Thursday, May 2, 2024

దమ్మారో దమ్

- Advertisement -
- Advertisement -

Task Force Police Raid at Radisson Blu Hotel

‘పబ్’లో రేవ్‌పార్టీపై ‘టాస్క్‌ఫోర్స్’ మెరుపు దాడులు
ముగ్గురు అరెస్ట్..128 మందికి నోటీసులు
ఫుడింగ్ అండ్ మింక్ పబ్ సీజ్
పబ్‌లో కొకైన్,గంజాయి,ఎల్‌ఎస్‌డి స్ట్రిప్స్ స్వాధీనం
డ్రగ్స్ నమూనాలను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు తరలింపు
పోలీసుల దాడితో డ్రగ్స్‌ను కిటికీల్లోంచి విసిరేసిన వైనం
బంజారాహిల్స్ సిఐపై వేటు, ఎసిపికి చార్జిమోమో
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లోని ఫుడింగ్ మింక్ పబ్‌లో ఆదివారం అర్థరాత్రి రేవ్‌పార్టీపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి కొకైన్‌తో పాటు గంజాయి, ఎల్‌ఎస్‌డి స్ట్రిప్స్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈక్రమంలో రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో నిర్వహిస్తున్న రేవ్‌పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్,వెస్ట్, సెంట్రల్, నార్త్‌జోన్ పోలీసులు ఆదివారం రాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి 148మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దాడులు నిర్వహించిన అనంతరం పబ్‌లో ఉన్న 38మంది మహిళలు, 98 మంది యువకులు, 20మంది సిబ్బందిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిలో ప్రముఖ నటుడు,నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఎంపి గల్లా జయదేవ్ కుమారుడు అశోక్, మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమార్తెతో పాటు రాజకీయ, వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారికి సీరియస్ వార్నింగ్, కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. అనంతరం పబ్ నిర్వహకులు అభిషేక్ ముప్పాల, జనరల్ మేనేజర్ అనిల్ కుమార్, పబ్ యజమాని అర్జున్ వీరమాచినేనిలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా పబ్‌లో పోలీసుల తనిఖీల్లో కొన్ని రకాల డ్రగ్స్‌తో పాటు కొకైన్, ఎల్‌ఎస్‌డీ సిగరెట్లు, గంజాయి లభ్యమయ్యాయి. పబ్‌లో అప్పటికే 40 గ్రాముల కొకైన్ వాడేయగా 12 గ్రాములు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు దాడి చేయడంతో డ్రగ్స్ ను బాత్ రూములో, కిటికిలో నుంచి బయట పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫుడింగ్ మింక్ పబ్ బాతురూములో దొరికిన కొకైన్‌తో పాటు దాడుల సమయంలో కిటిలోనుంచి బయటపడిన 12 ప్యాకెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా పబ్‌లో చాక్లెట్ రోల్స్‌లో ఎల్‌ఎస్‌డి స్ట్రిప్స్ పెట్టుకుని డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. అయితే ఈ పుడింగ్ అండ్ మింక్ పబ్ ఖమ్మం మాజీ ఎంపి కూతురు నుంచి అభిషేక్ ఏడాది క్రితం లీజ్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు

