Friday, May 3, 2024

ఆత్మవిశ్వాసం పెంచే గెలుపిది

- Advertisement -
- Advertisement -

Team India solid victory in second Test against England

విరాట్ సేనలో కొత్త జోష్

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో చారిత్రక లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కనీసం డ్రాతో అయినా భారత్ గట్టెక్కుతుందా అనే స్థితి నుంచి ఏకంగా మ్యాచ్‌నే సొంతం చేసుకుని విరాట్ కోహ్లి సేన పెను ప్రకంపనలే సృష్టించింది. సోమవారం చివరి రోజు టీమిండియా ఆరంభంలోనే రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ వికెట్లను కోల్పోవడంతో జట్టుకు ఓటమి ఖాయమని అందరూ ఓ అంచనాకు వచ్చేశారు. జస్‌ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమి, సిరాజ్‌లు మాత్రమే మిగిలివుండడంతో భారత్ ఆధిక్యం 190కి చేరడమే కష్టమని భావించారు. అయితే షమి, బుమ్రాలు మాత్రం కీలక సమయంలో బ్యాట్‌కు పని చెప్పారు. ఇంగ్లండ్ బౌలర్లు వరుస బౌన్సర్లతో హడలెత్తిస్తున్నా బుమ్రా, షమి ఏ మాత్రం భయ పడలేదు. వారి దాడులను సమర్థంగా తిప్పికొడుతూ క్రీజులో పాతుకుపోయారు.

బుమ్రాకు పలు సార్లు బౌన్సర్లు గట్టిగానే తగిలినా అతను మాత్రం ఏ స్థితిలో కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. ప్రత్యర్థి బౌలర్లు ఎంత కవ్వించినా చలించలేదు. అతని మొండి తనాన్ని చూసి కెప్టెన్ విరాట్‌తో సహా సహచరులు కూడా ఆశ్చర్య పోయారు. ఇక షమి కూడా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌లాగా బ్యాటింగ్ చేశాడు. ఇటు బుమ్రా, అటు షమి కుదురు కోవడంతో ఈ మ్యాచ్‌లో భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయాలనే ఆతిథ్య ఇంగ్లండ్ ఆశలు నీరుగారి పోయాయి. బుమ్రా, షమి కెరీర్‌లలోనే చిరకాలం గుర్తుండి పోయే ఇన్నింగ్స్‌లతో భారత్‌ను మ్యాచ్‌ను శాసించే స్థితికి చేర్చారు. అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన షమి 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. బుమ్రా కూడా 34 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు.

చారిత్రక ప్రదర్శనతో..

ఇక షమి, బుమ్రాల బ్యాటింగ్ టీమిండియాలో కొత్త జోష్ నింపింది. అప్పటి వరకు ఓటమి భయాన్ని ఎదుర్కొన్న భారత్‌లో ఒక్కసారిగా నయా జోష్ కనబడింది. బుమ్రా, షమి చిరస్మరణీయ బ్యాటింగ్‌తో జట్టును సురక్షిత స్థితికి చేర్చడంలో సఫలమయ్యారు. దీంతో మ్యాచ్‌ను గెలవాలనే పట్టుదలతో కెప్టెన్ కోహ్లిలో పెరిగి పోయింది. కీలక సమయంలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసి అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో సహచరుల్లో కొత్త జోష్‌ను నింపాడు. ఇంగ్లండ్‌ను ఓడించేందుకు తగినన్ని ఓవర్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి బౌలర్, ప్రతి ఫీల్డర్ తమవంతు సహకారం అందిస్తే ఈ మ్యాచ్‌ను గెలవడం అసాధ్యమేమీ కాదని జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపడంలో కోహ్లి సఫలమయ్యాడు. కోహ్లి తమపై పెట్టుకున్న నమ్మకాన్ని బుమ్రా, షమి నిలబెట్టారు. ఇద్దరు ఇంగ్లండ్ ఓపెనర్లను సున్నాకే వెనక్కిపంపి భారత్‌కు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు.

ఆ తర్వాత ఏ దశలోనూ ఇంగ్లండ్ కోలుకోలేక పోయింది. ఎప్పటిలాగే కెప్టెన్ జో రూట్ తన పోరాటాన్ని కొనసాగించాడు. అయితే ఈసారి అతన్ని ఎక్కువ సేపు క్రీజులో నిలువనీయకుండా చేయడంలో భారత బౌలర్లు పైచేయి సాధించారు. ప్రమాదకర రూట్‌ను స్పీడ్‌స్టర్ బుమ్రా వెనక్కి పంపి భారత్‌కు ఊరటనిచ్చాడు. ఇక ఇషాంత్ కూడా కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు హైదరాబాదీ యువ సంచలనం మహ్మద్ సిరాజ్ కూడా చివర్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. భారత్‌కు కొరకరాని కొయ్యగా మారిన జోస్ బట్లర్‌ను వెనక్కి పంపడం ద్వారా అతి పెద్ద అడ్డంకిని తొలగించాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రాకు మూడు, సిరాజ్‌కు నాలుగు, ఇషాంత్‌కు రెండు, షమి ఒక వికెట్ లభించింది. ఇలా పది వికెట్లను కూడా ఫాస్ట్ బౌలర్లే పడగొట్టారు. పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించక పోయినా టీమిడియా బౌలర్లు సమష్టి ప్రతిభతో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను 120 పరుగులకే పరిమితం చేశారు.

సమష్టి పోరాటం వల్లే..

ఈ మ్యాచ్‌లో భారత్ చారిత్రక విజయానికి సమష్టి పోరాటమే కారణమని చెప్పక తప్పదు. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును వారి సొంత గడ్డపై ఓడించడం ఏ జట్టుకైనా అనుకున్నంత తేలికేం కాదు. అయితే భారత్ మాత్రం సమష్టిగా పోరాడి ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్.రాహుల్, సీనియర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె, కెప్టెన్ విరాట్ కోహ్లి తమవంతు పాత్ర పోషించారు. బౌలింగ్‌లో బుమ్రా, ఇషాంత్, షమి, సిరాజ్‌లు కలిసి కట్టుగా ప్రత్యర్థి వికెట్ల పతనాన్ని శాసించారు. ఇలా బౌలర్లు, బ్యాట్స్‌మెన్ తమవంతు పాత్ర పోషించడంతో రెండో టెస్టులో భారత్ చారిత్రక గెలుపును అందుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News