Thursday, May 2, 2024

కెసిఆర్‌ను దేశం పిలుస్తోంది

- Advertisement -
- Advertisement -

Triangle fight in 2023 TS Assembly Elections 

మొదటి వాడు… మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే… దేశాన్ని మార్చే ప్రయోగం మొదలుపెట్టేటప్పుడు ఏదైనా ఒంటరే. వేసే ఆ అడుగు ధైర్యంగా వేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ అదే చేస్తున్నారు. ఇపుడు కెసిఆర్‌ను దేశం పిలుస్తోంది. ఎనిమిదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా దేశం లో తనదైన ముద్ర వేసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజనీతిజ్ఞుడు. ఉద్యమకారుడిగా, ప్రత్యేక రాష్ట్ర విధాతగా, పరిపాలకుడిగా సమకాలీన దేశ రాజకీయ పటంలో ఆయనకు ఆయనే సాటి. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేసి ప్రపంచ వేదికపై తెలంగాణ దిక్సూచిని చూపించారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా దూరదృష్టితో ఎనిదేళ్ల కాలంలో ఆయన చూపిన బాట ఇప్పుడు దేశానికి కొత్త దారి చూపిస్తోంది. కాళేశ్వరం కెసిఆర్ అవసరం ఇప్పుడు దేశానికి ఎందుకు ఉందో తెలంగాణలో ఆయన నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ప్రత్యక్ష నిదర్శనం. తెలంగాణలో ప్రాజెక్టుల పేరు చేబితేనే పదేళ్లు… ఇరవై ఏళ్లు గడిచినా అడుగు ముందుకు పడేది కాదు.. భూసేకరణ దగ్గరో.. అనుమతుల దగ్గరో ఆగిపోయేది.

ఇలాంటివి ఎన్నో సాక్ష్యాలు కళ్లముందే కనిపిస్తాయి. తొలి సియంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే కెసిఆర్ దృష్టి పెట్టింది సాగునీటి ప్రాజెక్టులపైనే. నెర్రలు బారిన తెలంగాణను కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆకుపచ్చని రాష్ట్రంగా చేశారు. దేశంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని అతి తక్కువ సమయంలో పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. 80,500 కోట్ల వ్యయంతో తెలంగాణలోని 13 జిల్లాలకు ప్రయోజనం కలిగేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి నది నుంచి రోజూ రెండు టిఎంసిల నీటి చొప్పున 180 టిఎంసిలు ఎత్తిపోయడం ఈ పథకం ఉద్దేశం. రాష్ట్రం ఏర్పడి రెండుళ్లు తిరగకుండానే 2016, మే 2న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి రికార్డు సమయంలో పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ- స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. తెలంగాణలోని 195 టిఎంసి నీటిని వెనుకబడిన ప్రాంతాలకు మళ్లించి ఈ ప్రాజెక్టు నిర్మించి కల సాకారం చేశారు. 80 వేల ఎకరాల భూసేకరణ. 6200 నిర్వాసిత కుటుంబాలను సెటిల్ చేసి అడ్డంకులు అన్నింటినీ అధిగమించారు. రాష్ట్ర బడ్జెట్లో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకే 25 శాతం కేటాయించి ఖర్చు చేయడంతో తెలంగాణ ముఖచిత్రాన్నే మార్చి వేసింది. ఈ ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కెసిఆర్ పని తీరుకు కొలమానం లాంటిది.

