Sunday, April 28, 2024

కాంగ్రెస్ పగ్గాలు సోనియాకే

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi to remain Congress president

సంస్థాగత ఎన్నికలు జరిగే కొనసాగింపు, కమిటీలో నిర్ణయం

రాహుల్ నాయకత్వానికి
మద్దతు  అసమ్మతి గళంపై
అస్పష్టత 2024 ఎన్నికలపై
దృష్టి సారించాలని సంకల్పం
మన్మోహన్ దూరం

న్యూఢిల్లీ : సోనియా గాంధీయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సారథ్య బాధ్యతల్లో కొనసాగుతారు. నాయకత్వంలో ఎటువంటి మార్పు ఉండదని పేర్కొంటూ విషయాన్ని స్పష్టం చేస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయానికి వచ్చారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్రస్థాయి సమీక్షకు సిడబ్లుసి సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. అధినాయకత్వం స్థాయిలో భారీ స్థాయి మార్పులు చేర్పులు జరగాలనే కొందరు అసమ్మతి నేతలు ముందుగా వాదనలు లేవనెత్తినా , ఆదివారం నాటి భేటీలో ఈ నాయకత్వ మార్పు అంశం ప్రస్తావన లేకుండానే యధాతధ స్థితి కొనసాగింపు, కలవరపర్చవద్దనే ధోరణిలోనే సమావేశం అంతా సాగింది. ఆగస్టులో నూతన నాయకత్వ ఎన్నిక జరుగుతుంది. ఆగస్టు 2౦వ తేదీ దరిదాపులలో జరిగే ఈ ఎన్నికల ప్రక్రియ వరకూ సోనియా గాంధీయే నాయకత్వ బాధ్యతలలో ఉంటారు. ఈ లోగా పార్టీ అంతర్గత ఎన్నికలు క్రమేపీ జరుపుతారు.దాదాపు నాలుగు గంటల పాటు పోస్టుమార్టం స్థాయిలోనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించారు. ఎటువంటి లోపాలు జరిగాయి? ప్రత్యేకించి పంజాబ్ , యుపిలలో జరిగిన పరిణామాలేమిటీ? అనే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

తొలుత సోనియా , రాహుల్‌లు తమ పదవులకు రాజీనామాలు సమర్పిస్తామని ముందుకు వచ్చినట్లు, అయితే కమిటీ దీనిని తోసిపుచ్చినట్లు వెల్లడైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేత ఆంటోనీ అనారోగ్య కారణాలతో సమావేశానికి రాలేదు. పిసిసి అధ్యక్షులకు, వర్కింగ్ కమిటీ సభ్యులకు ఆహ్వానాలు పంపించారు. ఈ భేటీకి హాజరైన వారిలో ఖర్గే , అంబికా సోని, సల్మాన్ ఖుర్షీద్, అజయ్ మకెన్, పి చిదంబరం, అశోక్ గెహ్లాట్ , ప్రియాంక గాంధీ ఇతరులు ఉన్నారు. మొత్తం 50 మంది నేతలు ఈ సమావేశానికి వచ్చారు. పార్టీలో అసమ్మతి నేతలు గళమెత్తినదీ లేనిది స్పష్టం కాలేదు. ప్రస్తుత పరాజయాన్ని రాష్ట్రాల పరిస్థితుల కోణంలో బేరీజు వేసుకుంటూ జాతీయ స్థాయిలో సోనియా గాంధీ సారధ్యంలోనే 2024 పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధం కావాలనే నిర్ణయానికి వచ్చారు. నాయకత్వ మార్పు ప్రస్తావన రాలేదు, ఈ ప్రసక్తే ఉండదని సిడబ్లుసి తరువాత అధికారికంగా తెలిపారు. సోనియా గాంధీ నాయకత్వం పట్ల పార్టీ తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించిందని పేర్కొంటూ, ఈ మేరకు ఆమె పట్ల ఏకగ్రీవంగా విశ్వాసం వ్యక్తపర్చిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌కు సారధ్యబాధ్యతల్లో కొనసాగాలని కమిటీ అభ్యర్థించింది. పార్టీలో వెంటనే నిర్మాణాత్మక దిద్దుబాటు చర్యలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు చర్యలు తీసుకుంటారని భేటీ తరువాత ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ విలేకరులకు తెలిపారు.పార్టీలో సంస్థాగత ఎన్నికలు ముగిసేవరకూ సోనియా గాంధీ సారధ్య బాధ్యతలలోనే ఉంటారని , ఈ మేరకు సిడబ్లుసిలోని ప్రతిసభ్యులు తమ ఆకాంక్ష వ్యక్తం చేశారని కాంగెస్ నేత ఆర్ సూర్జేవాలా తెలిపారు.పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ముగియగానే పార్టీలో చింతన్ శివిర్ జరుగుతుంది. ఇది రాజస్థాన్‌లో జరుగుతుందని వెల్లడైంది. తమకు సోనియాపైనే పూర్తి విశ్వాసం ఉందని పార్టీ నేత ఖర్గే తెలిపారు. పార్టీ సమావేశంలో ఆసాంతం సోనియా కానీ రాహుల్ కానీ ఏమీ మాట్లాడలేదని, నాయకులు చెపుతున్నది శ్రద్ధగా వింటూ గడిపారని, కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఉన్నారని వెల్లడైంది.

