Sunday, April 28, 2024

దద్దరిల్లిన దండకారణ్యం..

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం : గత కొంతకాలంగా తరచూ ఎదురు కాల్పులతో మన్యం ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు రాష్ట్రాలు నివురుగప్పిన నిప్పులా మారుతున్నాయి. ఎప్పుడూ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయాందోళనతో స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. కొత్త ఏడాదిలో ఇప్పటికే పలుమార్లు అటవీ ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ఎట్టి పరిస్థితుల్లోనూ మావోలను తుదముట్టించాలని పోలీస్ యంత్రాంగం కృతనిశ్చయంతో ఉండగా వారి దాడులను తిప్పికొట్టేందుకు ప్రత్యర్థి వర్గం సిద్ధమవుతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా, పామేడులో సిఆర్‌పిఎఫ్ క్యాంపుతో పాటు వివిధ శిబిరాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంపై దాదాపు మూడువేల మంది మావోలు రాకెట్ లాంచర్‌లతో విరుచుకుపడ్డారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ బలగాలు ఈ దాడిని తిప్పికొట్టాయి. తెలంగాణ రాష్ట్రం సరిహద్దు ప్రాంతమైన చర్లకు 18 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఓ వైపు ఎదురుకాల్పులు జరుగుతుండగానే సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. చింతవాగు, ధర్మారం, పామేడు మధ్య పోలీసులు రాకపోకలను నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. మందుపాతర ఏర్పాటు చేసి ఉంటారన్న సమాచారంతో బిడిఎస్ బృందాలతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. గగనతలంలోకి డ్రోన్‌లను పంపించి అక్కడ ఉన్న ప్రదేశాలను, ముఖ్యంగా అటవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ధర్మారం క్యాంపు టెంట్ సమీపంలో పెద్ద సంఖ్యలో గ్రైనైడ్‌లు కనిపించాయి. ఈ ఘటనపై సిఆర్‌పిఎఫ్ దళాలు, పోలీసు ఉన్నతాధికారులతో పాటు భద్రాద్రి కొత్తగూడెం ఎస్‌పి రోహిత్ రాజు, ఎఎస్‌పి పరితోష్ పంకజ్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనా గత వారం రోజులుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు వరుస ఘటనలతో అట్టుడుకుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News