Tuesday, April 30, 2024

నేత్రపర్వంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం.. తరలి వచ్చిన భక్తజనం..

- Advertisement -
- Advertisement -

భద్రాచలం: శ్రీరామ నవమి భద్రాచల క్షేత్రంలో బుధవారం సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కల్యాణం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం తెల్లవారు జామునే ఆలయ ద్వారాలను తెరిచి అర్చకులు.. రామయ్యకు సుప్రభాత సేవ జరిపారు.

అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళ శాసనం, అభిషేకం ఆ తర్వాత ధ్రువ మూర్తులకు కల్యాణం నిర్వహించారు. తర్వాత కల్యాణ మూర్తులను పల్లకీలో ఉంచి మంగళ వాయిద్యాల మధ్య మిథిలా మైదానం లోని కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. రజత సింహాసనంపై శ్రీ సీతారామ చంద్ర స్వాములను ఆసీనులను చేశారు. తిరువారాధన, విశ్వక్సేన పూజ, పుణ్యహా వచనం నిర్వహించి మండప శుద్ధి చేశారు. ‘యుంజానహః ప్రథమం’ అనే మంత్రాని పఠిస్తూ వేద పండితులు ప్రజా సంపతర్థ్యం ‘శ్రీయం ఉద్వాః హిష్షే’ అన్న సంకల్పంతో స్వామి వారికి ఎదురుగా సీతమ్మను కూర్చో బెట్టి కన్యావరణలు జరిపారు. మోక్ష బంధం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ గావించారు.

వధూవరుల వంశ గోత్రాలకు సంబంధించి ప్రవరలు వినిపించారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళన, పుష్పాదక స్నానం జరిపి వర పూజ కార్యక్రం జరిపారు. కల్యాణం సందర్భంగా సంప్రదాయబద్ధంగా భక్త రామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, కలికితు రాయి, రామ మాడ తదితర ఆభరణాలను రామయ్యకు, సీతమ్మకు, లక్ష్మణ స్వామికి ధరింప జేశారు.

అర్చక స్వాములు స్వామి వారికి నూతన వస్త్రాలను అలంకరించారు. అభిజిత్‌ లగ్నం సమయంలో శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తుల శిరసుపై జీలకర్ర బెల్లం ఉంచి.. అనంతరం భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో సూత్ర ధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. కల్యాణ వేడుకలో వేలాది మంది భక్తులు వీక్షించి పరవశించి పోయారు. కల్యాణం జరిగిన మిథిలా మైదానంతో ఆలయ పరిసరాలన్నీ రామ నామ స్మరణతో మార్మోగాయి. కల్యాణోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ పీఎస్‌ నరసింహా, హైకోర్ట్ జడ్జి భీమపాక నగేష్రా రామయ్య కల్యాణాన్ని వీక్షించారు. కల్యాణ వేడుక సందర్భంగా మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం పట్టాభిషేక కార్యక్రమం జరుగనున్నది..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News