జి 23 తరఫున ముగ్గురు నేతలు

ఇప్పుడు జరిగిన వర్కింగ్ కమిటీ భేటీకి అసమ్మతి నేతల బృందం జి 23 నుంచి కేవలం ముగ్గురు నాయకులు సభ్యులుగా కమిటీ భేటీకి వచ్చారు. వీరిలో ఇప్పుడు శర్మ, ఆజాద్‌లు తమ వాదనలను భేటీలోనూ తెలియచేశారని వెల్లడైంది.

రాహుల్‌కే నాయకత్వ బాధ్యతలు
బలోపేతమవుతోన్న వాదన

గెహ్లోట్, డికె యువజన నేతల మద్దతు
బిజెపిని తిప్పికొట్టాలని పిలుపు

రాహుల్ గాంధీయే సత్వరం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టాల్సి ఉందనే డిమాండ్ల నేపథ్యంలో ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి) భేటీ జరిగింది. ఇటీవల జరిగిన ఐదు అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ చేదు ఫలితాలపై సమీక్షించేందుకు హుటాహుటిన కీలక విధాన నిర్ణాయక కమిటీ అయిన సిడబ్లుసి భేటీ జరిగింది. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల నాయకత్వంపై తీవ్ర స్థాయి నిరసనలు వ్యక్తం అవుతాయని, అసమ్మతి నేతలతో కూడిన జి 23 వేదిక మరింత బలోపతం అయ్యి, అగ్ర నాయకత్వ మార్పునకు గళం విప్పుతుందని భావించారు. అయితే ఇందుకు విరుద్ధంగా సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, ఢిల్లీకి చెందిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు దండుగా బయలుదేరి గాంధీ కుటుంబానికి అనుకూలంగా తమ మద్దతు పలికారు. పార్టీ కీలక సమావేశం సాయంత్రం 4 గంటలకు జరిగింది. దీనికి ముందుగా ఉదయం నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వెలుపల, ఇతర చోట్లా కార్యకర్తలు రాహుల్ గాంధీ అనుకూల నినాదాలతో కదిలారు.

ఈసారి సిడబ్లుసి భేటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేత ఆంటోనీ వంటి వారు అనారోగ్య కారణాలతో హాజరు కాలేదు. మిగిలిన నేతలంతా తమకు అందిన ఆహ్వానాల మేరకు వచ్చారు. సమావేశానికి రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లోట్, చత్తీస్‌గఢ్ సిఎం భూపేష్ బఘేల్ ఇతరులకు ఆహ్వానం అందింది. పార్టీ ఇటువంటి పరిణామాల నడుమ చెక్కుచెదరకుండా ఉండేందుకు రాహుల్ గాంధీకే నాయకత్వ బాథ్యతలు అప్పగించాల్సి ఉందని, లేదా వీటిని ఆయన స్వీకరించాలని రాజస్థాన్ సిఎం గెహ్లోట్ సూచించారు. ఆయన నాయకత్వంలో పార్టీ సంఘటితంగా ఉంటుందన్నారు. కుటుంబ పాలన ఏక వ్యక్తులకు అధికారం అంటున్న వారి వాదనలో పసలేదని ఆయన తిప్పికొట్టారు. 30 ఏండ్లలో వారే ఎందుకు నాయకులు అవుతున్నారు. ప్రజలు వారిని ఆదరిస్తున్నందునే, కులాలు మతాలు వర్గాలకు అతీతంగా వారే నాయకులుగా కోరుకుంటున్నందున అని రాజస్థాన్ సిఎం సమర్థించారు.

