‘సుప్రీం’ సూటి ప్రశ్న.. తీర్పు రిజర్వ్
మన తెలంగాణ/హైదరాబాద్: పదేళ్ల పాటు స్థానికంగా చదువుకున్న విద్యార్థి ఉన్నత విద్య కోసం రెండేళ్లు పొరుగు రాష్ట్రానికి వెళితే స్థానికత ఎలా కోల్పోతారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో రెండేళ్ల పాటు చదువుకుంటే తప్పేమిటని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానికతపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సిజెఐ పై వ్యాఖ్యలు చేశారు. ఈ నిబంధనల వల్ల విద్యార్థుల హక్కులకు భంగం కలుగకూడదని సిజెఐ గవాయ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో విద్యార్థుల స్థానికతపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పదో తరగతి తర్వాత రెండేళ్లు బయటి రాష్ట్రంలో చదివి ఉంటే స్థానికత వర్తించదని తెలంగాణ ప్రభు త్వ ఉత్తర్వులపై పలువురు విద్యార్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఇందుకు సంబంధించిన నిబంధనలు రూపొం దించాలని ఆదేశించింది.
అసలు స్థానికత అంటే ఏమిటి? దీని పరిధిలోకి ఎవరు వస్తారు? అందుకు ఉన్న పరిమి తులపై ఉన్న నిబంధనలు, మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టు చెప్పింది. తమకు నిబంధనలు పెట్టడం ఏమిటని హైకోర్టు తీర్పును కొందరు విద్యార్థులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలను వినిపించారు. 4 ఏళ్ల చదువు లేదా నివాసంతో స్థానికత వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. చదువు కోసం కోటా (రాజస్తాన్), దుబాయ్ వెళ్తే స్థానికత వర్తించదంటే ఎలాగని ధర్మాసనం ప్రశ్నించింది. స్థానికతపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా నిబంధనలు ఉన్నాయని, అసోంలో ఏడేళ్ల నిబంధన ఉందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకవచ్చారు. తెలంగాణలో స్థానికత కోటా అంశంపై విచారణ ముగిస్తూ, తీర్పును ధర్మాసనం రిజర్వు చేసింది.
వివాదం ఏమిటి?
తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్స్‌లకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులలో ఇంటర్‌కు ముందు వరుసగా నాలుగేళ్ల పాటు రాష్ట్రంలో చదివితేనే స్థానికులుగా పరిగణిస్తామని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 33ను తీసుకువచ్చింది. దీనిని సవాల్ చేస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు స్థానికతకు సంబంధించిన నియమ నిబంధనలను కొత్తగా రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలపై విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేప థ్యంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాత్కాలికంగా కౌన్సెలింగ్ ప్రక్రియకు అనుమతించింది. కోర్టులో పిటిషన్ వేసిన 135 మంది వైద్య విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించింది.
హైకోర్టు ఉత్తర్వులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం, న్యాయశాఖలు కలిసి సంయుక్తంగా సమీక్ష చేశాయి. న్యాయస్థానం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత వైద్య విద్యార్థులను కౌన్సెలింగ్‌కు అనుమతించింది. కోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులకు సంబంధించిన మెరిట్ జాబితాను ప్రత్యేకంగా మరోసారి విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా, 4,090 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 15 శాతం సీట్లు ఆలిండియా కోటా కింద భర్తీ చేసి, మిగిలిన సీట్లు తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థుకు కేటాయిస్తున్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.