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం తెలంగాణ ఏర్పడుతుందని ఎవరూ ఊహించలేదు… ఒక్క కెసిఆర్ తప్ప. అందరూ అసాధ్యమే అనుకున్నారు. కెసిఆర్ … టిఆర్‌ఎస్ కూడా మఖలో పుట్టి పుబ్బలో అస్తమించేదే అని అంచనా వేశారు. మిణుగురులు కూడా చూడటానికి చిన్నగా ఉంటాయి. వాటి వెలుగుతో చీకటి ని పోగొట్టినట్టే కన్నీళ్లను, కష్టాలను దిగమింగి తెలంగాణ అనే దీపాన్ని వెలిగించారు కెసిఆర్. దారి చాలా దూరం అని తెలిసినా ప్రయత్నం మాత్రం ఆపలేదు. రెండు ఎంపి సీట్లున్న ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు … దేశంలోని అన్ని పార్టీలను ఒప్పించడం ఒక చరిత్ర. పార్టీలు… రాజకీయాలకు అతీతంగా సమాజాన్ని ఒక్క తాటిపై నడపడం ఆయనకే సాధ్యమైంది. రాజకీయ వ్యూహాల్లో ఆయనను మించినవారు లేరు. ఎక్కడ తగ్గాలో… ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన వ్యక్తి. చిన్ననాటి నుంచి రాజకీయమే జీవితంగా ఎదిగారు. సమితి ప్రెసిడెంట్ నుంచి కేంద్రమంత్రి దాకా… ఉద్యమకారుడి నుంచి ముఖ్యమంత్రి దాకా ఆయన గడించిన అనుభవం ఇప్పుడు దేశానికి అసవరం ఉంది. దేశానికి కెసిఆర్ అవసరం అనుభవం – దూరదృష్టి. ఈ రెండు ఎవరికైనా రెండు కళ్లు లాంటివి. తనకున్న అనుభవంతో అంచనా వేయడం ముఖ్యం. ఇదే విజయానికి రాచబాట. కెసిఆర్ తనకున్న అనుభవాన్ని దూరదృష్టితో మేళవించి తెలంగాణను నెంబర్‌వన్ అనిపించారు. వెనకబడిన తెలంగాణ నుంచి దేశం తెలంగాణ వైపు చూసేలా చేశారు.

కెసిఆర్ వినూత్న ఆలోచనలు, పథకాలు, సంక్షేమమే ఇందుకు ప్రధాన కారణం. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతు భరోసా, కల్యాణలక్ష్మీ, కెసిఆర్ కిట్టు, ఇంగ్లీషు మీడియం గురుకులాలు తెలంగాణ ప్రజలను మెప్పించాయి. అన్ని రాష్ట్రాలు తెలంగాణలో స్టడీ కోసం వస్తున్నారు. కెసిఆర్‌ను ఎక్కువ సీట్లలో అధికారంలో కూర్చోబెట్టడానికి కారణం ఇవే. ఉద్యమ సమయంలో కెసిఆర్ లెక్కలేనన్ని శిక్షణ తరగతులు పెట్టేవారు. కెసిఆర్ అప్పుడే రాబోయే రోజుల్లో ఏర్పడబోయే తెలంగాణ ఎలా ఉండాలో చెప్పేవారు. ఇది పదే పదే కెసిఆర్ చెప్తుంటే కొందరికి నమ్మకం కుదిరేది కాదు. ఇప్పుడు తెలంగాణలో అమలయ్యే పథకాల్లో చాలా వరకు కెసిఆర్ అప్పట్లోనే ప్లాన్ చేసుకున్నవే. అందుకే ఇప్పుడు దేశ ప్రజలకూ కెసిఆర్ అసవరం ఉంది. ప్రత్యామ్నాయ ఎజెండా జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు గురించి కెసిఆర్ మాట్లాడితే చాలా మందికి అనుమానాలు ఉండొచ్చు. తెలంగాణ ఏర్పాటు సమయంలోనూ అందరికీ ఇలాంటి అనుమానాలే ఉండేవి. కెసిఆర్ జాతీయ రాజకీయాలపై మాట్లాడితే కొత్త పార్టీ, కూటమి అనే చర్చతెరపైకి వస్తోంది. కొత్త పార్టీలు…

కూటమిలతో మార్పు సాధ్యం కాదని కెసిఆర్‌కు తెలుసు. అందుకే ప్రత్యామ్నాయ ఎజెండా కోసం కెసిఆర్ ప్రయత్నం మొదలుపెట్టారు. ఆర్థిక వేత్తలు.. సివిల్ సర్వెంట్లు, విద్యావేత్తలు, మేధావులతో చర్చలు మొదలుపెట్టారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్ సూపర్ పవర్ కంట్రీగా మారడానికి అడుగులు పడాలని ఆకాక్షిస్తున్నారు కెసిఆర్. మానవ వనరులు పుష్కలంగా ఉన్న మన దేశం చైనా, అమెరికా, జపాన్ లాంటి దేశాలతో పోటీ పడలేకపోవడం… ప్రజల మధ్య మత చిచ్చు పెట్టే రాజకీయాలకు మంగళం పాడాలని కెసిఆర్ అడుగులు వేస్తున్నారు. సంపూర్ణంగా నదీ జలాల వినియోగం ప్రాంతం ఏదైనా.. దేశమేదైనా నీటితోనే అభివృద్ధి ముడిపడి ఉంది.

