Tuesday, August 5, 2025

సిఐడికి కాళేశ్వరం?

- Advertisement -
- Advertisement -

అధికారుల కమిటీ 60 పేజీల సారాంశంపై మంత్రివర్గం భేటీలో 3 గంటల పాటు చర్చ
పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌లోని అంశాలను
పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా మంత్రులకు వివరించిన మంత్రి ఉత్తమ్
గత ప్రభుత్వం చేసిన అవినీతి, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై
ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చించిన సిఎం, మంత్రులు
అసెంబ్లీ, మండలిలో చర్చించి కేసును సిఐడికి బదిలీ చేయాలని నిర్ణయించిన కేబినెట్
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం సుమారు మూడుగంటల పాటు జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఈ సమావేశంలో కీలక చర్చించారు. 650 పేజీల జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్‌ను అధ్యయనం చేసిన అధికారుల కమిటీ 60 పేజీల సారాంశాన్ని తయారు చేసి కేబినెట్‌కు సమర్పించింది. ఈ నేపథ్యంలోనే 60 పేజీల సంక్షిప్త నివేదికలో 32 సార్లు కెసిఆర్, 19 సార్లు హరీష్ రావు, 5 సార్లు ఈటల పేరు ప్రస్తావించడాన్ని కేబినెట్ సీరియస్‌గా చర్చించినట్టుగా తెలిసింది. బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసిందని, అప్పటి కేబినెట్ అనుమతి ఉందని అప్పటి ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కమిషన్ తన నివేదికలో ప్రస్తావించడంపై కూడా మంత్రిమండలి కూలకుషంగా చర్చించినట్టుగా తెలిసింది. అప్పుడు ఆర్ధిక మంత్రిగా ఉన్న ఈటల ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా వ్యవహారించారని కమిషన్ తప్పుపట్టడం, కొందరు అధికారులు తప్పుడు సాక్ష్యాలు సమర్పించారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించడం లాంటి విషయాలపై మంత్రివర్గం మంత్రుల అభిప్రాయాలను సేకరించినట్టుగా తెలిసింది.

కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, కమిషన్ ఇచ్చిన నివేదికపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కేబినెట్ సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఈ అవినీతిలో ఎవరి భాగస్వామ్యం ఎంత, అధికారుల పాత్ర గురించి కూడా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంత్రులకు తెలియచేసినట్టుగా సమాచారం. దీంతోపాటు కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించినట్టుగా తెలిసింది. అనంతరం ఈ కేసును సిఐడికి బదిలీ చేసే అవకాశం ఉందని సమాచారం.

ఏ రాష్ట్రంలో ఎలాంటి చర్యలు?
కాగా, కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించినట్టుగా తెలిసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) మొదలు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అనేక లోపాలు, అక్రమాలు జరిగినట్లు తెలపడమే కాక ఏ వైఫల్యానికి ఎవరు బాధ్యులో కూడా కమిషన్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే న్యాయ విచారణ కమిషన్‌లు ఇచ్చిన నివేదికలు, నివేదికలు ఇచ్చినపుడు గతంలో ఏ రాష్ట్రంలో ఎలాంటి చర్యలు చేపట్టారు, తదుపరి కార్యాచరణ ఏమిటన్న దానిపై కేబినెట్‌లో చర్చించినట్టుగా సమాచారం.

అధికారుల కమిటీ ఇచ్చిన 60 పేజీల నివేదికలోని పలు అంశాలు ఇలా….
అధికారుల కమిటీ 650 పేజీల జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్‌ను అధ్యయనం చేసిన అధికారుల కమిటీ 60 పేజీల నివేదికను అందచేయగా అందులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా నిబంధనలకు పాతరేశారని అధికారుల కమిటీ తమ నివేదికలో తెలిపింది. ఈ మేరకు ఓ బ్రీఫ్ నోట్ విడుదల చేసింది. ‘మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణ నిర్ణయం అప్పటి సిఎం కెసిఆర్‌దేనని తెలిపింది. నిపుణుల కమిటీ నివేదికను అప్పటి సిఎం కెసిఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావులు పక్కకు పెట్టారని అధికారుల కమిటీ తెలిపింది. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్నది సహేతుక కారణం కాదని తెలిపింది. బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ అప్రూవల్ లేదని, వ్యాప్కోస్ నివేదిక, డిపిఆర్ కంటే ముందే బ్యారేజీల నిర్మాణానికి రెడీ అయ్యారని కమిటీ పేర్కొంది. టెండర్లు, ఓ అండ్ ఎం డిజైన్, నాణ్యతలో లోపాలున్నాయని, బ్యారేజీల నిర్మాణానికి పూర్తి బాధ్యత అప్పటి సిఎం కెసిఆర్‌దేనని కమిటీ తెలిపింది.

బ్యారేజీ ఏడో బ్లాక్‌ను ఎల్ అండ్ టి సంస్థనే పునరుద్ధరించాలి
అప్పటి సిఎం కెసిఆర్ జవాబుదారీతనం, పాలనాపరమైన విధానాలు పాటించలేదని కమిటీ పేర్కొంది. పాలనా విధానాలు అనుసరించకుండా హరీశ్‌రావు ఆదేశాలు ఇచ్చారని, ఆర్ధిక జవాబుదారీతనాన్ని అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఈటల పాటించలేదని, కాళేశ్వరం బోర్డులో అధికారులు ఉన్నా వారికి సంబంధం లేదని ఈటల చెప్పారని కమిటీ నివేదికలో తెలిపింది. ప్రణాళిక, నిర్మాణం, ఓ అండ్ ఎం, నీటి నిల్వ, ఆర్థిక అంశాలకు అప్పటి సిఎందే బాధ్యత అని, ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థతో కుమ్మక్మయ్యారని, మేడిగడ బ్యారేజీ నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమయ్యిందని పేర్కొంది. బ్యారేజీలు దెబ్బతినడానికి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని కమిటీ సూచించింది. నిర్మాణ స్థలం మార్పు, అంచనాల సవరింపులో అవకతవకలున్నాయని, డిజైన్ల లోపాలు, నాణ్యత తనిఖీలు లేకపోవడంతోనే నష్టం జరిగిందని పేర్కొంది. ప్రజాధనం దుర్వినియోగానికి బోర్డు సభ్యులు కూడా బాధ్యులని కమిటీ తెలిపింది. కాళేశ్వరం బోర్డులోని అధికారులపై క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించిందని కమిటీ పేర్కొంది. మేడిగడ్డ నిర్మాణంపై ఎల్ అండ్ టి సంస్థకు ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వొద్దని, బ్యారేజీ ఏడో బ్లాక్‌ను ఆ సంస్థ పునరుద్ధరించాలి. ఇతర అనకట్టల్లో లోపాల సవరణ కూడా చేయాల్సిందేనని ఈ వ్యయాన్ని ఎల్ అండ్ టి సంస్థనే భరించాలని అధికారుల కమిటీ తెలిపింది..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News