Thursday, May 2, 2024

ఇసిల నియామకంపై స్టేకు సుప్రీం నిరాకరణ

- Advertisement -
- Advertisement -

ఈ దశలో నిలిపివేస్తే గందరగోళం

సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ముందు ఈసీల నియామకం అంశం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం కొత్తగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని నిలిపివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు కాగా, దీనిపై కోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ దశలో నిలిపివేస్తే అది గందరగోళానికి , అనిశ్చితికి దారి తీస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే దీనిపై ఇప్పుడు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. ఈ సందర్భంగా ఇటీవల ఈసీలుగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ నియామకాలను కూడా ధర్మాసనం ప్రస్తావించింది. కొత్తగా నియమితులైన వారిపై ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొంది. “ ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ. అది పాలనాయంత్రాంగం కింద పనిచేస్తుందని చెప్ప కూడదు. ఈసీల నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం తప్పు అని భావించలేం. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ సమయంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం చాలా ముఖ్యం ” అని ధర్మాసనం అభిప్రాయపడింది.

కొత్త చట్టం ప్రకారం ఇటీవల చేపట్టిన ఈసీ నియామకాలపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. ఇక , ఈసీల నియామకం కోసం సీజేఐతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ 2023లో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. ఈ అంశంపై పార్లమెంట్ చట్టం చేసే వరకే తాత్కాలిక కమిటీ అమలులో ఉంటుందని తాము గతంలోనే స్పష్టం చేశామని తెలిపింది. అయితే కొత్త చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్లను తాము పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. వీటిపై ఆరు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ 5 నాటికి వాయిదా వేసింది. 2023 చట్టం రూపొందించక ముందు ఎన్నికల కమిషనర్ల నియామక తాత్కాలిక కమిటీలో ప్రధాని , సీజేఐ , లోక్‌సభలోవిపక్షనేత సభ్యులుగా ఉన్నారు. కొత్త చట్టం ప్రకారం ఏర్పడిన కమిటీలో సీజేఐ స్థానంలో కేంద్ర మంత్రికి చోటు కల్పించారు. దీన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై కేంద్రం బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. కొత్త చట్టంలో సీజేఐకు చోటు కల్పించక పోవడాన్ని సమర్థించుకుంది. కమిటీలో న్యాయ సభ్యుడు ఉంటేనే ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్న వాదన సరికాదని తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News