మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈ భేటీ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు. పలు పరాజయాల నేపథ్యంలో పార్టీలో నాయకత్వ శూన్యత భర్తీ అవసరం ఉందని, తక్షణమే సమూల రీతిలో పార్టీలో మార్పులు చేర్పులు చేపట్టాలని పార్టీలో అత్యంత ప్రముఖులే బహిరంగ లేఖలు రాయడం చర్చనీయాంశం అయింది. దీనితో సోనియా రాహుల్ అనుకూల వర్గాలు, వ్యతిరేక వర్గాలుఅనే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిలో ఎటువంటి మార్పులేకుండా ఉంది. ఈ దశలో సోనియాతో పాటు రాహుల్‌తో కూడా ఈ నేతలు సమావేశం అయ్యేలా కమల్‌నాథ్ చురుగ్గా వ్యవహరించారని వెల్లడైంది. పార్టీకి చురుకైన, తక్షణ స్పందనల హాజరీ నాయకత్వం కావాలనే ఇతర నేతల వాదనలకు కమల్ నాథ్ కూడా మద్దతు పలికారు. పార్టీ పతనం అవుతున్న దశలో ఆపరేషన్ జరగాలనే నేతల తీరుతో పార్టీలో ప్రముఖ వ్యక్తులతో కూడిన రెబెల్స్ బృందం పుట్టుకువచ్చింది.

పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠానికి జ్యోతిరాదిత్య సింధియా పార్టీ ఫిరాయింపుతో గండి పడింది. పైగా రాహుల్‌కు సింధియాకు మధ్య మంచి స్నేహం ఉందనే వాదన నెలకొంది. ఈ క్రమంలో రెబెల్స్ బృందానికి సోనియాకు మధ్య విభేదాలు పెరిగిపోకుండా ఉండేందుకు కమల్‌నాథ్ చొరవ తీసుకుని భేటీకి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడైంది. గాంధీలను ఈ విషయంలో ఒప్పించినట్లు తెలిసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ వైఫల్యంతో మరోసారి తిరుగుబాటు ధోరణి తలెత్తుతుందని భావిస్తున్నారు. ఇటీవలే సీనియర్ నేత కపిల్ సిబల్ రాసిన లేఖ అది బహిరంగం కావడం సంచలనానికే దారితీసింది. పార్టీలో తక్షణ ఆత్మపరిశీలన అవసరం అని, లేకపోతే మరింత పతనం తప్పదని పేర్కొనడం, మరో సీనియర్ నేత చిదంబరం కూడా పార్టీ అధినాయకత్వం సరైన రీతిలో వ్యవహరించడం లేదని పరోక్షంగా తెలియచేయడం, సమగ్ర సమీక్ష అవసరం అని విలేకరుల సమావేశంలో చెప్పడం వంటి పరిణామాల తరుణంలోనే సోనియా రాహుల్‌తో ఈ 23 మంది నేతల భేటీకి రంగం సిద్ధం అయింది. అయితే ఎప్పుడు ఈ కీలక భేటీ జరుగుతుందనేది, వేదిక ఏమిటనేది ఖరారు కాలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News