128 మందికి నోటీసులు ః
బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ పబ్‌లో డ్రగ్స్ కేసులో డిజె ఆపరేటర్ వంశీధర్‌రావు, విఐపి మూవ్‌మెంట్‌ను చూసే కునాల్‌లతో పాటు మరో 128మందికి నోటీసులు ఇచ్చారు. సినీ, రాజకీయ, వ్యాపార కుటుంబాలకు చెందిన యువతీ యువకులు డ్రగ్స్ సేవిస్తూ పార్టీలో చిందులేస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిలో కొందరు డ్రగ్స్ సేవించి ఉంటారన్న అనుమానంతో రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. అనంతరం వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపారు. ఈ నేపథ్యంలోనే పబ్‌లో ఉన్న 148 మందిలో 128మందికి పోలీసులు నోటీసులిచ్చారు. అదేవిధంగా 128 మంది ఇంటి అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు సేకరించిన పోలీసులు నోటీసులు పంపారు.
‘కోడ్ లాంగ్వేజ్‌లో డ్రగ్స్ ః
పబ్‌లో కోడ్ లాంగ్వేజ్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఈక్రమంలో ఈ కేసులో కీలక నిందితులు కునాల్, వంశీధర్‌రావుల ఫోన్ చాటింగ్‌లో విఐపిల పర్సనల్ నంబర్లు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. కాగా డ్రగ్స్ పెడ్లర్లతో కునాల్‌కు లింకులున్నాయని, బ్రో, స్టఫ్, సోడా, కూల్ లాంటి కోడ్ లాంగ్వేజ్ ను డ్రగ్స్ సరఫరాలో వాడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రాగానే డ్రగ్స్ సేవిస్తున్నవారిని కునాల్ అలెర్ట్ చేశారని ఫుడింగ్ మింక్ పబ్‌లో క్లూస్ టీం సోదాల్లో విదేశీ మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు డ్రగ్స్‌కు సంబంధించిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేస్తున్నామని, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టుల ఆధారంగా మరికొందరిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొంటున్నారు.
సిసి పుటేజీ ఆధారంగా ‘డ్రగ్స్’ కేసు దర్యాప్తు ః
పబ్‌లో బయటపడిన డ్రగ్స్ కేసులో సిసి పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పబ్ నిర్వాహకుడు అభిషేక్, ఈవెంట్ మేనేజర్ అనిల్, విఐపి మూమెంట్ చూసే కునాల్, డీజే ఆపరేటర్ వంశీధర్‌రావులను పబ్‌లో డ్రగ్స్ వినియోగంపై విచారించారు. ఈ డ్రగ్స్ కేసుపై పోలీసు అధికారులతో సీపీ ఆనంద్ అత్యవసరంగా భేటీ అయ్యారు. పలువురు పోలీసుల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీవీ ఆనంద్ వెస్ట్‌జోన్‌లోని ఆయా పిఎస్‌ల ఎస్‌ఐలు , డిటెక్టివ్ సిఐలు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.పబ్‌లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కోసం ల్యాబ్‌కు పంపించారు. సాంకేతిక ఆధారాలు సేకరించే పనిలో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిమగ్నమయ్యారు. వెస్ట్‌జోన్, బంజారాహిల్స్, నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు పబ్‌లో ఎవరెవరు డ్రగ్స్ సేవించారు..? పబ్‌లో పట్టుబడిన కొకైన్, గంజాయి, ఎల్‌ఎస్‌డి ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా పబ్‌లోకి డ్రగ్స్ ఎలా చేరాయి..? ఎవరెవరు వినియోగించారు..? అన్న అంశాలపై పోలీసులు దృష్టిసారించారు. సిసి కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.
ఎవరినీ వదిలిపెట్టం ః సిపి సివి ఆనంద్
నగరంలో కలకలం రేపిన డ్రగ్స్ పార్టీలో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఈ డ్రగ్స్ కేసులో ఎవరినీ వదిలి పెట్టమని ఆయన స్పష్టం చేశారు. పోలీసలు దాడిలో దొరికిన 45 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నామన్నారు. వీళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం ఉందని కమిషనర్ చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారని సిఐ శివచంద్ర సస్పెన్షన్ వేటు వేసినట్టు కమిషనర్ తెలిపారు. అలాగే విధుల పట్ల నిర్లక్షం వహించిన ఎసిపి సుదర్శన్‌కు చార్జ్ మెమో జారీ చేశామని కమిషనర్ వెల్లడించారు.
సిఐ, ఎసిపిలపై వేటు:
పబ్ డ్రగ్స్ కేసులో పోలీసు ఉన్నతాధికారులు బంజారాహిల్స్ సిఐ, ఎసిపిలపై చర్యలు తీసుకున్నారు. బంజారాహిల్స్ సిఐ శివచంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే ఎసిపి సుదర్శర్‌కు ఉన్నతాధికారులు ఛార్జ్ మెమో దాఖలు చేశారు. గతంలోనే పబ్‌పై ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదనే ఆరోపణలతో పాటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలోని డ్రగ్స్ దందా బయటపడటంపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై స్థానికులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్ ఓ మాజీ ఎంపి కూతురిది కావడంతో నిబంధనలు మీరి తెల్లవారుజాము 3 గంటల వరకు పబ్ నడిపినా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కొత్త సిఐగా నాగేశ్వరరావు ః