వ్యవసాయంపై 80 శాతం మంది ఆధారపడి ఉన్న మనలాంటి దేశంలో ఇది మరింత అవసరం. అందుబాటులో ఉన్న జలాలను సంపూర్ణంగా వాడుకుంటే అభివృద్ధి పరుగులను ఆపలేరు. మన దేశంలో 65 వేల టిఎంసిల నదీ జలాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా టిబెట్ నుంచి వస్తున్న మరో నాలుగు ఐదు వేల టిఎంసిల నీళ్లపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటి దాకా కేవలం 29 వేల టిఎంసిలను మాత్రమే దేశంలో వినియోగించుకుంటున్నాం. దేశ వ్యాప్తంగా ఎక్కడ ప్రాజెక్టులు.. బ్యారేజీలు అవసరం ఉందో గుర్తించాలి. ఇందుకోసం సమగ్ర వ్యూహం కావాలి. యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలి.

కెసిఆర్ జాతీయ రాజకీయ ప్రత్నామ్నాయ ఎజెండాలో వ్యవసాయం… ప్రాజెక్టులకు టాప్ ప్రయారిటీ ఉంది. రైతు బాగు పడితే దేశం బాగుపడుతుందని ఊరికనే అనలేదు. భూమి మీద… రైతు మీద ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఆధారపడ్డ వారి సంఖ్యే ఈ దేశంలో ఎక్కువ. కేవలం రాజకీయాల కోసమే రాజకీయం కాదు… ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండాను కోరుకుంటుంది ఇందుకోసమే. దేశంలో తెలంగాణ ఏర్పాటు నాటి పరిస్థితులు లక్ష్యం మంచిదైతే అంతా మంచే జరుగుతుంది అంటారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఉన్న సానుకూల పరిస్థితులు ఇపుడు కెసిఆర్ ముందు కనిపిస్తున్నాయి. తెలంగాణకు మద్దతు ఇవ్వడం అప్పట్లో కొందరికి అవసరం మరికొందరికి అనివార్యం. ఇప్పుడు దేశ రాజకీయాల్లో మార్పు కోసం బయలుదేరిన కెసిఆర్ రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. కలిసిరావేమో అనుకున్న శక్తులు కూడా చేతులు కలుపుతున్నాయి. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను గాలి కొదిలేసి ప్రజల మధ్య అగాధం పెంచి సృష్టిస్తున్నారు. పసిమనసుల్లో రాజకీయం కోసం విషం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం చెప్పింది. ఎనిమిదేళ్ళ లో కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది శూన్యం.

తెలంగాణ లాంటి రాష్ట్రంలో లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి కొత్తగా 80 వేలకు పైగా ఖాళీల భర్తీకి రెడీ అవుతోంది. రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకునే రాజకీయం నడుస్తుంది. ఏళ్ల తరబడి ఉన్న జల వివాదాలను పరిష్కరించకుండా మరింత జటిలం చేస్తున్నారు. గవర్నర్ లాంటి వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వాలపైకి గవర్నర్లను ఎగదోస్తున్నారు. ఇక సిబిఐ, ఇడి లాంటి విచారణ సంస్థలను బిజెపి యేతర ప్రభుత్వాలపైకి మాత్రమే ప్రయోగిస్తున్నారు. దేశ సంపదను ఓకే రాష్ట్రానికి చెందిన కార్పొరేట్ లకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో సమస్యకు పరిష్కార మార్గం చూపుతున్న కెసిఆర్ వైపు దేశం చూస్తోంది. దేశాన్ని నిట్టనిలువునా మతం పేరుతో చీల్చేస్తున్న ఈ సమయంలో ఒక్కతాటిపై నిలిపే ఎజెండా కావాలి. అందుకే కెసిఆర్‌ను దేశం పిలుస్తోంది.-

కర్నాటి విద్యాసాగర్
9491393999
(టిఆర్‌ఎస్ మునుగోడు నియోజకవర్గం)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News