సమర్థతను పరిగణనలోకి తీసుకునే ఎవరికైనా పట్టం కట్టడం జరుగుతుంది. ఇతరత్రా మాటలు సంకుచితం అవుతాయని అన్నారు. ఆయన వాదనను కర్నాటక పిసిసి అధ్యక్షులు డికె శివకుమార్ సమర్ధించారు. ఇంతకు ముందు ఇదే తాను చెప్పానని, ఇప్పుడు కూడా ఇదే చెపుతున్నానని తెలిపారు. పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలను రాహుల్ చేపట్టాల్సి ఉంది. దేశంలో తన వంటి లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు నేతలు కోరుకుంటున్నది ఇదే అని ఆయన ట్వీటు వెలువరించారు. యువజన కాంగ్రెస్ నేత శ్రీనివాస్ బివి మాట్లాడుతూ గాంధీ కుటుంబమే కాంగ్రెస్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ వర్గాలను ఒకే తాటిపైకి తెచ్చే శక్తిగా నిలుస్తుందన్నారు. విజయాలు అపజయాలతో దీనికి సంబంధం లేదని తెలిపారు. జార్ఖండ్ పిసిసి సోనియా నాయకత్వానికి మద్దతు పలుకుతూ తీర్మానం వెలువరించింది. ప్రతిని సిడబ్లుసి భేటీకి ఫ్యాక్స్ ద్వారా పంపించింది.

బిజెపివి ప్రమాదకర రాజకీయాలు

దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపి ప్రమాదకరమైన శక్తి అని రాజస్థాన్ సిఎం గెహ్లోట్ తెలిపారు. ఎన్నికలలో విజయాల కోసం వారు అత్యంత ప్రమాదకర రీతిలో వర్గ మత వైషమ్యాలకు పాల్పడుతున్నారు. ఇది పాలలో విషం చిమ్మడం అవుతోంది. గెలుపోటములు రాజకీయాలలో ఎన్నికలలో సహజం అవుతాయని బిజెపి హిందూత్వను రాజకీయాలకు జోడించిందని ఇది విద్వేషకరపు ఆటవికపు ఆట అని, భయానక రీతిలో వ్యవహరించే వారి చేష్టలకు తాత్కాలికంగా ఎదురులేకపోవచ్చు. అయితే దీని వల్ల వికృత పరిణామాలు ఉంటాయని, వీటిని ప్రజలు గుర్తించాలని సూచించారు. కులం మతం ప్రాతిపదికన రాజకీయాలు చేయడం తేలికే, వారు చేస్తున్నది ఇదే వారు చేస్తున్నది దేశ ప్రయోజనాల గురించి వారు పట్టించుకోవడం మానివేశారు. దేశ భక్తుల ప్రతినిధుల మంటూ వారు రాజకీయాలలో ఓట్లవేటకు దుష్ట ఆటకు బరి తెగించారని ఘాటుగా స్పందించారు.

దేశ ప్రజలు ఈ నిజాలను ఇప్పుడు కాకపోయినా ఇక ముందు అయినా గ్రహిస్తారని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. వారు కాంగ్రెస్‌ను ముస్లిం పార్టీగా చిత్రీకరించారు. సోషల్ మీడియా ద్వారా తమ తప్పుడు సందేశాలను ప్రజలకు అందించారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న కొద్ది వాటినే నిజాలుగా కొందరు నమ్ముతారు. వీటిని ఇతరులకు అంటిస్తారు. ఇదే ఇప్పుడు బిజెపి జాతరలో జరుగుతున్న ఘట్టం అని కాంగ్రెస్ సీనియర్ నేత తెలిపారు. అయితే ప్రజలు త్వరలోనే నిజాలు తెలుసుకుంటారని, ఇది వెలుగులోకి వస్తుందని తాము ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు. 24అక్బర్ రోడ్‌లోని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలోని సిడబ్లుసి భేటీ దశలోనే వెలుపల గుమికూడిన పలువురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ కుటుంబానికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలకు దిగారు. వీరిలో అల్కా లంబా వంటి ఢిల్లీ కాంగ్రెస్ నేతలు పలువురు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News