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు కొత్త సిఐగా నాగేశ్వరరావును నియమిస్తూ కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నాగేశ్వరరావు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌లో సిఐగా పనిచేస్తున్నారు. సిఐ నాగేశ్వరరావు టీమ్ తాజాగా పబ్‌లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ గుట్టు రట్టు చేయడంతో పాటు గతంలో ఎన్నో సంచలన కేసులు ఛేదించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిఐ శివచంద్ర సస్పెండ్ కావడంతో అతని స్థానంలో నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు. ఇదిలావుండగా గతంలో సిఐ శివచంద్రపై సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు వున్నాయి. పబ్‌లపై నిఘా పెట్టకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై వేటు వేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
బార్‌కు 24 గంటల అనుమతి ః ఎక్సైజ్ శాఖ
నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా బార్ అండ్ రెస్టారెంట్‌కు సెప్టెంబర్ వరకు 24 గంటలు నడుపుకోవడానికి అనుమతి ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణకు లైసెన్స్ ఫీజు కింద రూ.52,66,700, 24 గంటలు బార్ నడుపుకోడానికి అదనంగా మరో రూ.14లక్షలు రాడిసన్ బ్లూ ప్లాజా బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం చెల్లించినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. నాలుగు అంతకంటే ఎక్కువ స్టార్స్ ఉన్న హోటల్స్ 24 గంటలు బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహించుకోడానికి అనుమతి ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.పోలీసులు దాడులు నిర్వహించిన సమయంలో మాదకద్రవ్యాలు లభ్యమైనట్లు తమకు సమాచారం ఉందని పోలీసు శాఖ విచారణ అనంతరం నివేదిక ఆధారంగా ఎక్కడైన బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘనలకు పాల్పడి ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే రాడిసన్ బార్‌కు చెందిన అన్ని కాగితాలను పరిశీలించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. పత్రాల వరకు అన్ని సక్రమంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
నా కుమారుడికి సంబంధం లేదు: అంజన్‌కుమార్ యాదవ్
రాడిసన్ పబ్ లేట్ నైట్ పార్టీపై కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హోటల్ రాడిసన్‌లో బర్త్ డే పార్టీకి తన కుమారుడు వెళ్లాడని, అయితే డ్రగ్స్ పార్టీకి.. తన కొడుక్కీ సంబంధం లేదన్నారు. కావాలనే తన కుమారుడిని ఇందులో ఇరికిస్తున్నారని అన్నారు. అసలు లేట్ నైట్ పార్టీలు జరిగితే వైఫల్యం ఎవరిదని ఆయన ప్రశ్నించారు. పబ్‌లు తెల్లవారు జాము వరకు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే పబ్బులన్నీ మూసివేయాలని అంజన్‌కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
నా కూమార్తె తప్పులేదు ః నాగబాబు
రాడిసన్ బ్లూ హోటల్ పబ్ డ్రగ్స్ కేసులో తన కుమార్తె నిహారికకు ఎలాంటి సంబంధం లేదని నటుడు, నిర్మాత నాగబాబు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి తన కుమార్తె అక్కడ ఉన్న మాట వాస్తమేనని, పరిమిత సమయానికి మించి పబ్ కొనసాగడం వల్ల పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. అయితే ఈ విషయంలో నిహారికది ఎలాంటి తప్పు లేదని పోలీసులు తెలిపారని వెల్లడించారు. ఈ కేసుపై సామాజిక మాద్యమాలు, తప్పుగా ప్రచారం చేయడం సబబు కాదని నాగబాబు విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు.
తేజస్వినికి సంబంధం లేదు: మాజీ ఎంపి రేణుకాచౌదరి
రాడిసన్ బ్లూ హోటల్‌లో ఉన్న బార్, పుడ్డింగ్ మరియు మింక్‌పై పోలీసుల దాడికి సంబంధించి తన కుమార్తె తేజస్వినిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి పేర్కొన్నారు. తన కుమార్తె శ్రీమతి తేజస్విని చౌదరి గురించి చేపడుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. తన కుమార్తె పుడ్డింగ్ మింక్‌ల యజమాని కాదని తేల్చిచెప్పారు. పబ్‌లో పోలీసుల రైడింగ్ సమయంలో తన కుమార్తె అక్కడ లేదని, పోలీసులు విచారణలో భాగంగా ఆమెను అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. ఇదిలావుండగా గతంలో బంజారాహిల్స్ రాడిసన్ హోటల్‌లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌ను రేణుకాచౌదరి కుమార్తె తేజస్విని చౌదరి నిర్వహిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ పబ్ ఆయుర్వేదిక్ కాక్‌టైల్స్‌కు కేరాఫ్ అంటూ తేజస్విని చెప్పుకొచ్చారు. నో హ్యాంగోవర్ డ్రింగ్స్ సర్వ్ చేస్తామని, ఏ క్లాస్ కస్టమర్ల కోసమే స్పెషల్‌గా నడిచే పబ్ అంటూ పుడ్డింగ్ అండ్ మింక్ గురించి ఆమె చెప్పడంతో పబ్‌తో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆ పబ్‌కే వెళ్లలేదు: నటి హేమ
ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ తనకు సంబంధం లేకపోయినప్పటికీ తన పేరుని ప్రచారం చేస్తున్నారని నటి హేమ ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తోన్న వారిపై ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాను అసలు పబ్‌కే వెళ్లలేదని, డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదని ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కొందరు కావాలనే నా పేరుని ప్రచారం చేస్తున్నారి నటి హేమ తెలిపారు. తన పరువుకు భంగం కల్గించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకే బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చానని ఆమె వివరించారు.

Task Force Police attack on PUB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News